కరీంనగర్, మే 14 (నమస్తే తెలంగాణ) : జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2025-26 కింద రూ. 13,378.17 కోట్లతో ఖరారు చేశారు. బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులతో కలెక్టర్ పమేలా సత్పతి డీసీసీ, డీఎల్ఆర్సీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేశారు. అలాగే గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రైతులకు రుణాల పంపిణీ, స్వయం సహాయక సంఘాల రుణాలు, రికవరీ, పీఎం జీపీవై రుణాలు, ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల పథకాలకు సంబంధించి రుణ లక్ష్య పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలో వివిధ ఆర్థిక మద్దతు పథకాల లక్ష్యసాధనకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 2024 నుంచి మార్చి 2025 వరకు రూ. 11,627.04 కోట్ల రుణాలను మంజూరు చేసినట్లు తెలిపారు. వివిధ పథకాల్లో మంజూరైన రుణాల రికవరీపై శ్రద్ధ వహించాలని కోరారు. యువతకు ఉపాధి కల్పించే విషయంలో చొరవ చూపాలని బ్యాంకర్లకు సూచించారు. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరం వార్షిక రుణ ప్రణాళికను రూ.13,378.17 కోట్లతో కలెక్టర్ ఆవిషరించారు.
వ్యవసాయ అవసరాల కోసం రూ.5,157.33 కోట్లు ఎంఎస్ఎంఈ కింద రూ.3,239.40 కోట్లు, విద్యా రుణాలు రూ.49.50 కోట్లు, గృహ రుణాలు రూ.310.50 కోట్లు, ఎగుమతి రంగాలకు రూ.6.40 కోట్లు, సామాజిక మౌలిక సదుపాయాలు రూ.20.32 కోట్లు, పునరుత్పాదక ఇంధనం రూ.50.97 కోట్లు, ఇతర ప్రాధాన్యతా రంగానికి రూ.255 కోట్లు, ఎస్‌హెచ్‌జీ రుణాలకు రూ. 875 కోట్లు, ఇతర రంగాలకు రూ.3,413.75 కోట్ల రుణాలుగా బ్యాంకర్లు అందజేయాలని కోరారు. అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ మాట్లాడుతూ, రాజీవ్ యువ వికాసం కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హత గల లబ్ధిదారుల వివరాలను మూడు రోజుల్లోగా సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ అధికారి సాయితేజరెడ్డి, నాబార్డ్ జీజీఎం ఎస్ జై ప్రకాశ్, ఎస్బీఐ ఏజీఎం వెంకటేశ్, చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, టీజీబీ ఆర్ఎం బాలనాగు, కేడీసీసీబీ డీజీఎంతోపాటు అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, కో ఆర్డినేటర్లు, కరీంనగర్ లోకల్ బ్రాంచ్ మేనేజర్స్, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, డీడబ్ల్యూవో సరస్వతి, ఉద్యానవన శాఖ డీడీ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఏ సునీత తదితరులు పాల్గొన్నారు.