వేములవాడ, ఆగస్టు 25: రాజన్న ఆలయంలో అవినీతి డొంకలు కదులుతున్నాయి. విజిలెన్స్ ఆరోపణల నేపథ్యంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగిని సస్పెండ్ చేసి, మరో ఉద్యోగిని సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే జూనియర్ అసిస్టెంట్ వేతనంలో కోతకు ఆదేశాలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. 2021అక్టోబర్‌లో జరిగిన విజిలెన్స్ తనిఖీల్లో అవినీతి బాగోతం బయటపడింది. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురు ఏఈవోలు, నలుగురు పర్యవేక్షకులు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లతోపాటు ఇద్దరు అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో కలిపి 12మందిపై చర్యలకు ఉపక్రమించారు.
ముగ్గురు ఏఈవోలకు ఇప్పటికే ఇంక్రిమెంట్లు నిలిపివేశారు. అలాగే లడ్డూ ప్రసాదాల విభాగం పర్యవేక్షకుడికి రూ.లక్షా88వేలు, అదే విభాగంలో పని చేసిన జూనియర్ అసిస్టెంట్‌కు రూ.80వేలు, గోదాములో సరుకుల వ్యత్యాసానికి సంబంధిత పర్యవేక్షకుడు రూ.21వేలు చెల్లించాలని గత ఏప్రిల్‌లో అప్పటి ఈవో కృష్ణప్రసాద్ ఆదేశించారు. అయితే లడ్డూ ప్రసాదాల విభాగం, గోదాం పర్యవేక్షకులు సదరు నగదు స్వామివారి ఖజానాకు చెల్లించగా, జూనియర్ అసిస్టెంట్ మాత్రం చెల్లించలేదు.
గత జూలైలో ఈవో వినోద్‌రెడ్డి సైతం నగదు చెల్లించాలని జూనియర్ అసిస్టెంట్‌ను ఆదేశించారు. ఇటీవల బదిలీల్లో భాగంగా సదరు ఉద్యోగి యాదగిరిగుట్టకు బదిలీ అయ్యారు. తక్షణమే నగదు చెల్లించకుంటే యాదగిరిగుట్ట పరిపాలన కార్యాలయం ద్వారా వేతనాన్ని రాజన్న ఆలయ ఖజానాకు చెల్లించేలా ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సదరు ఉద్యోగి రెండు, మూడు రోజుల్లో నగదు చెల్లిస్తానని అధికారులను వేడుకున్నట్లు తెలిసింది.
విజిలెన్స్ ఆరోపణ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న మధును సస్పెండ్ చేసి, తాతాలిక ఒప్పంద ఉద్యోగి శ్రీనివాస్‌ను సంబంధిత ఏజెన్సీకి సరెండర్ చేస్తూ ఈవో వినోద్‌రెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విజిలెన్స్ ఆరోపణలు ఉన్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని పట్టణానికి చెందిన ఒకరు ఇటీవల లోకాయుక్తను ఆశ్రయించిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగులపై వేటుపడినట్టు తెలిసింది.
రాజన్న ఆలయంలో ఏసీబీ తనిఖీలతో శాఖాపరమైన దిద్దుబాటు చర్యలకు అధికారులు ఉపక్రమించారు. ఈ క్రమంలో శాఖలవారీగా వివరాలపై ఆరా తీశారు. తనిఖీల్లో బయటపడిన అక్రమాలను ఏసీబీ అధికారులు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ప్రకటించడంతో, ఆలయ అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ప్రధానంగా నెయ్యి, జీడీ పప్పు, నూనె వంటి నిల్వల్లో వ్యత్యాసాలు, కల్యాణ కట్టలో భక్తుల నుంచి అక్రమ వసూళ్ల వ్యవహారం, టెండర్లలో వ్యత్యాసాలపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది.