ప్రభుత్వ పాఠశాలలను సర్కారు నిర్లక్ష్యం చేస్తున్నది. పేద పిల్లల అర్ధాకలి చదువులకు స్వస్తి పలుకాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన మధ్యాహ్న భోజనం పథకాన్ని పూర్తిగా గాలికొదిలేసింది. ముందు నుంచీ నిర్వాహకులకు బిల్లులు, వేతనాలు సక్రమంగా ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్‌లో పెడుతూనే, ఇటు స్కూళ్లలో భోజనం సరిగ్గా లేదంటూ హెచ్ఎంలు, మధ్యాహ్న భోజనానికి సంబంధించి ఇన్చార్జి ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటుండడం విస్తుగొలుపుతున్నది. పుండు ఓ చోట ఉంటే.. మందు మరో చోట రాసినట్టుగా.. తప్పు ఒకరిదైతే.. శిక్ష మరొకరికి వేయడం విమర్శలకు తావిస్తున్నది. ఇలానే ఇటీవల జగిత్యాల జిల్లాలో హెచ్ఎం, టీచర్లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడంపై టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భోజన తయారీ విషయంలో ప్రభుత్వమే అనేక తప్పిదాలకు ఆస్కారం ఇస్తూ, తమను బాధ్యుల్ని చేయడం సరికాదని మండిపడుతున్నారు. స్కీం ప్యాట్రన్‌ను మార్చాలని, నిధులు పెంచడంతో పాటు పర్యవేక్షణకు సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు.
జగిత్యాల, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం దాదాపు రెండు దశాబ్దాల క్రితమే ప్రారంభమైంది. విద్యార్థుల కోసం ప్రభుత్వం నేరుగా బియ్యాన్ని పంపిణీ చేస్తూ వస్తున్నది. మిగిలిన దినుసులను నిర్వాహకులు సమకూర్చుకొని భోజనం తయారు చేసి వడ్డించాల్సి ఉంటుంది. వాస్తవానికి ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం ఆయా స్కూళ్ల హెచ్ఎంలకు చేరుతాయి. వారు తన పరిధిలో ఉన్న ఒక ఉపాధ్యాయుడిని మధ్యాహ్న భోజనం ఇన్చార్జిగా నియమించాలి. సదరు టీచర్ ప్రతిరోజూ నిర్వాహకులకు బియ్యాన్ని అందజేయడంతోపాటు తయారైన భోజనం మెనూ ప్రకారం ఉందా.. లేదా..? నాణ్యతగా, రుచిగా ఉందా.. లేదా..? అని పరిశీలించాలి. అలాగే, ఆయా స్కూళ్లలోని ఉపాధ్యాయుల్లో ఎవరో ఒకరు రోజూ భోజనాన్ని ముందుగా తిని, నాణ్యతను నమోదు చేయాలి.
అమలు కాని మెనూ..
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మెనూ చాలా అద్భుతంగా కనిపిస్తున్నా, ఎక్కడా సరిగ్గా అమలు కావడం లేదు. అయితే పెరిగిన ధరల నేపథ్యంలో ఎక్కడా కూరగాయలు, ఆకు కూరలు వండడం లేదు. అప్పుడప్పుడే కూరగాయల భోజనం వడ్డిస్తున్నారు. ఎక్కువగా సోరకాయలు, బెండకాయలు వంటివి కొన్ని వేసి, కొంత పప్పు వేసి సాంబార్ చేసి వడ్డిస్తున్నారు. మెనూతో సంబంధం లేకుండా ఎక్కడ చూసినా ఇదే తిండి పెడుతున్నారు. ఇక వారానికి మూడు సార్లు కోడిగుడ్డు పెట్టాలని ప్రభుత్వం నిర్దేశించినా, నిర్వాహకులు ఒక్కరోజే అందిస్తున్నారు. ఇక వెజిటబుల్ బిర్యాని, కూరగాయలు, ఆకు కూరలతో కూరల ముచ్చటే మరిచిపోయారు.
