అన్నదాతల బతుకు ఆగమవుతున్నది. పంటను పండించడానికే కాదు.. ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకునేందుకూ నరకయాతన పడాల్సి వస్తున్నది. నెలల కొద్దీ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా వడ్లు కొనే దిక్కు కరువైంది. మంత్రులు, అధికారులు ‘కొనుగోలు చేయండి’ అంటూ ఆదేశాలు ఇవ్వడమే తప్పా, క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారం లేక కొనుగోళ్లలో ఆలస్యం జరుగుతున్నది. దీంతో ఎక్కడి కుప్పలు అక్కడే నిలిచిపోగా, రైతులకు రోజుల కొద్దీ నిరీక్షణే మిగులుతున్నది. మరోవైపు మబ్బులు గుబులు రేపుతుంటే ధాన్యం తడవకుండా కాపాడుకోవడానికి అవస్థలు పడాల్సి వస్తున్నది. చాలాచోట్ల బారదాన్ కొరత వేధిస్తున్నది.
అడిగితే లేదని చెబుతున్న అధికారులు.. ఎప్పుడొస్తుందో స్పష్టత ఇవ్వడం లేదు. పలుచోట్ల కాంటా వేసిన ధాన్యం కదలడం లేదు. సమయానికి ట్రాన్స్‌పోర్టు వాహనాలు రావడం లేదు. వడ్లు మార్కెట్‌కు తెచ్చినప్పటి నుంచి మొదలు.. అక్కడి నుంచి మిల్లులకు చేరే వరకు రైతులే కాపాలా ఉండాల్సిన దుస్థితి ఉన్నది. మొత్తంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూస్తే.. గడిచిన నెల రోజుల్లో కొన్నది సగం ధాన్యం మాత్రమే! ఇంకా కొనాల్సింది 7.05 లక్షల మెట్రిక్ టన్నులు! కొనుగోళ్లు ఇలానే ఆలస్యంగా సాగితే మరో రెండు నెలలైనా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అదే జరిగితే.. చిన్న చినుకు పడినా రైతన్న నిండా మునిగే ప్రమాదం పొంచి ఉన్నది.

కరీంనగర్, మే 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ధాన్యం కొనుగోళ్లలో సర్కారు నిర్లక్ష్యం కనిపిస్తున్నది. మరో పది రోజుల్లో వానకాలం సీజన్ మొదలు కానుండగా, ఇప్పటికీ కొనుగోళ్లు పూర్తి కాకపోవడం ఆందోళన కలిగిస్తున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధికారిక గణాంకాలను బట్టి చూస్తే.. ఇప్పటివరకు సగం ధాన్యమే కొన్నట్టు తెలుస్తున్నది. అది కూడా కొనుగోలు చేయాలన్న లక్ష్యంలోని ధాన్యం మాత్రమే. మొత్తం దిగుబడితో పోలిస్తే నలభై శాతం కూడా కొనుగోళ్లు పూర్తి కాలేదని స్పష్టమవుతున్నది.
ఉదాహరణకు పెద్దపల్లి జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినా.. అందులో కొనుగోలు లక్ష్యం మాత్రం 4 లక్షల మెట్రిక్ టన్నులే. ఇలాంటి పరిస్థితే అన్ని జిల్లాల్లోనూ ఉన్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దిగుబడి విషయాన్ని పక్కనపెట్టి చూస్తే.. 15.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. అందులో ఇప్పటివరకు 8.06 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నట్టు చెబుతున్నారు. ఇంకా అధికారికంగా చూసినా 7.05 లక్షల మెట్రిక్‌టన్నులు కొనుగోలు చేయాల్సి ఉన్నది.
