మానకొండూర్, జనవరి 27: ‘కాంగ్రెస్ అంటేనే మోసకారి పార్టీ. మాయమాటలు, అలవికాని హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చింది. సంక్షేమ పథకాలను అమలు చేసే సత్తా ఆ ప్రభుత్వానికి లేనే లేదు. వాళ్లు చెప్పేవన్నీ ఉత్త ముచ్చట్లే’అని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. సోమవారం మానకొండూర్‌లోని బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డివి తుపాకీ రాముడి మాటలని, హామీలు ఇచ్చి అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యఅని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏనాడూ నిజాలు మాట్లాడలేదని విమర్శించారు. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, 9న ప్రమాణ స్వీకారం చేసిన అదే రోజు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించారని గుర్తుచేశారు. గెలిచాక 100 రోజుల్లో అమలు చేస్తానని మళ్లీ మాట మార్చారని, 100 రోజుల తర్వాత ఇంటింటికీ సర్వే పేరుతో ప్రజలను మరోసారి మోసం చేశారని, ఇప్పటికీ ప్రభుత్వం ఏర్పడి 415 రోజులైనా హామీలు, గ్యారంటీలు అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు ప్రజాపాలన గ్రామసభల పేరుతో నాలుగు పథకాల అమలు చేస్తామని మరోసారి ప్రజలను పిచ్చోళ్లను చేశారని మండిపడ్డారు. ప్రజల ఆశల మీద రాజకీయాలు చేయడం కాంగ్రెస్ నేతలు మానుకోవాలని హితవు పలికారు.
ఇందిరమ్మ ఇండ్లు, రేషన్‌కార్డులు, ఆత్మీయ భరోసా పేరుతో ప్రజలను దరఖాస్తు చేసుకోమ్మని మభ్యపెట్టి మండలానికో గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేర్కొనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఒక్క మానకొండూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్లకు దాదాపు 40 వేలు, రేషన్‌కార్డులకు 20 వేల మందిని అర్హులుగా అధికారులు, కాంగ్రెస్ నేతలు గుర్తించి పంచాయతీ కార్యాలయాల్లో జాబితా అతికించారని, మరి వారికి ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.
మానకొండూర్ నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరైనట్లు గ్రామాల్లో ఎమ్మెల్యే ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసుకుంటున్నాడని, మరి ఇప్పుడు 40 వేల మందికి ఎలా ఇండ్లు కట్టిస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మానకొండూర్ ఎమ్మెల్యే కమీషన్ల నారాయణ అని, నియోజకవర్గంలో కేవలం 400 మందికి ఇండ్లు కట్టించి బిల్లులు ఇప్పిస్తే వచ్చే ఎన్నికల్లో తాను మానకొండూర్ నుంచి పోటీ చేయనని సవాల్ విసిరారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాళ్లపెల్లి శేఖర్‌గౌడ్, నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, గడ్డం నాగరాజు, గుర్రం కిరణ్‌గౌడ్, గంట మహిపాల్. రామంచ గోపాల్‌రెడ్డి, ఎరుకల శ్రీనివాస్‌గౌడ్, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, ఇస్కుల్ల అంజనేయులు, రాజశేఖర్, గడ్డం సంపత్, నెల్లి శంకర్ ఉన్నారు.