డబ్బులు చాలడం లేదు.. మేమేం చేస్తాం
మంగళ, బుధవారాల్లో మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాలకు వెళ్లిన ‘నమస్తే తెలంగాణ’తో పలువురు మధ్యాహ్న భోజన నిర్వాహకులు తమ గోసను వెల్లబోసుకున్నారు. తమకు మధ్యాహ్న భోజనం గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం ఇచ్చే మొత్తంతో వంట చేయడం సాధ్యం కాదని తెగేసి చెబుతున్నారు. శిశు నుంచి ఐదో తరగతి లోపు పిల్లల కోసం (ఒక్కొక్కరికి) వంద గ్రాముల బియ్యం, 5.45 ఇస్తుందని, ఇక 6 నుంచి 8వ తరగతి పిల్లల కోసం 150 గ్రాముల బియ్యం, 8.17 ఇస్తుందన్నారు. 9, 10వ తరగతి పిల్లలకు 150 గ్రాముల బియ్యం, 10.67 చెల్లిస్తున్నదని, ఈ డబ్బులతో భోజనం తయారు చేసి అందించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఆకుకూరలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, ప్రభుత్వం ఇచ్చే ధరకు వాటిని కొనుగోలు చేసి భోజనం తయారు చేయడం సాధ్యం కాదని వాపోతున్నారు.
ఇక పప్పుల ధరలు సైతం పెరిగిపోయినందున చిక్కటి పప్పు వేసి కూర చేయడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. కోడిగుడ్డు ఒక్కంటికి ప్రభుత్వం 5 చెల్లిస్తుందని, కానీ మార్కెట్లో ఒక ఎగ్ ధర 7 పలుకుతున్నదని చెబుతున్నారు. ఇలాంటప్పుడు ప్రభుత్వం ఇచ్చే డబ్బులతో కోడిగుడ్డు ఎలా ఇవ్వగలమని, అందుకే వారానికి ఒక్కరోజు మాత్రమే పెడుతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం సిలిండర్లు ఇవ్వడం లేదని, వాటి ధరలు వందలు దాటి వేలకు చేరుకోవడంతో వాటిని కొనుగోలు చేసి వినియోగించడం సాధ్యం కావడం లేదని చెబుతున్నారు. విధి లేని పరిస్థితుల్లో మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నామని, మనస్ఫూర్తిగా మాత్రం వండిపెట్టడం లేదన్నారు. పిల్లలకు నీళ్లలాగా ఉన్న పలుచని చారుతో భోజనం పెట్టడం తమకు సైతం ఇష్టం లేదని, అయితే విధి లేని పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సన్నబియ్యం అంటూ దొడ్డుబియ్యం ఇస్తున్నారని, అవి సరిగా ఉండడం లేదని, అన్నం ముద్ద అవుతున్నదని వాపోతున్నారు.
