మొంథా తుపాన్ మిగిల్చిన గాయాల నుంచి రైతన్న తేరుకోలేకపోతున్నాడు. ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వ పెద్దలు ఎప్పటిలాగే వ్యవహరిస్తుండడంతో దిగాలు చెందుతున్నాడు. ఇప్పటికే తడిసిన ధాన్యాన్ని ఆరబోస్తూ.. కుప్పలు చేస్తూ నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. అధికార యంత్రాంగం మాత్రం కొనుగోళ్లలో వేగం పెంచడం లేదు. మరికొద్ది రోజుల్లో మరో తుపాన్ ప్రమాదం పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరించినా పట్టనట్టు వ్యవహరిస్తున్నది. దీంతో ఆందోళనలు చేస్తున్నా.. వినతిపత్రాలు ఇస్తున్నా పెడచెవిన పెడుతున్నది. ఇప్పటికైనా వెంటనే కొనుగోళ్లు చేపట్టి రైతుల కష్టాలు తీర్చాలని, నష్టపోయిన పంటలకు వరికి ఎకరాకు రూ.25 వేలు, పత్తికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది.
కరీంనగర్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ) : మొంథా తుపాన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఒక్క రోజే ప్రభావం చూపినా కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఊహించని రీతిలో కురిసిన వర్షం, ఈదురుగాలుల కారణంగా ఇటు చేలల్లో ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన, అమ్మకానికి సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని సర్వనాశనం చేసింది. అనేక కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో రైతులు ఆరబెట్టిన ధాన్యం కుప్పులు కొట్టుకుపోయాయి. ఇలాంటి సమయంలోనూ రైతులను ప్రభుత్వం పట్టించుకోలేదు. కొట్టుకుపోగా తడిసి ముద్దయిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు.
తుపాన్‌కు ముందు కొనుగోలు చేసేందుకు తేమ శాతం 17 రావాలని అధికారులు వెల్లడించారు. ఎఫ్ఏక్యూ నిబంధనల మేరకు ఉన్న ధాన్యమైనా తుపాన్‌కు ముందు కొనుగోళ్లు జరిపితే ఇంతటి నష్టం వాటిల్లేది కాదని రైతులు వాపోతున్నారు. అనేక గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యం 17 శాతం తేమకు చేరింది. కానీ, కొనుగోళ్లు జరపడంలో మాత్రం అధికారులు తాత్సారం చేశారు. తీరా తుపాన్ రావడం, ధాన్యం తడిసి పోవడం రైతులకు నష్టాలు తెచ్చి పెట్టింది. తుపాన్ తర్వాతనైనా కొనుగోళ్లు ముమ్మరం చేశారా? అంటే అదీ లేదు.

కొనుగోళ్లు అంతంతే..
తేమ శాతంతో సంబంధం లేకుండా వెంటనే ప్రతి రైతుకు సంబంధించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రతిపక్ష పార్టీల నుంచి డిమాండ్ వస్తోంది. ముఖ్యంగా కొనుగోలు కేంద్రాలకు వెళ్లి తడిసిన ధాన్యాన్ని పరిశీలిస్తూ, క్షేత్ర స్థాయిలో పంట నష్టాన్ని పరిశీలిస్తున్న బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వం కంటి తుడుపు చర్యలు మాత్రమే చేపడుతోందని ఆరోపిస్తున్నారు. తుపాన్ చేసిన నష్టం అపారంగా ఉందని, ప్రభుత్వం మాత్రం ఎకరాకు రూ.10 వేల పరిహారం చెల్లిస్తామని చెబుతున్నదని, ఇది రైతులకు ఏ మాత్రం సరిపోదని వరికి ఎకరాకు రూ.25 వేలు, పత్తికి రూ.50 వేల పరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. అయితే, వరదలో ధాన్యం కొట్టుకుపోయి నష్ట పోయిన రైతుల పరిస్థితి ఏమిటనేది ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
పొంచి ఉన్న మరో తుపాన్ ముప్పు?
మొంథా కలిగించిన అపార నష్టం నుంచి అన్నదాతలు కోలుకోకముందే మరో తుపాన్ పొంచి ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. గత నెల 29న ఒక్కరోజే మొంథా ప్రళయాన్ని సృష్టించగా వచ్చే తుపాన్ ప్రభావం ఏమేరకు ఉంటుందోనని రైతుల్లో ఆందోళన మొదలైంది. ఒక పక్క రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోళ్లను నత్తనడకన సాగిస్తోంది. ఇప్పటికే అపార నష్టాన్ని చవిచూసిన రైతులకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం తేమ శాతం సాకుతో కొనుగోళ్లను నెమ్మదిగా చేస్తోంది. గత వానకాలం సీజన్లో ఇప్పటికే ముమ్మరంగా కొనుగోళ్లు జరిగాయి. ఇప్పుడు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఈ వారంలో మరో తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కొనుగోళ్లను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది.
సర్వే ముగియడానికి మరో వారం
మొంథా తుపాన్ కలిగించిన నష్టాన్ని అంచనా వేసేందుకు వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తున్నారు. క్రాప్ బుకింగ్ యాప్‌లోనే పంట నష్టం అంచనా అప్లోడ్ చేస్తున్నారు. రైతు, సర్వే నంబర్ వారీగా పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఈ సర్వే పూర్తి కావడానికి మరో వారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. కాగా, ప్రాథమికంగా వేసిన అంచనా ప్రకారం కరీంనగర్ జిల్లాలో 30,565 ఎకరాల్లో వరి, 3,512 ఎకరాల్లో పత్తి, 50 ఎకరాల్లో మక్క పంట కలిపి మొత్తం 34,127 ఎకరాల్లో నష్టం జరిగినట్లు నిర్ధారించారు.
కొన్నది ఐదు వేల మెట్రిక్ టన్నులే
కరీంనగర్ జిల్లాలో 1,68,025 దొడ్డు రకం, 1,33,855 మెట్రిక్ టన్నులు వెరచి 3,01,880 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరపాలని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేయగలిగారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సైదాపూర్, చిగురుమామిడి, హుజూరాబాద్, శంకరపట్నం, మానకొండూర్ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇప్పటి వరకు 785 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేశారు.