రాయికల్, జూన్ 4 : వానకాలం సీజన్ మొదలైనా రైతు భరోసాపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని, అసలు రైతు భరోసా ఉన్నట్టా.. లేనట్టా..? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసలు రైతు భరోసా కనుమరుగైనట్టు కనిపిస్తున్నదని ఆగ్రహించారు. రైతులు వానకాలం సాగుకు సన్నద్ధమయ్యారని, కనీసం ఈ సీజన్లోనైనా రైతు భరోసా కల్పించాలని హితవు పలికారు. జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారనే తప్పా రైతుల గురించి ఆలోచన చేయడం లేదని, ధాన్యం సేకరణలో రైతులు ఇబ్బందులు పడుతున్నా కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పంట రుణాలకు సంబంధించి ఇప్పటి వరకు కార్యాచరణ కనిపించడం లేదనన్నారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా పప్పు దినుసులు, నూనె గింజలు పండించాలని సలహా ఇచ్చినట్టు గమనించామన్నారు. అయితే పప్పు దినుసులు, నూనె గింజలకు ఏ విధమైన ప్రోత్సాహం ప్రభుత్వం కల్పించబోతున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా రైతు అని, ఆయ న పామాయిల్ పంట పెట్టుకుంటే కోతుల బెడద లేకపోవచ్చు కానీ, ఆరుతడి పంటలకు మాత్రం కోతుల బెడద ఎకువగా ఉందన్నారు. కోతులకు పునరుత్పత్తి నిలుపుదల కేంద్రాన్ని జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలని, తక్షణమే రైతుకు సోలార్ ఫెన్సింగ్ 50 శాతం రాయితీతో ఇవ్వాలని సూచించారు. ఆరుతడి పంటలకు బదులు ఇతల పంటలు వేయాలంటే రైతులకు 50 శాతం రాయితీతో విత్తనాలు ఇవ్వాలన్నారు. రైతులను సేంద్రియ ఎరువుల వైపు మళ్లించాలని భావిస్తున్నప్పుడు పచ్చిరొట్ట జనుము, జీలుగు విత్తనాల భారం ఎకరానికి రూ.2 వేల వరకు పడుతుందన్నారు.
వరి సన్న రకాలకు క్వింటాల్‌కు 500 బోనస్ ఇస్తామని చెప్పారని, అలాగే పప్పు దినుసులకు కూడా ప్రోత్సాహం కల్పించాలన్నారు. ఎందుకంటే పప్పు దినుసులు ఎకరానికి 5 క్వింటాళ్లకి మించి పండవని, అవి పండించాలంటే ప్రధానంగా కోతుల బెడద, గిట్టుబాటు ధర లేకపోవడం ప్రధాన సమస్యగా మారిందన్నారు. జనము, జీలుగు విత్తనాలు ఉచితంగా ఇచ్చినా తప్పులేదని, గతేడాది కిలో రూ.40 ఉంటే ఇప్పుడు రూ.80 అయిందన్నారు. అసలు ఈ విషయం ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి తెలుసా లేదో తె లియదన్నారు.
డీఏపీ రూ.1800 నుంచి రూ.2300 అయిందన్నారు. మారెట్లో యూరియా అందుబాటులో లేదని, యూరియా స్టాక్ ఉంది కానీ రైతులు కొనుగోలు చేయాలంటే యాప్ బ్లాక్ చేసి ఉందని, దానిని బ్లాక్ తీసేసి గతంలో ఏ విధంగా అందుబాటులో ఉండేదో ఆ విధంగా అందుబాటులోకి తేవాలన్నారు. రైతులను గోస పెట్టడం ప్రభుత్వానికి మం చిది కాదని, ఇప్పటికైనా మేలు చేసే ప్రయత్నం చే యాలని హితవు పలికారు. సమావేశంలో నాయకులు సీకే రెడ్డి, రాజిరెడ్డి, మల్లేశ్, మహిపాల్ రెడ్డి, ఉదయ శ్రీ, శ్రీధర్ రెడ్డి, రాకేశ్, సంతోష్, భూమ య్య, నాగరాజు, రాజేందర్ గౌడ్, శ్రీకాంత్, మహే శ్, రమేశ్, హరీశ్, తదితరులు పాల్గొన్నారు.