మత్స్యకారుల జీవన వనరు కేశవపట్నం చేప పిల్లల కేంద్రం మూలకుపడింది. ఒకప్పుడు తెలంగాణలోనే నంబర్‌వన్ బ్రీడింగ్ కేంద్రంగా వెలుగొందిన ఈ సెంటర్.. అధికారుల అలసత్వంతో రెండున్నరేళ్లుగా మూతపడింది. అప్పటి నుంచి పట్టించుకునే దిక్కులేకుండా పోయి, నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్నది. ఫలితంగా మత్స్యకారులు ఉపాధికి దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం సెంటర్‌ను పునరుద్ధరించి వినియోగంలోకి తేవాల్సిన అవసరం ఉన్నది.
శంకరపట్నం, సెప్టెంబర్ 18: కేశవపట్నం శివారులోని పాపయ్యపల్లి దారిలోని చేప పిల్లల విత్తన ఉత్పత్తి కేంద్రం ఎంతో పేరు గాంచింది. దీనిని 1983లో అప్పటి ప్రభుత్వం 66 ఎకరాల విస్తీర్ణంలో కాకతీయ కాలువ దిగువన నిర్మించింది. మొదట 2 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి టార్గెట్‌తో హేచరీ ఏర్పాటు చేయగా, అప్పట్లో ఇది తెలంగాణలోనే కేంద్ర బిందువుగా వెలుగొందింది. ఇక్కడి నుంచే బ్రీడింగ్ అత్యధికంగా ఎగుమతి అయ్యేది.
కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని వేలాది చెరువులు, కుంటలకు చేప పిల్లల సరఫరా ఇక్కడి నుంచే జరిగేది. వేలాది మంది మత్స్యకారులకు చేతినిండా ఉపాధి దొరికేది. కాలక్రమంలో 22 ఏండ్ల క్రితం దీనిని చేప పిల్లల కేంద్రంగా మార్చారు. తర్వాత కూడా ఉత్పత్తి బాగానే జరిగినా.. అధికారుల అలసత్వంతో రెండున్నరేళ్ల క్రితం మూతపడ్డది. అప్పటి నుంచి మొత్తానికే నిరుపయోగంగా మారింది. కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం ఇక్కడ కేవలం ఎఫ్డీఓతో పాటు ఓ అటెండర్ పోస్ట్ ఉంది.
మరో ఐదుగురు షిషర్మెన్, ఒక ఫీల్డ్మెన్తో పాటు వాచ్‌మన్‌ను నియమించాల్సి ఉంది. సంబంధిత అధికారులను ఫోన్లో ప్రశ్నిస్తే.. సెంటర్ మూట పడడానికి నీటి కొరతనే ప్రధాన కారణమని చెప్పడం విస్మయం కలిగిస్తున్నది. నిజానికి పైన కాకతీయ కాలువ, పక్కనే చెరువు ఉన్నా నీటి కొరతగా పేర్కొనడం వినడానికి హాస్యాస్పదంగా ఉన్నది. ఫిషరీ కోసం అప్పట్లో చెరువు పక్కన ప్రత్యేకంగా ఓ బావి తవ్వినా, కాలక్రమంలో అది పూడుకుపోయింది. అలాగే కాలువ నుంచి ప్రత్యేకంగా సిమెంట్ పైపులతో పైప్‌లైన్ కూడా నిర్మించినా, నిర్వహణలోపంతో కనుమరుగైంది.
సెంటర్‌ను పునరుద్ధరించేనా..?
సెంటర్లో ఒక్కో క్రాప్‌కు 50 లక్షల చొప్పున రెండు క్రాప్‌లకు గాను కోటి చేప పిల్లలను ఉత్పత్తి చేయడానికి అవకాశమున్నది. నీటి లభ్యతను భట్టి కనీసం ఒక క్రాప్‌కు అయినా 50 లక్షలు సులభంగా ఉత్పత్తి చేసేందుకు ఆస్కారమున్నది. స్థానిక అవసరాలకే కాక చుట్టు పక్కల జిల్లాల సొసైటీలకు కావాలసిన చేప పిల్లలను ఇక్కడి నుంచే ఉత్పత్తి చేసుకోవచ్చు. బోరు వేస్తే కొంత వరకు నీటి కొరతను అధిగమించవచ్చని కరీంనగర్ డీఎఫ్‌వో విజయభారతి సూచిస్తున్నారు.
ఈ క్రమంలో మత్స్యకారులు కూడా చేప పిల్లల కేంద్రాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. సెంటర్‌ను వినియోగంలోకి తీసుకు వచ్చేందుకు గత నెల 12న మత్స్య పారిశ్రామిక సంఘాల సమావేశంలో తీర్మానం చేశారు. ఈ మేరకు అడిషనల్ డైరెక్టర్, ఎఫ్‌డీవోల ఆధ్వర్యంలో సెంటర్ పునరుద్ధరణకు 1.55 కోట్ల అంచనాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఏం జరుగుతుందో వేచి చూడాల్సి ఉన్నది.
ప్రభుత్వం పునరుద్ధరించాలి
ఎంతో పేరుగాంచిన కేశవపట్నం ఫిషరీ కొన్నేండ్ల కిందనే మూతపడింది. ఫిషరీ స్థలం ఆక్రమణకు గురవుతున్నది. మెటీరియల్ తుప్పు పడుతున్నది. ప్రభుత్వం అప్పట్లో స్థానికేతరుడైన ఓ వ్యక్తికి లీజ్‌కు ఇచ్చే క్రమంలో సభ్యులంతా ఏకమై అడ్డుకున్నాం. వినియోగంలోకి తెస్తే దీనికి ఉన్న వాటర్ సోర్స్ దేనికీ లేదు. కరీంనగర్ ఫిషరీతో పోలిస్తే కేశవపట్నం ఫిషరీకి ఉన్న స్థలం అతి పెద్ద క్రెడిట్. చిత్తశుద్ధి ఉంటే దీన్ని కోట్లాది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంగా తీర్చి దిద్దవచ్చు. ప్రభుత్వం ఇప్పటికైనా పునరుద్ధరించాలి.
– భూమ సంపత్, మత్స్య పారిశ్రామిక సంహకార సంఘం జిల్లా మాజీ కార్యదర్శి (కరీంనగర్)
నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి
కేశవపట్నం చేపల కేంద్రం దుస్థితికి పాలకులే కారణం. సెంటర్‌కు నిధుల విడుదల చేయక పాలకులు, జిల్లా కేంద్రానికి దూరంగా ఉండడంతో అధికారులు నిర్లక్ష్యం చేశారు. నీటి కొరత వల్లే ఇది మూత పడిందనడం సరికాదు. పిషరీకి పైన కాకతీయ కాలువ, పక్కన చెరువు, కెనాల్ యూటీ ఉన్నాయి. అదీగాక పూడిక తీసి వినియోగంలోకి తెస్తే పెద్ద రింగ్ బావి అందుబాటులో ఉంది. చేపల కేంద్రాన్ని వెంటనే బాగు చేయాలని ఇటీవలే తీర్మానించాం. ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలి. లేదా జిల్లా సొసైటీ సభ్యులకు లీజుకు ఇవ్వాలి.
– పెసరు కుమారస్వామి, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు (కరీంనగర్)