బారదాన్ లేదు.. కాంటా పెట్టరు
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అనేక మార్కెట్ యార్డుల్లో చూస్తే అన్నదాతల దుస్థితి దయనీయంగా ఉన్నది. కొనుగోళ్ల కోసం ఒక్కో మార్కెట్ యార్డులో దాదాపు నెల రోజులకుపైగా నిరీక్షించాల్సిన దుస్థితి కనిపిస్తున్నది. అయినా కొనే నాథుడు లేడు. చాలా చోట్ల 25 రోజులు గడుస్తున్నా నేటికి బారదాన్ సంచులు ఇవ్వడం లేదు. అడిగితే లేవని సమాధానం ఇస్తున్నారు. లేదా మీరు కొనుక్కొని వస్తే కాంటా వేస్తామని చెబుతున్నారు. ఒక్కో బారదాన్ సంచి రూ.23 నుంచి రూ.25 వరకు ఉంది. అంతా భారం ఎలా మోస్తామని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా కొనుగోలు చేయకపోతే బర్దాన్ వచ్చినప్పుడే ఇస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎప్పుడు వస్తుందో మాత్రం స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు.
మంత్రులు మార్కెట్లను సందర్శించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటీవల కొంత మంది అమాత్యులు కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. ‘వెంటనే కొనుగోళ్లు చేయండి.. జాప్యం లేకుండా చూడండి’ అని చెప్పారే తప్పా కొనుగోళ్లలో జాప్యం జరగడానికి కారణాలను తెలుసుకోలేకపోయారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోలేకపోయారు. దీంతో ఆదేశాల వరకే పరిమితం అవుతున్నారే తప్పా ఆచరణలో మాత్రం కొనుగోళ్లపై నిర్లక్ష్యమే రాజ్యమేలుతుంది. బారదాన్ కొరతతోపాటు కొన్ని చోట్ల బారదాన్ నింపిన సంచులను కాంటా వేయడానికి వారం పదిరోజులు పడుతున్నది.
మరికొన్ని చోట్ల పక్షం రోజులు పడుతున్నది. కాంటా వేసిన సంచులను తరలించడానికి మరో పది రోజులు పడుతున్నది. కాంటా వేసిన సంచి మిల్లుకు వెళ్లే వరకు అన్నదాతే కాపాలా కాయాల్సిన దుస్థితి అన్నీ మార్కెట్ యార్డులు, కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది. దీంతో ఒక్కో కొనుగోలు కేంద్రంలో రైతు దాదాపు నెల రోజలకుపైగా వేచి చూడాల్సిన దుస్థితి ఉంటున్నది. కాంటా వేసిన బస్తాలను మిల్లులకు తరలించడానికి ట్రాన్స్‌పోర్టు వాహనాలు లేక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. సదరు ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ వద్ద సరిపడా వాహనాలు లేక ఈ సమస్య తలెత్తుతున్నట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా, మిల్లుల వద్ద అన్లోడింగ్ ఇన్‌టైంలో కాకపోవడంతో ఇబ్బంది ఎదురవుతున్నది.

మంత్రులు స్పందించపోతే మరో రెండునెలలు?
నిజానికి కొనుగోళ్ల తీరులో మార్పు లేకుండా ఇలాగే కొనసాగితే.. మరో రెండు నెలలు సమయం పట్టినా ఆశ్చర్యపోనక్కరలేదని అధికారులే మాట్లాడుకోవడం కనిపిస్తున్నది. మార్కెట్లో ఇంకా సగం ధాన్యం కొనాల్సి ఉన్నా.. ఇప్పటికే బారదాన్ సంచుల కొరత తీవ్రరూపం దాల్చింది. మున్ముందు మరింత తీవ్రం కానున్నది. అలాగే చాలా చోట్ల హమాలీల కొరత ఉన్నది. కాంటా వేసిన ధాన్యాన్ని తీసుకెళ్లేందుకు ట్రాన్స్‌పోర్టు వాహనాలు లేవు. అంటే ప్రతి విషయంలోనూ ఇబ్బందులున్న నేపథ్యంలో అధికారులతో మాట్లాడి, ఆ మేరకు క్షేత్రస్థాయిలో బారదాన్ సంచులు, ట్రాన్స్‌పోర్టు వాహనాలు, హమాలీల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించాల్సిన బాధ్యత ఉమ్మడి జిల్లా మంత్రులపై ఉన్నది.
