చొప్పదండి, ఆగస్టు 27: బీసీ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాలను అత్యుత్తమంగా తీర్చిదిద్దాలని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం చొప్పదండి పట్టణంలోని బీసీ సోషల్ వెల్ఫేర్ వసతి గృహాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్‌తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహాల్లో గదులను పరిశీలించారు.
విద్యార్థులు ఎంతమంది ఉన్నారు? విద్యా బోధన, హాస్టల్ పరిశుభ్రతకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను అధికారులు, సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. వంటగదిలో విద్యార్థుల కోసం సిద్ధం చేసిన వంటకాలను పరిశీలించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.
ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు, ఓపీ తదితర అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని సూచించారు. మంగళవారం జరిగిన ఆరోగ్య మహిళ క్లినిక్‌ను పరిశీలించి మహిళలకు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సరస్వతి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, వైద్యాధికారులు, సూపర్వైజర్ సిబ్బంది పాల్గొన్నారు.