రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్1 (నమస్తే తెలంగాణ) : తమ సమస్యలు పరిష్కరించాలని, కార్మికులకు మెరుగైన ఉపాధి చూపాలని, కూలీ అందించాలని సిరిసిల్ల నేతన్నలు డిమాండ్ చేశారు. మానం కాపాడే నేతన్నల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జీవితాలతో చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన మరమగ్గాల నిరవధిక బంద్ మొదటి రోజు మంగళవారం విజయవంతం కాగా, మరమగ్గాల కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవైనగర్ కార్యాలయం నుంచి నేతన్న చౌక్‌వరకు భారీ ర్యాలీ తీసి, ధర్నా చేశారు.
ఈ సందర్భంగా తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడారు. ప్రభుత్వ విధానాల వల్ల పనిలేక కార్మికులు చనిపోతే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్ప ష్టం చేశారు. ప్రభుత్వం ఇస్తున్న వస్త్ర ఉత్పత్తులకు మెరుగైన కూలీ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు, ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్చలు జరిపి కూలీ నిర్ణయిం చి సమ్మెను విరమింపజేయాలన్నారు. లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని, బుధవారం కలెక్టరేట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి గణేశ్, గుండు రమేశ్, వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సత్యం, కిషన్ పాల్గొన్నారు.