ఎన్నికేదైనా గెలుపు తమదేనని, ముచ్చటగా మూడోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి తీరుతామని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం నిర్వహించిన కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ నియోజకవర్గ ప్లీనరీ సమావేశాలు పండుగలా సాగాయి. అన్ని చోట్లా అంచనాలకు మించి గులాబీ శ్రేణులు రావడంతో వేదికలు కిక్కిరిసిపోయాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సందడిగా సాగిన సమావేశాల్లో ఉదయం పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా, మధ్యాహ్నం మంత్రి, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా ఇన్చార్జిలు, పార్టీ జిల్లా అధ్యక్షులు దిశా నిర్దేశం చేశారు. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ వెళ్లి వివరించాలని, ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చారిత్రక అవసరాన్ని వివరించాలని సూచించారు. ప్లీనరీల సక్సెస్‌తో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది.
– కరీంనగర్, ఏప్రిల్ 25(నమస్తే తెలంగాణ)
కరీంనగర్, ఏప్రిల్ 25, (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ఏవైనా గెలుపు గులాబీదండుదేనని, రాష్ట్రంలో ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని, లోక్‌సభ ఎన్నికల్లోను భారత రాష్ట్ర సమితి సత్తాను చాటి దేశంలో చక్రం తిప్పుతుందని, దీని కోసం ప్రతి కార్యకర్త శ్రమిస్తాడం టూ గులాబీ శ్రేణులు మంగళవారం ముక్తకంఠంతో తేల్చి చెప్పాయి. రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల సంరంభానికి సంసిద్ధం కావాలని, అందు కోసం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలు, ప్రతినిధుల సమావేశాలు నిర్వహించాలని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం జిల్లాలోని కరీంనగర్, హుజూరాబాద్, మానకొండూ ర్, చొప్పదండితో పాటు సిద్దిపేట జిల్లాలోని హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన గులాబీ ప్రతినిధులు, కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు.
ఐదు నియోజకవర్గాల సమావేశాలకు పెద్ద సంఖ్యలో గులాబీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల కా ర్యకర్తలు, నాయకులు తరలిరావడంతో గులాబీ పండుగ వాతావరణం నియోజకవర్గ కేంద్రాల్లో ఆవిష్కృతమైంది. పార్టీ ఆదేశాల నేపథ్యంలో ఉదయం 9 గంటల తర్వాత అన్ని గ్రామాల్లో, పట్టణాల్లోని వార్డు కేంద్రాల్లో పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం నియోజకవర్గ కేంద్రా ల్లో ఏర్పాటు చేసిన మినీ ప్లీనరీలకు కార్యకర్తలు చేరుకున్నారు. కరీంనగర్ నియోజకవర్గ స్థాయి సమావేశం రేకుర్తిలోని రాజశ్రీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని కరీంనగర్ అర్బన్, రూరల్, కొత్తపల్లి మండలాల నుంచి పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్యకర్తలు ఊహించినదానికంటే అధిక సంఖ్యలో హాజరయ్యారు.
ఉదయం నిర్వహించిన సమావేశంలో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పలు అంశాలపై తీర్మానాల ను పార్టీ నాయకులు ప్రవేశపెట్టారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి రెండున్నర వరకు భోజన విరామం ఇచ్చి, అనంతరం సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి గంగుల, మేయర్ సునీల్‌రావు, తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంలో తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పనులను వివరించిన నాయకులు, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని కార్యకర్తలకు మార్గనిర్దేశనం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉదయం పార్టీ పతాకాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమా ర్ ఆవిష్కరించి మినీ ప్లీనరీకి శ్రీకారం చుట్టారు. తర్వాత హుజూరాబాద్, జమ్మికుంట, వీణవంక, కమలాపూర్, ఇల్లందకుంట మండలాల నుంచి తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలతో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ స్థాయి మినీ ప్లీనరీని ప్రారంభించారు. పార్టీ సూచించిన అంశాలపైన తీర్మానాలను చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులు మధ్యాహ్నం సమావేశాన్ని నిర్వహించాయి. వినోద్‌కుమార్‌తో పాటు మండ లి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజ య పార్టీ శ్రేణులకు మార్గదర్శనం చేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ, కాం గ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని, వాటిని కార్యకర్తలు, నాయకులు ఎప్పటికప్పుడు తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి చర్యలు ఉంటాయని, లేకుంటే ప్రజలు నష్టపోతారని తెలిపారు. