జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, భారత జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం, తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపెనీలు పాల్గొన్న మేళాకు 2,184 మంది నిరుద్యోగులు హాజరు కాగా, 730 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందజేసి, అభినందించారు.
– ధర్మపురి, ఆగస్టు 13
ధర్మపురి,ఆగస్టు 13: మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన వచ్చింది. ఐటీ, బ్యాంకింగ్, ఫార్మా, వైద్యం తదితర రంగాలకు చెందిన 60 ప్రముఖ కంపనీలు పాల్గొనగా… 2,184 మంది నిరుద్యోగులు హాజరయ్యారు. 730 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్, భారత జాగృతి ఆధ్వర్యంలో ధర్మపురి లక్ష్మీనరసింహ ఏసీ గార్డెన్స్‌లో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్‌మేళాకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు. వివిధ ప్రముఖ కంపనీల ఆధ్వర్యంలో 60 స్టాళ్లను ఏర్పాటు చేసి యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. సర్టిపికేట్లతో పాటు వారి సామర్థ్యాన్ని బట్టి వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యువతకు భోజన సౌకర్యం కల్పించారు. జాబ్ మేళా నిర్వహించిన ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్, భారత జాగృతి సభ్యులను మంత్రి ఈశ్వర్ అభినందించారు. అలాగే ఉద్యోగాలు పొందిన యువతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, కరీంనగర్ జిల్లా భారత జాగృతి అధ్యక్షుడు జాడి శ్రీనివాస్, ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ కో-ఆర్డినేటర్లు నూతి మల్లయ్య, మామిడాల రవీందర్, అనంతుల లక్ష్మణ్, చిలవేరి శ్యాంసుందర్, రాపర్తి విజయలక్ష్మి, అపర్ణ, స్వేచ్ఛ, రమాదేవి, గంగాధర రాజేశం, నరహరి, జాగృతి నాయకులు కాశెట్టి విజయ్, సురేశ్, సత్యం తదితరులున్నారు.
అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
అవకాశాలను యువత సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిరపడాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. జాబ్‌మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి యువతను ఉద్ధేశించి మాట్లాడారు… 60 ప్రముఖ కంపెనీలు జాబ్ మేళాలో పాల్గొనగా దాదాపు 3వేల మంది యువత సద్వినియోగం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. యువత చదువు పూర్తి చేసుకున్న అనంతరం తల్లిదండ్రులకు భారం కాకుండా చిన్న ఉద్యోగం వచ్చినా చేరాలని, తర్వాత జీవితంలో పైస్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. బావిలో కప్పల్లా గిరిగీసుకొని బతకొద్దని, భవిష్యత్‌కు బాటలు వేసుకొని విజేతలుగా నిలవాలని యువతను ప్రేరేపించారు. అలాగే అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం సాధ్యం కాదని, ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థాయికి ఎదగొచ్చన్నారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు హద్దులుంటాయని, ఎంత గొప్పగా పనిచేసినా సమాన వేతనం ఉంటుందని, అందరితో పాటే పదోన్నతులుంటాయని, అదే ప్రైవేట్ రంగంలో అకాశమే హద్దుగా అభివృద్ధి ఉంటుందన్నారు. ఎంత గొప్పగా పనిచేస్తే అంత గుర్తింపు వస్తుందని, ఆర్థికంగా కూడా బలపడతారని తెలిపారు. సత్య నాదెళ్ల, సుందర్‌పిచాయ్ సాధారణ ఉద్యోగులుగా ఆరంభించి వారి నైపుణ్యాలను పెంపొందించుకొని కంపెనీల అధినేతలుగా ఎదగారని గుర్తుచేశారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జీవితంలో స్థిర పడాలన్నారు. ఎల్ఎమ్ కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవాకార్యక్రమాలను నిర్వహిస్తున్నదని, గత సంవత్సరం బతుకమ్మ సంబురాల కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహించారన్నారు. ఇప్పుడు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఎల్ఎమ్ కొప్పుల సోషల్ సర్వీస్ చైర్పర్సన్ స్నేహలతను, సభ్యులను, జాగృతి సభ్యులను మంత్రి ఈశ్వర్ అభినందించారు.
ఉద్యోగం సాధించాను
మాది గుల్లకోట గ్రామం. నేను మా గ్రామంలోనే వ్యవసాయం చేస్తున్నాను. ఏదైనా ఉద్యోగం దొరికితే బాగుండునని అనుకునేవాడిని. మంత్రి ఈశ్వర్ సారు ఎల్ఎమ్ ట్రస్ట్ ద్వారా ధర్మపురిలో జాబ్‌మేళా పెడుతున్నారని తెలిసింది. నేను పదో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాను. ఉద్యోగం వస్తుందో.. రాదోననే భయంతోనే వచ్చాను. నా ఉద్యోగ అర్హతను చూసి ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీ వారు రెనో హాస్పిటల్లో వార్డు బాయ్‌గా ఉద్యోగం ఇస్తున్నట్లు తెలిపారు. నెలకు రూ.15వేల వేతనం ఇవ్వనున్నట్లు చెప్పారు. మంత్రి ఈశ్వర్ చేతుల మీదుగా ఆఫర్ లెటర్ కూడా అందుకున్నాను. ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది.
– గొండ శ్రీనివాస్, గుళ్లకోట
ఇంత సులభంగా ఉద్యోగం వస్తుందనుకోలేదు
మాది పేద కుటుంబం, మా తల్లి బీడీలు చుడుతూ..తండ్రి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంటర్ పూర్తి చేసి ఓపెన్ డిగ్రీ చదువుతున్నాను. కుటుంబ పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగం చేయాలనిపించింది. జాబ్‌మేళా పెడుతున్నారనే సమాచారంతో ఇంటర్వ్యూలో పాల్గొన్నాను. ప్రీమియర్ హెల్త్ కేర్ సొసైటీ నుంచి హైదరాబాద్‌లోని ఓ కంపనీలో ఉద్యోగానికి ఎంపిక చేశారు. రూ.15వేల వేతనం ఇస్తామన్నారు. మంత్రి ఈశ్వర్, స్నేహలత మేడమ్ జాబ్ ఆఫర్ లెటర్‌ను అందించారు. ఇంత సులభంగా ఉద్యోగం వస్తుందనుకోలేదు.
– సెగ్గం వైష్ణవి, ధర్మపురి
క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉద్యోగం సాధించా
మాది ఎండపెల్లి మండలం ఉండెడ గ్రామం. నిరుపేద కుటుంబానికి చెందినవాడిని. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను. జాబ్‌మేళా ఇంటర్వ్యూకు హాజరయ్యాను. కంప్యూటర్ నాలెడ్జ్ చెక్ చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ విభాగంలో ఉద్యోగం ఇచ్చారు. నెలకు రూ.17వేల వేతనం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇంత మంచి అవకాశం కల్పించిన మంత్రి ఈశ్వర్ సారుకు, ఎల్ఎమ్ ట్రస్ట్ చైర్పర్సన్ స్నేహలత మేడమ్‌కు ధన్యవాదాలు.
– విలాసాగరం శ్రీనివాస్, ఉండెడ, ఎండపెల్లి మండలం