T Jeevan Reddy | రాయికల్, సెప్టెంబర్, 18 : రాష్ట్రంలో కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చిన ఘనత కేసిఆర్ కే దక్కుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీజీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాయికల్ పట్టణంలో సర్వాయి పాపన్న విగ్రహాన్ని జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ గౌడ కుటుంబంలో పుట్టి ఒక ఉద్యమ నాయకుడిగా ఎదిగిన గొప్ప వ్యక్తి సర్వాయి పాపన్న అని కొనియాడారు. నాడు గోల్కొండ ఖిల్లాపై సర్వాయి పాపన్నజెండా ఎగరవేసిన స్ఫూర్తితో కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చేసి ప్రత్యేక రాష్ట్ర సాధన చేశారని గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాతనే గోల్కొండ ఖిల్లాపై కేసీఆర్ జెండా ఎగరవేశారన్నారు. విద్యా ఉద్యోగాలతో పాటు కులవృత్తులు కూడా ప్రదానం అన్నారు. గీత కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని వృత్తుల కన్న ప్రమాదకరమైన వృత్తి గీత వృత్తి అని అన్నారు.
కేసీఆర్ వైన్ షాపుల్లో గౌడ కులస్తులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చారన్నారు. కానీ ఈ ప్రభుత్వం బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తుందన్నారు. కల్తీ మద్యం వల్ల ప్రజల ఆరోగ్యం పాడైపోతుందన్నారు. ఆబ్కారీ శాఖ ఆదాయం గతంలో రూ.18 వేల కోట్లు ఉంటే ఇప్పుడు రూ.35 వేల కోట్లకు పెరిగిందన్నారు. స్థానిక నాయకుడు వేముల పేరుమాలు గౌడ్ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకొని ఇక్కడ భూస్వామ్యంలో పెత్తందారులతో కొట్లాడి ఎన్నికల్లో కూడా పోటీ చేశాడన్నారు. ప్రభుత్వం అనేది గీతా కార్మికులకు 5 ఎకరాల భూమి కొనియ్యాలన్నారు. కేసీఆర్ బీడీల పింఛన్లు ఇచ్చారన్నారు. రాయికల్ మండలంలో అత్యధికంగా బీడీలు చుట్టే వారు ఉంటారు వారి కొత్త పింఛన్లు ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామరక్ష అని అన్నారు. కేసీఆర్ హయాంలోనే బహుజనులు కులవృత్తుల్లో ఉద్యోగాల విషయంలో ఆత్మ బంధువులాగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలయిన ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారన్నారు. తెలంగాణ ప్రజలకు న్యాయం కావాలంటే కేసీఆర్ నాయకత్వంలో మాత్రమే సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ సౌజన్య శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్లు మహేశ్వరి నాగరాజు, లతిక అనిల్, రాకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.