Bandi Sanjay Kumar | వీణవంక, జూలై 5: కరీంనగర్ పార్లమెంట్‌ను నంబర్-1 తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. వీణవంక మండల కేంద్రంలో రూ.78 లక్షలు, జమ్మికుంటలోని గండ్రపల్లిలో రూ.78 లక్షలతో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం కింద నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లను శనివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఆరేళ్లలో రూ.20 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేసినట్లు వివరించారు. ప్రజల అభివృద్ధి కోసం స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి పని చేస్తున్నామని, కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని తెలిపారు. వీణవంక 106 బూత్‌లో గల ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవన నిర్మాణం కోసం నాయకులు దాసారపు రాజు, డీ అశోక్ వినతిపత్రం ఇవ్వగా తప్పకుండా మంజూరు చేస్తానని మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు.
గిన్నిస్ బుక్ రికార్డు పత్రాలు అందజేత
మండల కేంద్రానికి చెందిన బత్తిని సహశ్రీ, వేముల సరివిక, కాసర్ల లాస్య గత సంవత్సరం గచ్చిబౌలిలో కూచిపూడి నృత్య ప్రదర్శనలో వరల్డ్ రికార్డు సాధించారు. కాగా ఈ సందర్భంగా వీణవంకలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేతుల మీదుగా గిన్నిస్ బుక్ రికార్డు పత్రాలను వారికి అందజేశారు. రానున్న రోజుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరిన్ని రికార్డులు సాధించాలని వారిని అభినందించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్‌రావు, సింగిల్‌విండో చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ వనమాల-సాదవరెడ్డి, మాజీ వైస్‌ఎంపీపీ లత-శ్రీనివాస్, కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, వీణవంక మాజీ సర్పంచ్ నీల కుమారస్వామి, బీజేపీ గ్రామశాఖ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్, ఆయా గ్రామాల మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, గ్రామశాఖ అధ్యక్షులు, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నాయకులు ఎర్రబెల్లి సంపర్రావు, రాజేశ్వర్‌రావు, ఆకుల రాజేందర్, జీడి మల్లేశ్, తహసీల్దార్ రజిత, ఎంపీడీఓ శ్రీధర్, సింగిల్‌విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.