PEDDAPALLY | పెద్దపల్లి, ఏప్రిల్11: చదువుతోనే జీవితంలో మార్పు సాధ్యమని, విద్య ప్రాముఖ్యతను చాటి చెప్పిన మహనీయులు మహాత్మా జ్యోతిబా పూలే అని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. కలెక్టరేట్ సమావేశం మందిరంలో శుక్రవారం నిర్వహించిన మహాత్మ జ్యోతిబా పూలే 199వ జయంతి వేడుకల్లో అదనపు కలెక్టర్ దాసరి వేణుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు
. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గతంలో వర్ణ , కుల వ్యవస్థ కారణంగా దళితులు, బడుగు బలహీన వర్గాల పట్ల తీవ్ర వివక్షతకు గురయ్యేవారని, 1827లో మహిళలను సమానంగా చూడటం అనే ఆలోచన కూడా చాలా కష్టమని, అటువంటి పరిస్థితుల్లో మహిళల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహనీయులు పూలే అని కోనియాడారు. సామాజిక సమానత్వం సాధన కోసం జ్యోతి బా పూలే అప్పటి సమాజంలో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి అందరూ కోనసాగించాలని కోరారు.
బాలికల విద్యపై పూలే దంపతులు చిత్తశుద్ధితో పనిచేశారని, స్త్రీలు విద్యా వంతులు కావాలని ఆకాంక్షించారని తెలిపారు. పూలే స్ఫూర్తితో ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాల ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్, ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచిత శిక్షణ అందించడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి జే రంగారెడ్డి, కలెక్టరేట్ సీ విభాగం పర్యవేక్షకుడు బండి ప్రకాశ్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఎన్ శంకర్, తదితరులు పాల్గొన్నారు.