వేములవాడ రూరల్, మే 3: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేస్తున్న ధాన్యాన్ని లారీల్లో మిల్లులకు తరలిస్తుండగా, దించేందుకు హమాలీ లేక అక్కడే రోజుల తరబడి ఉంటున్నాయి. ఫలితంగా కేందాల్లో ధాన్యం పేరుకుపోతుండగా, రైతులు అవస్థలు పడుతున్నారు. వేములవాడ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో 11 కొనుగోలు కేంద్రాలు ఉండగా, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఐదింటిని నడిపిస్తున్నారు.
ఇప్పటి వరకు వేములవాడ ప్రాథమిక సహకార సంఘం పరిధిలో ఏటా 1.50 లక్షలను నుంచి 1.70లక్షల క్వింటాళ్ల కొనుగోళ్లు జరుగుతుంటాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు కేవలం 30 వేల క్వింటాళ్లు మాత్రమే కొన్నారంటే ఎంత జాప్యం జరుగుతున్నదో తెలుస్తున్నది. ఇలాగే కొనసాగితే జూన్ మాసం వరకు కొనుగోళ్లు కొనసాగే అవకాశం ఉంది.