Vodithala Satish Kumar | చిగురుమామిడి, సెప్టెంబర్ 14: బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మృతి పార్టీకి తీరని లోటని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలంలోని శనిగరంలో శ్రీహరి మృతదేహం వద్ద పుష్పగుచ్ఛంతో ఆదివారం నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పనిచేశాడని, రాజకీయ అనుభవం ఉన్న గొప్ప నాయకుడన్నారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అంచలంచలుగా రాజకీయంగా ఎదిగి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడని కొనియాడారు. వీరి మృతి పార్టీకి తీరనిలోటని అన్నారు.బిఆర్ఎస్ వారి కుటుంబానికి అండగా ఉంటుందని అన్నారు.
శ్రీహరి మృతి తీరని లోటు.. : ఎల్ రమణ, ఎమ్మెల్సీ
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కర్ర శ్రీహరి మృతి పార్టీకి తీరని లోటని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ వ్యక్తిగతంగా తనతో చాలా సంవత్సరాలుగా సంబంధాలు ఉన్నాయన్నారు. పార్టీలో చురుగ్గా పాల్గొని వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించేవాడని అన్నారు. గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు అంచరించలుగా ఎదిగి ప్రజల సమస్యలపై పట్టు సాధించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. వీరు మృతి చెందడం వ్యక్తిగతంగా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి సానుభూతిని వ్యక్తం చేశారు.