పక్కనే గోదావరితోపాటు దాని ప్రధాన ఉపనది మానేరు ఉన్నా నాడు గుక్కెడు నీటికోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అప్పుడు అరిగోస పడ్డది. సాగునీటి సంగతి పక్కన పెడితే తాగునీటికీ అష్టకష్టాలు పడింది. ‘మా నీళ్లు గోదావరి పాలవుతున్నయ్. ప్రాజెక్టులు కట్టండి మహాప్రభో’ అంటూ నాటి పాలకులకు ప్రజలు మొరపెట్టుకున్నా వినిపించుకోలేదు. మనసు పెట్టి సమస్యను పరిష్కరించే ప్రయత్నమూ చేయలేదు. ఫలితంగా బంగారం లాంటి భూములు బీళ్లుగా మారాయి. రైతులకు ఆత్మహత్యలే దిక్కయ్యాయి.
స్వరాష్ట్రంలో ఉమ్మడి జిల్లా వాటర్ హబ్‌లా మారింది. అపరభగీరథుడు కేసీఆర్ సంకల్పంతో ప్రాజెక్టుల రీడిజైనింగ్ ఫలించింది. సముద్రం పాలవుతున్న గోదావరి కాళేశ్వరం ఎత్తిపోతలతో ఎదురెక్కింది. మెట్టకు జలాభిషేకం చేసింది. ఒకప్పుడు అత్యంత దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొన్న రాజన్న సిరిసిల్ల లాంటి ప్రాంతం ఇప్పుడు నీటిని ఒడిసిపట్టడంలో దేశానికి ఒక పాఠ్యాంశంగా మారిపోయింది. ఒకటా రెండా ఎన్నోప్రాజెక్టులు, ఎన్నో చెక్‌డ్యామ్‌లు, చెరువులు కుంటలు జీవం పోసుకోగా, వరద కాలువ జీవనదిలా మారింది. బీడు భూముల్లో బంగారు పంటలు పండుతున్నాయి. వ్యవసాయం పండుగలా మారి రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
అపరభగీరథుడు.. జలస్వాప్నికుడు సీఎం కేసీఆర్ ప్రయత్నం ఫలించింది. సాగు నీటి సంకల్పం సిద్ధించింది. కాళేశ్వరం ప్రాజెక్టు రీ ఇంజినీరింగ్ విజయవంతమై, వృథాగా పోతున్న గోదారి జలం పంటచేలను ముద్దాడుతున్నది. నాడు తలాపునే గోదావరితోపాటు ఉపనది మానేరు నదులు పారుతున్నా చుక్కనీటిని వాడుకోని దుస్థితిలో మగ్గి, తాగునీటికీ తండ్లాడిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా బృహత్తర ప్రాజెక్టుతో జీవం పోసుకున్నది. ‘మా నీళ్లు గోదావరి పాలవుతున్నాయి.. ప్రాజెక్టులు కట్టండి’ అంటూ ఇక్కడి ప్రజానీకం వేడుకున్నా పట్టింపు కరువైన దశాబ్దాల నాటి సమస్యకు పరిష్కారం దొరికి జల విప్లవం మొదలైంది. దిగువకు వృథాగా పోతూ సముద్రంలో కలిసే గంగమ్మ ఎగువకు పరుగులు తీస్తూ రాష్ర్టానికి జీవధార మారగా, ఇందులో తొలి ఫలితం మన ఉమ్మడి జిల్లాకే దక్కింది. మెట్టప్రాంతాలకు జీవం వచ్చింది. నెర్రెలుబారిన నేలల్లో బంగారు పంటలు పండి కుటుంబాల్లో ఆనందం కనిపిస్తున్నది.
కరీంనగర్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘నా ప్రాణంపోయినా సరే. రాబోయే ఐదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరు అందించి తీరుత. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నిరూపిస్త. ఆరు నూరైనా ఎన్ని అటంకాలు కల్పించినా, ఎవరూ అవరోధాలు సృష్టించినా హరిత తెలంగాణను సాధించే దాకా మా ప్రస్థానం ఆగేదికాదు. మమ్మల్నెవరూ ఆపలేరు. నాకు ఎల్లప్పుడు అండగా ఉంటూ దీవిస్తున్న నా ప్రజల సహకారంతో ప్రాజెక్టులు కట్టి తీరుత. తెలంగాణ రాష్ట్రం మెయిన్ టాగ్ లైనే నిధులు, నియామకాలు, నీళ్లు. నిధులు, నియామకాలు సాధించాం. ఇక కావాల్సింది నీళ్ల పరిష్కారమే’ 2016 మార్చి 31న శాసనసభా వేదికగా ప్రాజెక్టు రీ-డిజైనింగ్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పిన మాటలివి. ఆయన చెప్పినట్లుగా కార్యరూపంలో పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా యావత్తు రాష్ట్ర సాగునీటి ముఖ చిత్రాన్ని మార్చేశారు. అందులో అతిపెద్ద ప్రయోజనం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకే దక్కింది.
2016 మే 2న మేడిగడ్డ వద్ద ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. పనులను పరుగులు పెట్టించగా, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కేవలం మూడున్నరేండ్లలోనే లక్ష్మీ, సరస్వతీ, పార్వతీ బరాజ్‌లను నిర్మించడమే కాదు అక్కడి నుంచి ఎల్లంపల్లి, నందిమేడారం, రామడుగులోని లక్ష్మీ పంపు హౌస్ ద్వారా మిడ్‌మానేరు దాకా నీటిని చేర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. ఇది సాగునీటి రంగ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డుగా నిలిచిపోయింది.
అనతికాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేసిన ప్రభుత్వం, 2019 నుంచే నీటి ఎత్తిపోతలను ప్రారంభించింది. ఇక్కడి నుంచే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తుండగా, తొలి ఫలితం ఉమ్మడి కరీంనగర్‌కే దక్కింది. క్రమంగా వాటర్ హబ్‌గా మారిపోయి, సస్యశ్యామలంగా మారింది. పంటల విస్తీర్ణం సైతం సగానికిపైగా పెరిగింది. ఎత్తిపోతల ద్వారా నీరు ఎగువమానేరు దాకా చేరింది. నిజానికి ఎగువమానేరు ప్రాజెక్టుకు సమైక్య రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కానీ, స్వరాష్ట్రంలో మండుటెండల్లోనూ ప్రాజెక్టు మత్తడి దూకడం తెలంగాణ ప్రభుత్వానికి సాగునీటి రంగంపై ఉన్న మక్కువను తెలియజేస్తున్నది. అంతేకాదు దశాబ్ధాలుగా బీడుపడ్డ హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలోని భూముల్లో కాళేశ్వర జలాలు పరుగులు పెడుతున్నాయి.