Sirisilla | కలెక్టరేట్, జూలై 4: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ సేఫ్టీ శాఖ పనితీరుపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో వరుసగా ఆహార నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నా, ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పందించడం లేదని సీపీఎం సిరిసిల్ల పట్టణ కార్యదర్శి ఎలిగేటి రాజశేఖర్ ఆరోపించారు. ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే హడావుడిగా తనిఖీలు నిర్వహించడం తప్ప, నిత్య పర్యవేక్షణ పూర్తిగా గాలికొదిలేశారని మండిపడ్డారు. సిరిసిల్ల పట్టణంలోని అమృతలాల్ శుక్ల కార్మిక భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పుట్టగొడుగుల్లా హోటళ్లు, రెస్టారెంట్లు పెరుగుతున్నప్పటికీ వాటిపై నాణ్యతా తనిఖీలు కనిపించడం లేదన్నారు.
నాసిరకం వంటనూనెలు, నిబంధనలకు విరుద్ధంగా తయారవుతున్న ఆహార పదార్థాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ముఖ్యంగా సిరిసిల్ల పట్టణంలోని బాలాజీ స్వీట్ హౌస్ తయారీ కేంద్రం జనావాసాల మధ్య నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతోందని, అక్కడ పరిశుభ్రత ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపించారు. ఈ వ్యవహారం అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు, సూపర్ మార్కెట్లు, కిరాణా దుకాణాల్లో కల్తీ ఆహార పదార్థాల విక్రయాలను అరికట్టేందుకు నిరంతర తనిఖీలు నిర్వహించాల్సిన ఫుడ్ సేఫ్టీ శాఖ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కల్తీ ఆహారం వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడితే బాధ్యత ఎవరు వహిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా జిల్లాలో ప్రత్యేక తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, స్వీట్ తయారీ కేంద్రాలు, ఆహార వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఎం నాయకులు దాసరి రూప, సూరం పద్మ, సందుపట్ల పోచమ్మల్లు తదితరులు పాల్గొన్నారు.