ఆదేశాలు ఇచ్చి వెళ్లడం వల్ల సమస్య పరిష్కారం కాదనే విషయాన్ని ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు గుర్తించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉమ్మడి జిల్లా అధికారులతో యుద్ధ ప్రాతిపదికన సమావేశం ఏర్పాటు చేసి, కొనుగోళ్లలో ఇబ్బందులు, క్షేత్రస్థాయిలో ఆటంకాలు, పరిష్కారం వంటి అంశాలను క్షుణ్నంగా పరిశీలించి చర్యలు తీసుకోకపోతే.. మరోరెండు నెలలైనా కొనుగోళ్లు పూర్తయ్యే పరిస్థితులు ఉండవు. ఏ మాత్రం జాప్యం జరిగినా.. ఒక్క వర్షం పడినా అన్నదాతల బతుకులు ఆగం అవుతాయన్న విషయాన్ని మంత్రులు గుర్తించాలి. కేవలం అధికారులకు మాత్రమే వదలిపెడితే.. ఈ సమస్యలకు పరిష్కారం ఉండదన్న విషయాన్ని మంత్రులు గుర్తించాలన్న డిమాండ్ వస్తున్నది.
పంట అమ్ముకునేందుకూ రోడ్డెక్కలా..?
ఇల్లంతకుంట : రోజులు గడుస్తున్నా ధాన్యం కొనడం లేదని ఇల్లంతకుంట మండలంలోని పొత్తూరు, నర్సక్కపేట, జవారిపేట, కందికట్కూర్ గ్రామాల రైతులు రోడ్డెక్కారు. బుధవారం సుమారు 200 మందికిపైగా పొత్తూర్కు తరలివచ్చి ధర్నా చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించడానికే కాదు, పంటను అమ్ముకోడానికీ రోడ్డెక్కాల్సి వస్తున్నదని వాపోయారు. మరో వారంలో వానకాలం ప్రారంభం కాబోతుందని, ఆ లోగా కొనుగోళ్లు మొత్తం పూర్తి కాకపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఐ సిరిసిల్ల అశోక్ చేరుకొని, రైతులను సముదాయించి ధర్నా విరమింపజేశారు.
కేసీఆర్‌ను దింపేసి తప్పు చేసినం సార్
సార్ నాకున్నది ఒక్కటే ఎకురం భూమి. అడ్లే పండిస్తున్న. నీళ్ల సౌలత్ ఉంది. పొలం మంచిగానే పండుద్ది. పండిన దాంట్ల నుంచి ఇంట్లకు ఇన్ని ఇత్తులు తీసుకొని, దాదాపు డబ్బు ఎనభై సంచులమందం వడ్లు చల్గల్ మార్కెట్ యార్డుకు తీసుకువచ్చిన. నలభై రోజలు అయితుంది. ఇంత వరకు కొనుడు లేదు మన్ను లేదు. కొనుడు సంగతి దేవుడెరుడు? వడ్లు నింపేందుకు బారాదాన్లు సుత ఇయ్యలే. నలభై రోజులు అయినంక ఇయాళ్ల బారదాన్లు ఇచ్చిన్రు. ఈ బరదాన్లళ్ల అడ్లు ఎత్తినంక ఎప్పుడు జోకుతరో.. జోకిన అడ్లను ఎప్పుడు ఎత్తుకపోతరో తెల్వది. ఇంకెన్ని రోజులు ఇక్కడ పడి సావాలో.. మస్తు దుఖం వస్తంది సార్. రైతంటే గింత అధ్వానంగా సూసుడు కరెక్ట్ కాదు సార్. ఏ సారును అడిగినా పట్టించుకునుడే లేదు. ఏం చేయాలో అర్థం అయిత లేదు.
మా ఊరికి, మార్కెట్ యార్డుకు దాదాపు మూడు కిలోమీటర్ల దూరం ఉంది. రోజు పొద్దుగాల అచ్చుడు. పగటిలీ పోయి తిని అచ్చుడు. రాత్రి మళ్ల ఇంటికి పోవుడు. ఇంటికి పోయినా భయమే సార్. అడ్లు ఏమైనయో.. గాలిదుమారం గిట్ట అచ్చెనా.. అన్న రందితోటే పండుడు అయితంది. తిన్న తిండి పెయిన పడ్తలేదు. కంటి నిండ నిద్ర వడ్తలేదు సార్. రోజు బండి మీద అచ్చెతందుకు పెట్రోల్ ఖర్చు. ఈడికెళ్లి ఇంటికి ఎల్లినంక అలిసిపోతే కడుపులకు సల్లటి నీళ్ల కోసం అదో కర్సు అయితంది. సార్ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగుండె.. వారం రోజులల్ల అడ్ల కథ ఒడిసింది. ఆ సారు సీఎంగా ఉన్నప్పుడు రైతుల గోస చూసిండు. ఉన్నంతల మంచిగ చేసిండు. పైసలు ఇచ్చిండు. అన్ని చేసిండు. అడ్లు కూడా మార్కెట్‌కు తెచ్చినంక వారం పది రోజుల్లనే కొన్నరు. పైసలు సైతం జెప్పనే ఏసిన్రు. ఇప్పుడు నలభై రోజుల సంది పడి ఏడుతున్నా పట్టించుకున్నోడు లేడు. కేసీఆర్‌ను దింపేసి తప్పు చేసినం సార్.
– వోగులపు సత్తయ్య, రైతు, చల్గల్ (జగిత్యాల రూరల్ మండలం)
ఎప్పుడు కొంటరో చెప్తలేరు
నాకు మూడున్నర ఎకరాల భూమిలో వరి ఏసిన. పదిహేను రోజుల కింద పొలం కోసినం. కరీంనగర్ మార్కెట్‌కు వడ్లు తెచ్చినం. రోజూ ఎండ వోత్తున్నం. దగ్గరకిజేసి కుప్ప బోత్తున్నం. ఎండకు ఇక చేతనైత లేదు. కైకిళ్లు పెట్టినం. మాకు చేయాలని ఉన్నా ఎండకు కూలవడిపోతున్నం. బర్దాన్ అడిగితే ఇగో అగో అంటున్నరు. పదిహేను రోజుల సంది రోజూ అడుగుతున్నం. ఏమన్నంటే లారీలు వస్తలేవు. బర్దాన్ లేదంటున్రు. మీరు కొనుక్కోమంటున్రు. మొగులేమో భయపెడుతంది. వానస్తే మొత్తం వడ్లు కొట్టకపోతయి. తడిస్తే మళ్ల ఎండపోయిమంటరు. ఇట్లయితే ఎట్ల బతుకుడు? అరిగోస పడుతున్నం. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్ల లేదు. వెంటవెంటనే అమ్ముకున్నం. ఇప్పుడు ఎప్పుడు కొంటరో చెప్తలేరు. అడిగితే ఆగు మంటున్రు. ఇట్ల ఎన్నిరోజులో అర్థమైతలేదు. చెప్పుడు కాదు, ఇక్కడికొచ్చి జూస్తే మా కట్టం తెలుస్తది.
– పద్మ, రైతు, వల్లంపహాడ్ (కరీంనగర్ జిల్లా)

ఎవుసం బంద్ చేసిందే నయం
సార్ నాకు మూడు మూడున్నర ఎకరాల భూమి ఉన్నది. రెండేళ్లుగా వడ్లు తెచ్చి మార్కెట్లో పోసుడు. వారాలకు వారాలు మార్కెట్ల పడిగాపులు పడుడు చూసి మెల్లగా వరి ఏసుడు తక్కువ జేసిన. ఇంత ఏరే పంటలు సాగు చేస్తున్న. ఈ సారి రెండున్నర ఎకరాల్లోనే వరి పండించిన. దాదాపు నూటాయాభై, నూటా అరవై బస్తాల మందం వడ్లు తెచ్చి చల్గల్ మార్కెట్ల పోసిన. నెల రోజులైతంది. ఇంత వరకు బారదాన్లు ఇయ్యలేదు. ఎవలను అడిగినా ఏం చెప్తలేరు. నీకంటే ముందు తెచ్చి పోసిన వాళ్లు లేరా..? ఇప్పుడే అచ్చినవ్.. అప్పుడే అడుగుతున్నవ్ అంటున్రు. అనద్దు గానీ, నాకంటే ముందు మా ఊరోళ్లే వడ్ల కుప్పలు ఉన్నయి. నేను అడిగి ఏం లాభం లేదు. ఏదో ఆవేశం వచ్చి అడుగుడు తప్పా మరోటి లేదు.
మునుపు వారం పది రోజుల్లో వడ్లు కొన్నరు. ఇప్పుడేమైందో ఏమో.. రెండేండ్ల సంది ఇదే పరేషాన్ చేస్తన్రు. వడ్లు అచ్చినయి అన్న సంబురం ఉంటలేదు. ఎట్ల అమ్ముకునుడు? ఎన్నిరోజులు మార్కెట్ల పడి ఉండుడు? అని రంది అయితంది. రోజు ఎవలమో ఒకలం వచ్చి అడ్ల కుప్పకాడ కూసోవాల్సి వస్తంది. ఎర్రని ఎండకు తిప్పలంటే తిప్పలు అయితంది. నువ్వు ఎండల వడి మార్కెట్‌కు పోకు. ఎండ దెబ్బ గిట్ల కొట్టిందంటే మాత్రం పానాలు పోతయి. ఆని నాశనం గాను. ఇంకెప్పుడు వడ్లు కొంటరో అని పెండ్లాం, పొలగాండ్లు తిడుతన్రు. సర్కార్ పట్టించుకుంటే వారం పది రోజుల్లో ఒడిసే ముచ్చట. ఎందుకు ఇట్ల చేస్తున్నారో మాకైతే అర్థం అయిత లేదు. సార్ ఇగ ఎవుసం చేసిందాని కంటే బంద్ చేసింది నయం అనిపిస్తున్నది. కానీ, రైతులం కదా సార్. వేరే పని తెల్వదాయే. ఏం జేసుడో అర్థం అయిత లేదు.
– సిరికొండ గంగరాజం, రైతు, చల్గల్ (జగిత్యాల రూరల్ మండలం)
కాంటా పెట్టక వారమైతంది
నాకు ఊళ్లే నాలుగెకరాల జమీను ఉన్నది. అండ్ల 250 బస్తాలు వడ్లు వచ్చినయ్. పొయిన్నెల 13 తారీఖునాడు వరి కోసిన. ఆ రోజే ఈడ పోసిన. మ్యాచర్ అచ్చి 25 రోజులైపోతుంది. ఇక్కడ కాంటా పెట్టక వారమైతంది. సార్లను అడిగితే ఇది వరకే జోకినయ్ ఇక్కడి నుంచి పోయినంక తూకం వేస్తమంటున్నరు. మా ఊళ్లే నాలుగు సెంటర్లకు ఒకటే లారీ తిరుగుతంది. గిట్లనే నాలుగురోజులకోసారి లారీ వస్తే కష్టమైతది. మా సెంటర్ల వడ్లు కొనేందుకు 50 మందికి సీరియల్ రాయించిన్రు. ఇప్పుడు 11 నంబర్ నడుస్తుంది. నా దాక వచ్చేసరికి ఎన్ని రోజులైతదో.. ఇంకా ఊర్లె గూడ బాగనే వడ్లు ఉన్నయ్. జెల్దిజెల్ది ఎక్కువ లారీలు లోడు తీసుకపోతెనే రైతులకు ప్రాబ్లమ్ లేకుంట అయితది. లేకపోతె వర్షంగిట్ల వచ్చెనంటే మల్లమల్లా ఎండవోసుడు ఇగ సెప్పరాని తిప్పలైతది. గతంలో ఇసోంటి తిప్పలు లేవు. ఎప్పటివడ్లు అప్పుడు కొన్నరు. ఇప్పుడే ఇట్ల ఎందుకైతందో చూడాలె.
– రేపాక నర్సయ్య, రైతు, తిమ్మాపూర్ (ఎల్లారెడ్డిపేట)
సగమే కొన్నరు.. మిగిలింది ఎన్నడు కొంటరో..?