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు వివరించాలన్నారు. మానకొండూర్‌లోని సుప్రీమ్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన మినీ ప్లీనరీ సమావేశానికి ఎమ్మెల్యే, రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ అధ్యక్షత వహించి, ప్రసంగించారు. అంతకు ముందు బీఆర్ఎస్ జెం డా గద్దె నుంచి నియోజకవర్గంలోని మానకొండూ ర్, శంకరపట్నం, తిమ్మాపూర్, బెజ్జంకి, గన్నేరువరం మండలాల నుంచి తరలివచ్చిన ఐదు వేల మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు కార్యకర్తలకు దిశానిర్ధేశం చేశారు. సమావేశంలో ఉదయం పూట తీర్మానాలు ప్రవేశపెట్టారు. గంగాధర మండలంలోని మధురానగర్ చౌరస్తాలో మంగళవారం చొప్పదండి నియోజకవర్గస్థాయి మినీ ప్లీనరీ నిర్వహించారు. ముందుగా చొప్పదం డి, గంగాధర, రామడుగు, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాల నుంచి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మధురానగర్ చౌరస్తాకు చేరుకున్నారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూ లమాలలు వేశారు. తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి వీఏస్ గార్డెన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఫంక్షన్ హాలు వద్ద బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, అమరులకు నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం కార్యకర్తలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ శివారులోని శుభం గార్డెన్స్‌లో జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి మినీ ప్లీనరీకి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌తో పాటు మాజీ ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
శ్రేణుల్లో నయాజోష్
ఐదు నియోజకవర్గాల్లో నిర్వహించిన సమావేశాలకు ఊహించినదానికంటే రెట్టింపు సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం, సమావేశంలో ఉద యం పూట ఉత్సాహంగా కార్యకర్తలు, నాయకులు తీర్మానాలు ప్రవేశపెట్టి, వాటిపై చర్చించడం, సాయంత్రం నాయకుల మార్గదర్శనంతో గులాబి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, శ్రేణు లు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సమావేశాల్లో పాల్గొన్న కార్యకర్తలు రానున్న అసెంబ్లీ ఎన్నికలు, అటుపైన వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోను బీఆర్ఎస్ను గెలిపించి తీరుతామని నినదించడం, ఉద్యమంలో పనిచేసిన వారు, ప్రస్తుతం కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులు అంతా ఒకే వేదికపై నిలిచి పార్టీ గెలుపుకు కృషి చేస్తామని ప్రకటించడంతో బీఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో మూడోసారి గెలవడం నల్లేరుపై నడకేనన్న వ్యాఖ్యలు జిల్లా వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.
మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే
నేను మీ వాడిని.. మీ కుటుంబ సభ్యుడిని.. నేనిప్పుడు మంత్రిగా, ఎమ్మెల్యేగా మాట్లాడటం లేదు. మీలో ఒకడిగా మాట్లాడుతున్న. నేను 2000 సంవత్సరం నుంచి రాజకీయాల్లో ఉన్న. నాకు నా తల్లిదండ్రులు జన్మనిస్తే రాజకీయంగా మీరు జన్మనిచ్చారు. కేసీఆర్ కీర్తినిచ్చారు. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. రాష్ట్రం రాక ముందు కరీంనగర్ పట్టణాభివృద్ధికి నిధులు అడిగితే రూ.వెయ్యి కూడా ఇవ్వ లేదు. ఇప్పుడు అడిగిన వెంటనే సీఎం కేసీఆర్ రూ.వెయ్యి కోట్లిచ్చారు. ఆయన ఆశీర్వాదంతో నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నాం. ఒకప్పటి కరీంనగర్ ఎట్లుండే.. ఇప్పుడు ఎట్లున్నదో ఒక సారి గమనించాలి. మనదంతా ఒకే కుటుంబం. మీరు మా బలం, బలగం. నా చివరి రక్తం బొట్టు వరకు కార్యకర్తల కోసమే ధారపోస్తా. కరీంనగర్‌తో పాటు రాష్ట్రంలో మళ్లీ ఎగిరేది గులాబీ జెండానే.
