కార్పొరేషన్, జూన్ 8: కరీంనగర్ నగరపాలక సంస్థలో చేపట్టిన డివిజన్ల పునర్విభజన గందరగోళంగా మారింది. ముసాయిదాలో కొన్ని డివిజన్లల్లో ఓట్లు ఎక్కువగా, మరికొన్ని డివిజన్లల్లో తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు ఇచ్చిన మ్యాపింగ్ సరిహద్దులకు, రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఇంటి నంబర్ల సరిహద్దులకు ఎక్కడా పొంతన లేకపోవడం పెద్ద సమస్యగా మారిపోయింది. ఏ డివిజన్ పరిధి ఎక్కడి వరకు ఉంటుందో..? తెలియని పరిస్థితి నెలకొన్నది. అయితే ఇరు విభాగాల మధ్య సమన్వయం లేకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తున్నది. అనేక డివిజన్లల్లో ఇంటి నంబర్ల కేటాయింపు గజిబిజీగా ఉండడంతో సరిహద్దులు నిర్ణయించడంలో తీవ్ర సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం డివిజన్ల పునర్విభజనను రెవెన్యూ డివిజన్ల ఆధారంగా చేసుకొని ముసాయిదాను తయారు చేశారు. అయితే కొన్ని రెవెన్యూ డివిజన్ల ఇంటి నంబర్ సీరిస్‌ల పక్కనే మరో ఇంటి నంబర్ సిరీస్‌లు రావడం, ఒకే ఇంటి నంబర్‌పై అనేక బై నంబర్స్‌తో ఇండ్లు ఉండడంతో ఆయాచోట్ల ఓటర్ల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. దీనిపై అన్ని పార్టీల నేతల నుంచి తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వస్తుండగా, నగరపాలక అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. అయితే ఇంటి నంబర్ల తీరు అధికారులకు సరికొత్త సవాళ్లను తీసుకువస్తున్నట్లు సమాచారం.
పలు డివిజన్లల్లో ఒకే ఇంటి నంబర్‌పై పది, పదిహేను ఇళ్ల బై నంబర్స్ ఉండడం వాటిల్లో పెద్ద సంఖ్యలోనే ఓటర్లు ఉండడంతో ఎలా సర్ధుబాటు చేయాలన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో తుది జాబితా నాటికి భారీగా మార్పులు చేర్పులు కనిపించే అవకాశాలున్నాయి.