నాకున్న మూడున్నర ఎకరాలతోపాటు మరో మూడెకరాలు కౌలుకు తీసుకొని మొత్తం వరి వేసిన. ఎకరానికి 100 బస్తాల దాకా వడ్లు వచ్చినయి. నేను పదిహేను రోజుల కింద మా ఊరి కొనుగోలు కేంద్రానికి వడ్లు తెచ్చి పోసిన. ఇప్పటికి సగం మాత్రమే కొన్నరు. లారీల కొరతతో మిగిలిన సగం ఎప్పుడు కొంటరో తెలుస్తలేదు. తూకమైన బస్తాలు సెంటర్లల్లనే ఉంటున్నయి. కొనుగోళ్లలోనూ సర్కారు అనేక కొర్రీలు పెడుతంది. ఎకరానికి 80బస్తాల లిమిట్ పెట్టింది. అంటే అదనంగా ఉన్న వడ్లను మరో రైతు పేరు మీద తూకం వేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. పంట అమ్ముకునేందుకు రైతులను ఇంత గోసపెట్టడం సరికాదు. కొర్రీలు లేకుండా కొనుగోళ్లను వేగవంతం చేయాలె.
– బాసాని రాజేశం, ఎక్లాస్పూర్ రైతు (మంథని మండలం)
ఇసోంటి బాధలు ఎన్నడూ చూడలే.
నేను నాలుగెకరాల్లో వరి పండించిన. అందాద వంద క్వింటాళ్ల వడ్లు 45 రోజుల కింద తెచ్చి మా ఊరి కొనుగోలు కేంద్రంల పోసిన. ఎక్కడి వడ్లు అక్కడే ఉన్నయి. వాటి దిక్కు చూసేటోళ్లే లేరు. తిరుగంగ తిరుగంగ వారం పదిరోజుల కింద కాంటా వేసిన్రు. 260 బస్తాలు అయినయి. కానీ, ఏం పాయిదా? లారీలు సెంటర్లనే ఉండిపోయినయి. ఎప్పుడు వాన పడుతదో తెలియక భయపడుతున్న. మబ్బులు పడితే చాలు బస్తాలపై టార్పాలిన్ కవర్లు కప్పుతూ రోజంతా ఇక్కడే ఉంటున్న. ఇసోంటి బాధలు నేను ఎన్నడూ చూడలే. గతంల వడ్లు అచ్చినయి అచ్చినట్టే కొని పంపేటోళ్లు. కేసీఆర్ పాలనల ఏ ఇబ్బంది లేదు. ఈ యేడే తిప్పలైతంది. ఇట్ల ఎందుకైతందో అధికారులే చెప్పాలె. లారీల కొరత లేకుండా వెంట వెంటనే మిల్లుల్లో దించుకుంటే ఈ బాధలు ఉండయి. అధికారులు, ప్రజాప్రతినిధులు కొంచెం దృష్టి పెట్టాలె.
– నర్సయ్య, రైతు (రుద్రంగి)
నెల దాటినా కొనేటోళ్లు లేరు
పంట పండించడానికి మేం ఎంత కష్టపడుతున్నామో.. పంటను అమ్ముకోవడానికి అంతకంటే ఎకువ గోస పడుతున్నం. నాకున్న ఐదెకరాల ఎవుసం భూమిలో వరి సాగు చేసిన. నెల క్రితమే పొలం కోసిన. మా ఊరిలోని కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసిన. ఈ కేంద్రంలో హమాలీ, గన్నీ సంచులు, లారీలు సక్రమంగా రాక తూకం ఆలస్యం అయితంది. నెల గడిచినా వడ్లు అట్లానే ఉన్నయి. వెయిట్ లాస్‌తో రైతులు తీవ్రంగా నష్టపోవాలి వస్తది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించాలి. కేంద్రాలకు వచ్చి మా సమస్యలను పరిషరించాలి.
– ద్యాగ గంగారెడ్డి, రైతు, కుస్తాపూర్ (మల్లాపూర్ మండలం)
