అమ్మా.. నేను పుట్టగానే సంతోషిస్తావని అనుకున్నా.. పేగు బంధం తెంచగానే ఎవరో నన్ను లాక్కెళ్తుంటే నువ్వెలా భరించావమ్మా.. నన్ను ఊపిరాడకుండా గుడ్డలో చుడుతుంటే ఎలా ఊరుకున్నావమ్మా.. నీ పొత్తిళ్లలో కేరింతలు కొట్టాల్సిన నన్ను ఎక్కడో కాలువలోకి విసిరి చావు కేకలు పెట్టేలా చేశావమ్మా.. నవమాసాలు మోసి ఎలా విధిల్చుకున్నావమ్మా.. నన్ను ఎందుకిలా చేశావమ్మా.. మహాభారతంలో కుంతి చేసిన తప్పు చేశావా..? ఆ కర్ణుడిని కని పారేసినట్టు ఇలా విసిరేశావా..? ఈ తప్పు ఎందుకు చేశావమ్మా..
తల్లి పొత్తిళ్లలో హాయిగా నిద్రించాల్సిన ఓ నవజాత శిశువు, పేగును తెంచిన 24 గంటల్లోనే కాకతీయ కాలువలోకి చేరాడు. ఎందుకు భారమయ్యాడో తెలియదు గానీ, సరిగ్గా కళ్లు కూడా తెరవని ఆ పసిమొగ్గను బట్టల సంచిలో ఊపిరాడకుండా.. శరీరమంతా గుడ్డలతో చుట్టేసి నీటిలో పడేసే ప్రయత్నం చేసినా.. సురక్షితంగా బతికి బయట పడ్డాడు. నీటిలో కొట్టుకుపోకుండా ఓ గడ్డి మొక్కకు తట్టుకుని మృత్యుంజయుడై నిలిచాడు. మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని చాటాడు.
హుజూరాబాద్ రూరల్, సెప్టెంబర్12 : గురువారం మధ్యాహ్నం 12 గంటలు.. అది హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి సమీపంలోని కాకతీయ దిగువ కాలువ.. అందులో మోకాలు లోతు నీళ్లున్నాయి. తుమ్మనపల్లికి చెందిన గుండేటి చొక్కారెడ్డి తన ట్రాక్టర్‌ను కడిగేందుకు అక్కడున్న ర్యాంపు ద్వారా నీళ్లలోకి దిగాడు. ట్రాక్టర్ ఆఫ్ చేయగానే అక్కడో పసికందు ఏడుపు వినిపించింది. చుట్టుపక్కల చూసినా.. పసిపిల్లల ఆనవాళ్లు కనిపించ లేదు. గుక్కపెట్టిన ఏడుపూ ఆగలేదు. మళ్లీ చుట్టూ గమనించగా.. అక్కడ కాలువ లైనింగ్ మధ్యలో చిన్న చెట్టు కొమ్మకు తట్టుకొని ఉన్న ఒక బట్టల సంచిపై అనుమానం వచ్చింది. దగ్గరకు వెళ్లగా ఆ సంచి నుంచే ఏడుపు వినిపిస్తున్నదని గ్రహించాడు. సంచిని పరిశీలించగా ఊపిరి ఆడకుండా.. కనీసం తల కూడా కనిపించకుండా గుడ్డలతో చుట్టి ఉన్నది. దానిని విప్పి చూసేసరికి నవజాత శిశువు కనిపించింది. వెంటనే చొక్కారెడ్డి స్థానిక మాజీ సర్పంచ్ గూడూరి ప్రతాప్‌రెడ్డికి, మాజీ ఎంపీటీసీ యాళ్ల రాజేశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి విషయం చెప్పాడు. మాజీ సర్పంచ్, ఎంపీటీసీ సమాచారం ఇవ్వడంతో హుజూరాబాద్ టౌన్ సీఐ తిరుమల్ గౌడ్ వెంటనే ఆ శిశువును హుజూరాబాద్ ఏరియా దవాఖానకు తరలించి ప్రాథమిక చికిత్స చేయించారు. ఈ మగ శిశువు 24 గంటల కిందనే జన్మించినట్టు వైద్యులు తెలిపారు. శిశువు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ సంరక్షణ కోసం కరీంనగర్‌లోని మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
కాకతీయ కాలువలో దొరికిన బాలుడు మృత్యుంజయుడని చెప్పుకోవచ్చు! ఎవరికి భారమయ్యాడో తెలియదు గానీ, ఈ నవజాత శిశువును ఒక ప్రణాళిక ప్రకారంగానే నీటిలో పడేయాలని చూసినట్టు ఇక్కడి పరిస్థితులను చూస్తే అర్థమవుతున్నది. కరీంనగర్, వరంగల్ ప్రధాన రహదారిపై ఉన్న కాకతీయ కాలువపై ఇక్కడ వంతెన ఉంటుంది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. శిశువు లభించిన సమయానికి 24 గంటల ముందే జన్మించినట్టు వైద్యులు చెబుతుండగా అంత తక్కువ సమయంలో రహదారిపై ప్రయాణిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కాలువలో పడేసినట్లు తెలుస్తున్నది. శిశువుకు ఊపిరి ఆడకుండా, తలను కూడా వదలకుండా గుడ్డల్లో గట్టిగా చుట్టి ఉండడాన్ని చూస్తే ప్రత్యక్షంగా చంపేందుకు ధైర్యం రాకనే నీటిలో పడేయాలని చూసినట్టు స్పష్టమవుతున్నది. వంతెన మీదుగా ఏదో ఒక వాహనంలో వెళ్తూనే కాలువలో ఉన్న నీటిలో విసిరేసే ప్రయత్నంలో కాస్త ఒడ్డుకు ఒక కాచగడ్డి కొమ్మకు శిశువు ఉన్న బట్టల సంచి చిక్కుకున్నది. చొక్కారెడ్డి అనే రైతు అక్కడికి రావడం, శిశువు ఏడుపు విని రక్షించడం వెంట వెంటనే జరిగిపోయాయి. చొక్కారెడ్డి చూడడానికి కొద్ది సేపటి క్రితమే ఈ శిశువును ఎవరో నీటిలో పడేసే ప్రయత్నం చేసినట్టు తెలుస్తున్నది. చుట్టిన గుడ్డల పరిస్థితిని గమనిస్తే ఆలస్యమైతే గుడ్డల్లోనే శిశువు ప్రాణాలు పోయేవి. మొత్తానికి రైతు చొక్కారెడ్డితోపాటు స్థానికులు, పోలీసులు వెంట వెంటనే స్పందించడంతో ఈ నవజాత శిశువు మృత్యుంజయుడై నిలిచాడు. మహాభారతంలో కర్ణుడి ఉదంతాన్ని గుర్తు చేసిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.