Veenabvanka | వీణ వంక,జూలై14: కాలం దాటిపోతున్నా.. వరుణుడు కరుణించకపోవడంతో మండల కేంద్రంలో రైతులు, పెద్దలు, యువకులు సోమవారం కప్పతల్లి ఆట ఆడి ప్రత్యేక పూజలు చేశారు. తొలకరి పలకరించినా.. ఆ తరువాత వర్షాలు ముఖం చాటేశాయి. అన్నదాతలు దుక్కులు దున్ని పంటలు వేసుకునేందుకు సిద్ధంగా ఉండగా వర్షం చుక్క లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికైనా వరుణుడి కరుణించి వర్షాలు కురిపించాలని కోరారు.
గ్రామంలోని పోచమ్మ, శివాలయం, గ్రామదేవతలకు పూజలు చేసి, ఎస్సీ కాలనీవాసులు గ్రామంలోని వీధుల గుండా తిరుగుతూ చిన్నా పెద్ద తేడా లేకుండా డప్పుచప్పుల్లతో ఇంటింటికీ తిరుగుతూ కప్పతల్లి ఆట ఆడారు. మహిళలు, రైతులు బిందెలతో నీళ్లు పోస్తూ వరుణుడు కరుణించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో దాసారపు రాజెల్లయ్య, దాసారపు రాజేంద్రప్రసాద్, అంబేద్కర్, ఎమ్మార్పీఎస్, కమిటీ అధ్యక్షుడు కృష్ణకాంత్, అశోక్, రైతులు కొమురయ్య, బతుకయ్య, వీరస్వామి, దాసారపు శంకర్, లింగయ్య, వంశీకృష్ణ, స్వామి, కుమార్, రాజేశం, యువకులు తదితరులు పాల్గొన్నారు.