Good idea | ఓదెల, అక్టోబర్ 10: పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు ఆలోచన అందరినీ ఆకర్షిస్తుంది. ద్విచక్ర వాహనం( బైక్) కు ట్రాక్టర్ ట్రాలీ వలె( డబ్బా) తయారు చేయించి దాని ద్వారా వ్యవసాయ పనులని తీర్చుకుంటున్నాడు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామానికి చెందిన చిత్రాల రవి అనే రైతు తన బైక్ కె ట్రాక్టర్ మాదిరిగా డబ్బా తయారు చేయించుకున్నాడు.
దీంతో గడ్డి కట్టలు, ఎరువులను వ్యవసాయ భూముల వద్దకు జార కొడుతున్నాడు. అంతే కాదు బైక్ పై ఇద్దరు, ట్రాలీ డబ్బాలో ముగ్గురు వరకు కూలీలు మొత్తంగా ఐదుగురిని తీసుకువెళ్లి పనులు చేయించుకునే సదుపాయం ఉంటుంది. సన్న, చిన్న కారు రైతులు ట్రాక్టర్ కొనే పరిస్థితులు ఉండవు. కాబట్టి రైతు వినూత్నంగా ఆలోచన చేసి ఇలా ట్రాక్టర్ ట్రాలీ వలె వెల్డర్ వద్ద డబ్బా ను తయారు చేయించుకున్నాడు.
మిగతా సమయాల్లో మళ్లీ ఎప్పటి లాగానే బైకు గా ఉపయోగపడుతుంది. వ్యవసాయ సాగులో ఈ బైక్ ఎంతగానో సాయపడుతున్నట్లు రైతు పేర్కొన్నాడు. ఈ బైకుపై పరిసర గ్రామం ఓదెల మండలం కొలనురుకు పచ్చ గడ్డి కోసం రాగా ‘నమస్తేతెలంగాణ’ క్లిక్ మనిపించింది. ఈ రైతు బైక్ చూపర్లను ఆకట్టుకోవడమే కాక, ఆలోచన అదిరిందని పలువురు ప్రసంశించారు.