– కరీంనగర్ బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్
టీఆర్ఎస్ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడమే కాకుండా, అధికారంలోకి వచ్చి అభివృద్ధే ఎజెండాతో ముందుకు వెళ్తున్నది. నేడు బీఆర్ఎస్గా మార్పు చెంది ‘అబ్కీ బార్.. కిసాన్ సర్కార్’ అనే నినాదంతో దేశానికి దిశానిర్దేశం చేయబోతున్నది. ఆటు పోట్లు బీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు కొత్త కాదు. గతంలో పార్టీకి వెన్నుపోట్లు పొడిచినా ముందుకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించుకున్నాం. మొన్నటి వరకు పార్టీలో ఉండి వెళ్లిన ఈటల నిజంగా అప్పుడు మొదటి వరుసలో లేకున్నా కేసీఆర్ అండతోనే ఎదిగాడు. కరీంనగర్ ఎంపీగా గెలిచిన బండి సంజయ్ నేటి వరకు ఏం అభివృద్ధి చేశారో చెప్పాలి. దమ్ముంటే కాజీపేట నుంచి హుజురాబాద్ మీదుగా కరీంనగర్ వరకు రైల్వే లైన్ ఏర్పాటు చేయించి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను గ్రామాల్లో ఎప్పటికప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు ఎండగట్టాలి.
– హుజూరాబాద్, హుస్నాబాద్‌లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్
మన రాష్ట్రం దేశానికి రోల్ మోడల్
ఎన్నో ఏండ్లు కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలుస్తున్నది. రాష్ట్రంలో అమలవుతున్న ఎన్నో పథకాలను చూసి దేశం నేర్చుకుంటున్నది. సీఎం కేసీఆర్ 9 ఏండ్లుగా అద్భుతంగా పాలిస్తూ ఎంతో అభివృద్ధి చేశారు. బీసీ అని చెప్పుకుంటున్న ప్రధాని మోదీ, బీసీ అయిన బండి సంజయ్ బీసీల కోసం చేసిందేంటో చెప్పాలి. నిజంగా వారిపై ప్రేమ ఉంటే కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. మానకొండూర్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అద్భుతంగా సమావేశం జరిగింది. నియోజకవర్గంలో 2 లక్షలా 70 వేల ఓట్లు ఉంటే 60 వేల సభ్యత్వాలు బీఆర్ఎస్వే. పార్టీని మరింత బలపరిచేందుకు ప్రతీ కార్యకర్తా సన్నద్ధం కావాలి.
– మానకొండూర్‌లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
సంక్షేమంలో దేశానికే ఆదర్శం
సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ భగీరథతో ప్రజలకు స్వచ్ఛమైన తాగు నీటిని అందిస్తున్నది. రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు ఇస్తున్నది. రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేస్తున్నది. ఇలాగే, దేశంలో రైతు సంక్షేమ ప్రభుత్వ ఏర్పాటుకు బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే లక్ష్యంగా పని చేస్తున్నది. మతోన్మాద శక్తులను రెచ్చగొడుతూ దేశంలో అరాచకం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నది. కరీంనగర్ ఎంపీగా ఉన్న బండి సంజయ్ అభివృద్ధికి నయాపైసా తేలేదు.
-గంగాధరలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఎమ్మెల్యే సీటు గెలిచి సీఎంకు గిఫ్ట్‌గా ఇద్దాం
వచ్చే ఎన్నికల్లో హుజూరాబాద్ గడ్డ మీద బీఆర్ఎస్ జెండా ఎగురవేసి ఎమ్మెల్యే సీటును సీఎం కేసీఆర్‌కు గిఫ్టుగా ఇద్దాం. ఒకే ఒక అవకాశం ఇస్తే ప్రజల నమ్మకం వమ్ము కాకుండా, హుజూరాబాద్ గౌరవం పెంచేందుకు కృషి చేస్తా. ఎమ్మెల్యేగా గెలిపిస్తే హుజూరాబాద్‌ను మరో సిద్ధిపేట, సిరిసిల్లలా తీర్చిదిద్దుతా. ప్రతి కార్యకర్త ఒంట్లో బీఆర్ఎస్ రక్తం ప్రవహించాలి. గెలుపే లక్ష్యంగా సైనికులుగా పనిచేయాలి. మనమంతా కేసీఆర్ కోసం పనిచేయాలి. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారనే నమ్మకం నాకున్నది. అభివృద్ధి కేవలం ఆయనతోనే సాధ్యం.
– హుజూరాబాద్‌లో మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి