కొత్తపల్లి/కోల్‌సిటీ, మే 24 : గ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు హోరాహోరీగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు బుధవారం సాయంత్రం ముగియగా విజేతలకు ప్రజాప్రతినిధులు బహుమతుల ప్రదానం చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి సీఎం కప్-2023 క్రీడా పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేసి మాట్లాడారు. క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, ఈ క్రమంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, డీవైఎస్ఓ కీర్తి రాజవీరు, తదితరులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని జవహర్‌నగర్‌లో గల జేఎల్ఎన్ స్టేడియంలో జరుగుతున్న క్రీడల ముగింపు కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లా జడ్పీ చైర్మన్ పుట్ట మధు జిల్లా కలెక్టర్ డా.సంగీత సత్యనారాయణ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో కూడా ఇదే స్ఫూర్తితో ఆడి జిల్లాకు పేరు తేవాలని ఆకాంక్షించారు.