సంచలనం రేపిన కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ‘ది గోల్డెన్ థీఫ్’ ముఠా నాయకుడు సుబోధ్‌సింగ్ కస్టడీలోకి తీసుకోవడం ప్రాధాన్యతగా మారింది. 400కుపైగా కేసుల్లో మోస్వాంటెడ్గా ఉన్న అతడు పోలీసులకు సహకరిస్తాడా.. లేడా? ముఠా వివరాలు వెల్లడిస్తాడా.. లేదా..? ఆభరణాలు ఎక్కడ విక్రయించింది చెబుతాడా.. లేదా? అన్నదానిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడు ఇచ్చే వివరాలే కేసుకు కీలకం కానుండగా, సుబోధ్ సింగ్ మాత్రం ఏదీ అడిగినా ‘ముజ్ కో నై మాలూమ్’ అనే మాట తప్ప మరో మాట చెప్పడం లేదని తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు వాస్తవాలు రాబట్టేందుకు ఎటువంటి వ్యూహం అనుసరిస్తారన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది.
కరీంనగర్ రాంనగర్, జూన్ 3: కరీంనగర్ పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసు ఇంకా కొలిక్కిరాలేదు. ఈ లూటీ జరిగి నెల రోజులవుతున్నా ఇంకా పూర్తి వివరాలు మాత్రం బహిర్గతం కాలేదు. అయితే ఈ దోపిడీని సవాల్‌గా తీసుకున్న పోలీసులు, ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేశారు. లూటీకి నాయకత్వం వహించిన రఘునాథ్ కర్మాకర్‌తోపాటు రవిశ్ కుమార్, వీరికి సెల్‌ఫోన్ సిమ్‌లు అందించిన మెహతాబ్‌ను గత నెల 14న అరెస్ట్ చేసి కరీంనగర్ జైలుకు తరలించారు.
అయితే దోపిడీకీ స్కెచ్ వేసిన ‘ది గోల్డెన్ థీఫ్’ ముఠా నాయకుడు సుబోధ్‌సింగ్ బిహార్ పూర్ణియా జైలులో ఉన్నట్టు గుర్తించి, గత నెల 28న చట్టపరంగా ఆధీనంలోకి తీసుకున్నారు. కరీంనగర్‌కు మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచి, అనంతరం జిల్లా జైలుకు తరలించారు. విచారణ కోసం సుబోధ్‌సింగ్‌ను బుధవారం కరీంనగర్ టూ టౌన్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 3 నుంచి 6వ తేదీ సాయంత్రం వరకు జ్యువెల్లరీ దోపీడీపై విచారించనున్నారు. అయితే దొంగలు ఎత్తుకెళ్లిన 161.4 తులాల బంగారు ఆభరణాలు, 112 క్యారెట్ వజ్రాభరణాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదు.
ఇప్పటి వరకు ఎక్కడ విక్రయించారన్నది తెలియదు. ఈ పరిస్థితుల్లో సుబోధ్‌సింగ్‌ను కస్టడీకి తీసుకోవడం ప్రాధన్యతగా మారింది. అతని నుంచి వచ్చే సమాచారమే ఈ కేసులో అత్యంత కీలకం కానుండగా, పోలీసులు సమాచారం రాబడుతారా.. లేదా..? అన్నది ఉత్కంఠ రేపుతున్నది. అయితే సుబోధ్‌సింగ్ సహకరిస్తాడా..? అంత సులువుగా సమాచారం ఇస్తాడా.. ముఠా వివరాలు వెల్లడిస్తాడా..? ఆభరణాలు ఎక్కడ విక్రయించింది చెబుతాడా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పోలీసులు మాత్రం ఎలాగైనా క్లూ దొరుకుతుందన్న విశ్వాసంతో ఉన్నారు. కాగా, బుధవారమే విచారణ ప్రారంభించగా.. సుబోధ్ సింగ్ మాత్రం తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నట్టు తెలిసింది. ఏదీ అడిగినా ‘ముజ్ కో నై మాలూమ్’ అనే మాట తప్ప మరో మాట చెప్పడం లేదని తెలిసింది. ఇటువంటి పరిస్థితుల్లో పోలీసులు అతని నుంచి వాస్తవాలు రాబట్టేందుకు ఎటువంటి వ్యూహం అనుసరిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ర్టాల్లో 400కు పైగా దోపీడీలు, దొంగతనాలు, హత్య నేరాలకు పాల్పడి మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న సుబోధ్‌సింగ్ నుంచి కరీంనగర్ పోలీసులు జ్యువెల్లరీ దోపిడీ సంబంధించి కూపీ లాగుతారా.. లేదా? అన్నది మున్ముందు తేలనున్నది.
దోచుకున్న ఆభరణాలను ఇప్పటికే వెస్ట్ బెంగాల్, నేపాల్ ప్రాంతాల్లో విక్రయించినట్టు సమాచారం అందుతున్నది. ఆ ఆభరణాలు ఎవరి ద్వారా విక్రయించారు? ఎంత మంది చేతులు మారాయి? ఎలా రికవరీ చేస్తారు? ఎవరి వద్ద నుంచి రికవరీ చేస్తారు? అన్న సమాచారం రాబడుతారా.. లేదా? అన్నది పోలీసులు చెబితే తప్ప బయటకు రాని పరిస్థితి ఉన్నది. మొత్తం మీద, సుబోధోసింగ్ ఇచ్చే సమాచారంపై అందరి దృష్టి నెలకొన్నది. అందులో పోలీసులు సక్సెస్ అవుతారా.. లేదా? అన్న ప్రశ్నలు వ్యక్తం అవుతుండగా, ఆ శాఖ మాత్రం ధీమాగా ఉన్నట్టు తెలుస్తున్నది.