Singareni | కోల్ సిటీ, అక్టోబర్ 12: సింగరేణి సంస్థ రామగుండం – 3 డివిజన్ ఓపెన్ కాస్ట్ – 1 ప్రాజెక్టు డ్రాగ్ లైన్ సెక్షన్ ఉద్యోగులు ఔదార్యం చాటుకున్నారు. చేయి చేయి కలిపి… సహోద్యోగి కుటుంబంకు చేయూత అందించారు. గోదావరిఖని అశోక నగర్ కు చెందిన జహీద్ సింగరేణి ఓసీపీ- 1లో పని చేస్తూ ఆకాల మృతి చెందాడు. అతని కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో ఆ కుటుంబంకు అండగా నిలిచేందుకు తోటి ఉద్యోగులు ముందుకు వచ్చారు. తమతో కలిసి 35 యేళ్లు పని చేసిన జహీద్ జ్ఞాపకార్థం అతని కుమార్తె వివాహంను భుజాన వేసుకున్నారు.
ఇందులో భాగంగా అదివారం గోదావరిఖని అశోక్ నగర్ లోని జహీద్ కుటుంబ సభ్యులను కలిసి తక్షణ సాయంగా ఉద్యోగులు మాజీ డీజీఎం కొత్త కిషన్, ఆపరేటర్ చంద్రపాల్ చేతుల మీదుగా రూ.65,500లు అందించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ జహీద్ తమలో ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడనీ, ఆయన మరణం తమకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
తన భర్త లేకపోయినా తమ కుటుంబంను గుర్తు పెట్టుకొని నిండు మనసుతో సాయం చేయడానికి ముందుకు వచ్చిన ఉద్యోగులకు జహీద్ భార్య కృతజ్ణతలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ డ్రాగ్ లైన్ ఆపరేటర్ రామ్మోహన్, కుటుంబ సభ్యులు ఇజాజ్, అమేనా, ఖయ్యుమ్, జెబా తబస్సుమ్ తదితరులు పాల్గొన్నారు.