కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని రేకుర్తిలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు యంత్రాగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల కబ్జా, ఖాళీ స్థలాలకు ఇంటి నంబర్ల కేటాయింపులపై వచ్చిన ఫిర్యాదులతో నగర ఇన్చార్జి కమిషనర్ ప్రపుల్ దేశాయ్ చర్యలు మొదలుపెట్టారు. రేకుర్తిలోని అన్ని ఇండ్లు, ఖాళీ స్థలాలపై పూర్తి స్థాయిలో సర్వే చేసేందుకు వారంపాటు ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. అందుకోసం ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కార్పొరేషన్, జూలై 10: నగరపాలక సంస్థ విలీన గ్రామమైన రేకుర్తిలో ఇండ్లు, ప్రభుత్వ, ఖాళీ స్థలాలపై పూర్తి స్థాయిలో సర్వే కోసం ప్రత్యేక డ్రైవ్ చేపడుతున్నారు. అందుకోసం కమిషనర్ ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. రేకుర్తిలో నిబంధనలకు విరుద్దంగా ఇంటి నంబర్లు కేటాయించారని కోకొల్లలుగా ఫిర్యాదులు వచ్చాయి. వీటికి తోడుగా ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి.. ఇంటి నిర్మాణాలు చేయకుండానే నగరపాలక సంస్థ నుంచి ఇంటి నంబర్ల కేటాయింపులు, అనుమతి లేకుండానే భవన నిర్మాణాలు చేపట్టారన్న ఫిర్యాదులు అందాయి. ఈ సర్వేలో ముఖ్యంగా అనుమతులు, సరైన పత్రాలు లేకుండా నిర్మాణాలు, ఆస్తిపన్ను మదింపు లేనివాటిని, తక్కువ మొత్తంలో ఆస్తిపన్ను మదింపు చేసినవాటిని, ఇంటి నిర్మాణాలు లేకుండా నంబర్లు కేటాయించిన వాటిని, ప్రభుత్వ భూములను సర్వే బృందాలు గుర్తించనున్నాయి. ఒక్కో బృందంలో నగరపాలక సంస్థకు చెందిన ఆర్ఐ, టీం లీడర్తోపాటు నలుగురు ఉద్యోగులు ఉండనున్నారు. రేకుర్తిలోని 1, 2 రెవెన్యూ బ్లాక్లను శ్రీకాంత్ ఆర్ఐ ఆధ్వర్యంలో, 3, 4, 5 బ్లాక్లు శ్రీనివాస్ ఆధ్వర్యంలో, 6, 7, 8 బ్లాక్లు ఖలీల్ ఆధ్వర్యంలో, 9 నుంచి 12 బ్లాక్లు రషీద్ ఆధ్వర్యంలో సర్వే చేయనున్నారు.