నాలుగు నెలలుగా అందని బిల్లులు.. గౌరవ వేతనం
జగిత్యాల జిల్లాలో విద్యా సంవత్సరం ఆరంభమయ్యేనాటికి మధ్యాహ్న భోజన కార్మికులకు ఏడు నెలల బిల్లులు మంజూరు కాలేదు. జూలైలో బిల్లులు మంజూరు చేయగా, జిల్లాలో ఉన్న 1,475 మంది మధ్యాహ్న భోజన కార్మికులకు కొంత చెల్లింపులు చేశారు. 8వ తరగతి వరకు బిల్లులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 దామాషా ప్రకారం చెల్లిస్తున్నాయి. బియ్యం మొత్తం కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నది. ఇక 9, 10వ తరగతులకు చెందిన విద్యార్థులకు సంబంధించిన పూర్తి చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వమే అందిస్తున్నది. కుక్కు, సహాయకులకు గౌరవ వేతనం అందజేస్తున్నారు. అయితే, దీనికి విద్యార్థుల సంఖ్యనే ఆధారం చేశారు. 25 మంది విద్యార్థుల లోపు సంఖ్య ఉంటే ఒక్క వంటమనిషి మాత్రమే ఉండాలి. 25 నుంచి 100 మందిలోపు విద్యార్థులు ఉంటే ఇద్దరు కార్మికులను వినియోగించుకోవాలి. 100 మందికి పైన ఉంటే ముగ్గురు కార్మికులను ఏర్పాటు చేయాలి. కుక్కుకు గౌరవ వేతనంగా కేంద్రం వెయ్యి అందజేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం 2వేలు అందిస్తున్నది. మొత్తంగా ఒక్కో కార్మికురాలికి నెలకు 3 వేలు చెల్లిస్తున్నారు. అయితే, ఆగస్టు నుంచి భోజన తయారీకి సంబంధించిన బిల్లులు, కార్మికులకు గౌరవ వేతనం రావడం లేదు. నాలుగు నెలలుగా బిల్లులు రాకపోతే భోజనం ఎలా తయారు చేయాలో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. మధ్యాహ్న భోజనం ధరలను డిసెంబర్ నుంచి పెంచుతామని ప్రభుత్వం చెప్పినా.. అవి వచ్చేదెన్నడో అని వాపోతున్నారు.
టీచర్లను బాధ్యుల్ని చేయడంసరికాదు
మధ్యాహ్న భోజనం నాణ్యత, అమలు విషయంలో టీచర్లు, హెచ్ఎంలను బాధ్యుల్ని చేయడం సరికాదు. భోజనం తయారీ, నాణ్యత విషయంలో టీచర్ల పాత్ర నామమాత్రమే. బియ్యం పంపిణీ చేసే దాకా బాధ్యతలను నిర్వర్తించగలం. కానీ నాణ్యత, మెనూ అమలు, రుచి, తదితర అంశాల్లో వారి పాత్ర నామమాత్రంగానే ఉంటుంది. టీచర్లపై కీలక బాధ్యతలు ఉన్నాయి. స్మార్ట్ తరగతుల నుంచి మొదలు కొని ప్రత్యేక క్లాసుల దాకా చెప్పాల్సి వస్తుంది. అలాగే, కంప్యూటర్ పనులు పెరిగాయి. ఈ నేపథ్యంలో భోజన తయారీపై దృష్టి సారించడం కష్టం. వాస్తవానికి భోజన తయారీ అనేది నిధులు, వేతనం, మార్కెట్ ధరలపై ఆధారపడి ఉన్న అంశం. అందులో టీచర్లను ఇన్వాల్వ్ చేసి, భోజనం సరిగా లేదని చర్యలు తీసుకోవడం బాధాకరం. ఇప్పటికైనా ఆలోచించి, టీచర్లను భోజన తయారీ బాధ్యతల నుంచి మినహాయించాలి.
– బోనగిరి దేవయ్య, టీపస్ జిల్లా శాఖ అధ్యక్షుడు (జగిత్యాల)
ఇన్చార్జిలుగా ఉండలేం అంటున్నరు
మధ్యాహ్న భోజనానికి సంబంధించి టీచర్లను బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవడం వల్ల టీచర్లు భయపడుతున్నారు. స్కూళ్లలో ఇప్పుడు మధ్యాహ్న భోజనం ఇన్చార్జిలుగా ఉన్న వారు తాము బాధ్యతలు నిర్వర్తించలేమంటూ హెచ్ఎంల వద్దకు క్యూ కడుతున్నారు. మధ్యాహ్న భోజన బాధ్యతల నుంచి టీచర్లను మినహాయించి, దాని కోసం ప్రత్యేకంగా వలంటీర్లను నియమించుకుంటే బాగుంటుంది. సబ్జెక్టు టీచర్లపై పిల్లల ఫలితాల సాధన ఒత్తిడితో పాటు, ఇతర అనేక బాధ్యతలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లను బాధ్యులుగా చేయవద్దు.
– యాళ్ల అమర్నాథ్రెడ్డి, టీపీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి (జగిత్యాల)