హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 6 : సిర్సపల్లి శివారులో ప్రతిపాదించిన డంప్ యార్డు కరోనా కంటే చాలా ప్రమాదకరమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డంప్ యార్డు నిర్మాణాన్ని ప్రతి ఒక్కరూ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సోమవారం హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లి, వెంకట్రావుపల్లి, సిర్సపల్లి, పోతిరెడ్డిపేట, చెల్పూర్, శాలపల్లి-ఇందిరానగర్తోపాటు పలు గ్రామాల్లో అఖిల పక్ష సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల డంప్ యార్డు ఏర్పాటుతో జరిగే నష్టాలను వివరించారు.
కరీంనగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల చెత్తను ఇకడికి తరలించడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చెప్పారు. భూగర్భ జలాలు కలుషితమవుతాయని, భూములు దెబ్బతింటాయని, లక్షలాది మంది ప్రజల జీవితాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డంప్ యార్డ్‌ను పూర్తిస్థాయిలో ఎత్తివేసే వరకూ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. అవసరమైతే మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఎత్తివేయాలనే డిమాండ్‌తో ఈ నెల 7, 8 తేదీ ల్లో తానే దీక్షలో కూర్చుంటానని ప్రకటించారు. అందుకోసం మండలంలోని అన్ని గ్రామాలకు వెళ్లి పార్టీలకు అతీతంగా అందరినీ ఆహ్వానిస్తానని చెప్పారు. ప్రతి గ్రామం నుంచి వందలాది మంది తరలిరావాలని పిలుపునిచ్చారు.
అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఒకే వేదికపై కూర్చుంటే ప్రభుత్వానికి ఇకడి ప్రజల సమస్యలు స్పష్టంగా తెలుస్తాయని చెప్పారు. ఈ నెల 9న అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులకు సూచించారు. అందులో అన్ని పార్టీల నాయకులతోపాటు కరీంనగర్ ఎంపీ, మలాజ్‌గిరి ఎంపీ, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనాలని కోరారు. చివరగా హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష సోమవారం 15వ రోజు చేరుకోగా, ఎమ్మెల్యే సంఘీబావం తెలిపారు. డంప్‌యార్డును అధికారికంగా రద్దు చేసే వరకూ దీక్షను కొనసాగించాలని సూచించారు. అయన వెంట బీఅర్ఎస్ నాయకులు కొండాల్‌రెడ్డి, బండ శ్రీనివాస్, సురేందర్‌రెడ్డి, రామారావుతో పాటుతదితరులు ఉన్నారు.