రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సర్కారు తీరుపై ముస్తాబాద్ మండలం ఆవునూరు రైతులు మండిపడుతున్నారు. ఈ నెల 15 లోగా 2లక్షల రుణం మాఫీ చేస్తామని ప్రకటించి మాట తప్పిందని వాపోతున్నారు. పట్టా పాసు బుక్కుపై రుణం ఇచ్చినోళ్లే ఆధార్‌కార్డు, రేషన్ కార్డు, సంబంధం లేని అంశాలతో మాఫీకి మంగళం పాడుతున్నారని, గ్రామంలో 800 మంది లోన్లు తీసుకుంటే సగం మందికి కూడా మాఫీ కాలేదని ఆవేదన చెందారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ గ్రామంలో ఫీల్డ్ విజిట్ చేయగా, తమ గోడు వెల్లబోసుకున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం అందరికీ రుణమాఫీ చేయాలని, లేదంటే ఆందోళనలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. అనేక కొర్రీలు పెట్టి మాఫీ ఎగ్గొట్టాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు.
ఊళ్లె ఇద్దరి పొత్తుల మూడెకరాల భూమి ఉంది. పంట పెట్టుబడి కోసం నా భార్య కవిత పేరు మీద లక్షా50వేలు, నా పేరుమీద 2.25లక్షలు అప్పు తీసుకున్నం. ఆరునెలల కోసారి వడ్డీ కూడా కట్టుకుంటూ వస్తున్నం. రుణమాఫీ చేస్తమంటే ఎంతో సంతోష పడ్డం. 2 లక్షల వరకు రుణమాఫీ లిస్టులో మా ఇద్దరి పేర్లు లేవు. బ్యాంకుకు పోయి అడిగితే ఇద్దరు రుణం తీసుకున్నరు కాబట్టి రాలేదంటున్నరు. ఎవరి పట్టా పాసు పుస్తకాలు వేర్వేరుగా ఉన్నయి. ఇద్దరిలో ఒక్కరికైనా ఎందుకు మాఫీ కాదని అడిగితే అధికారులు సరైన సమాధానం చెప్పడం లేదు. రేషన్‌కార్డు జాయింట్ ఉంటే రాదని చెపుతున్నరు. రుణం ఇచ్చేటప్పుడు వర్తించని నిబంధనలు మాఫీకి ఎందుకు? రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేయడమే.
నాకు నాలుగెకరాల భూమి ఉంది. పంట సాగు పెట్టుబడులకు పైసల్లేక పాసుబుక్కు బ్యాంకులో కుదవపెట్టి 2.05లక్షలు లోను తీసుకున్న. అది వడ్డీతో కలిపి 2.40లక్షలైంది. వడ్డీ పూర్తిగా చెల్లించిన. అయినా నాకు రుణమాఫీ కాలేదు. ఇదేందని బ్యాంకుకు పోయి అడిగితే మాకేం తెల్వది. వ్యవసాయ శాఖ అధికారులను అడుగమన్నరు. వాళ్లను అడిగితే రుణం 2లక్షల ఐదువేలు ఉన్నందున రాలేదంటున్నరు. 5 వేలుంటే ఏందీ? పది వేలుంటే ఏందీ? ప్రభుత్వం చెప్పింది 2 లక్షల మాఫీ చేస్తామని కదా..? ఎక్కువుంటే మేమే కట్టుకుంటం కదా! అని నిలదీస్తే తర్వాత చూద్దామంటున్నరు. సర్కారు తీరు బాగాలేదు. మేం కోటీ విలువైన ఆస్తి నీ వద్ద కుదువబెట్టినం. రెన్యూవల్ చేసేటపుడు మా బకాయిలు వసూలు చేయరాదా? గిన్నీ కొర్రీలు పెట్టిన సర్కారుకు మంచిది కాదు.
నాకున్నది రెండు ఎకరాలు. నేను తీసుకున్నది 64వేలు. రైతులకు దశల వారీగా రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. కేడీసీసీ బ్యాంకుకు పోయి అడిగితే రాలేదని బ్యాంకోళ్లు చెప్పిన్రు. వచ్చే లిస్టులో వస్తుందన్నరు. ఈసారైనా రుణమాఫీ జరుగుతుందేమోనని ఆశపడ్డ. వచ్చిన లిస్టులోనూ నాపేరు లేదు. 64వేలు కూడా మాఫీ కాలే. ఎందుకు రాలేదని బ్యాంకుకు వెళ్లి అడిగిన. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. అధికారుల వద్దకు పోతే పట్టించుకోరు. ప్రభుత్వం రైతు రుణమాఫీ చేశామంటూ గొప్పలు చెప్పుకుంటున్నది. మా పరిస్థితేమో ఇట్లున్నది.
ఆవునూరులో మాకు నాలుగున్నర ఎకరాల భూమి ఉన్నది. కేడీసీసీ బ్యాంకులో 1.80లక్షల లోన్ తీసుకున్న. రెండు లక్షల రుణమాఫీ అయితదంటే సంబుర పడ్డ. పాసుబుక్కు పట్టుకుని బ్యాంకుకు పోతే లిస్టులో నీపేరు లేదంటూ సార్లు చెప్పిన్రు. నేను రైతునే. నాకు పొలం ఉన్నది. లోను తీసుకున్న కదా? ఎందుకు మాఫీ కాదని అడిగితే, రేషన్‌కార్డు లేదని.. అందుకే రాలేదని చెప్పిన్రు. లోను ఇచ్చినపుడు రేషన్ కార్డు గురించి మాట్లాడనోళ్లు గిప్పుడెందుకు అడుగుతున్రని నిలదీసీన. ఏమో పో అమ్మ.. మాకేం తెలుసంటూ ఈసడించుకుంటున్రు. ఎవరికి చెప్పుకోవాలే నాబాధ. చేసోటోడు సక్కగ చెయ్యక గిన్ని తిప్పలు పెడుతుండు.