ధర్మారం/పెగడపల్లి, జూలై11: స్వరాష్ట్రంలో గిరిపుత్రులకు తెలంగాణ సర్కారు అండగా నిలుస్తున్నదని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగ, సీనియర్ సిటిజన్స్ సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం ధర్మారం మండలం లంబాడీతండా (కే), కొత్తూరు, కొత్తపల్లి తండాలతోపాటు పెగడపల్లి మండలం రాజరాంపల్లి, ఏడుమోటలపల్లి గిరిజన తండాల్లో నిర్వహించిన అట్టహాసంగా నిర్వహించిన శీత్లాభవానీ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఆయాచోట్ల కొప్పులకు లంబాడీలు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారికి మంత్రి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
అనంతరం మాట్లాడుతూ ఉమ్మడి పాలనలో గిరిజన గూడెలు సమస్యలతో సతమమతమయ్యేవన్నారు. కానీ సీఎం కేసీఆర్ వారి అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. తండాలను పంచాయతీలుగా చేసి గిరిపుత్రుల అభివృద్ధికి బాటలు వేశారని పేర్కొన్నారు. అనేక మందికి సర్పంచులుగా ఎన్నికయ్యే అవకాశం దక్కిందన్నారు. తండాల్లో ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు.
గిరిజన పిల్లలకు మెరుగైన విద్యనందించేందుకు 92 గురుకులాలను ఏర్పాటుచేశామని చెప్పారు. విదేశాల్లో చదువుకొనే విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సీస్ కింద రూ. 20 లక్షలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. గిరిపల్లెల అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ సర్కారుకు అండగా నిలువాలని కోరారు. లంబాడీతండా (కే) డ్రైనేజీని నిర్మిస్తామని హామీ ఇచ్చారు.