Odela | ఓదెల, సెప్టెంబర్ 1 : హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని ఓదెల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమలు చేయలేని హామీలను ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చి విస్మరించారని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు జరగలేదన్నారు. రైతులు యూరియా కోసం అష్ట కష్టాలు పడుతున్నారని తెలిపారు. అలాగే మహిళా పింఛన్లను ఎత్తేసారని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి చెల్లించడం లేదని, రైతు బీమా అమలు జరగడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలించే అర్హత కోల్పోయిందని వెంటనే గద్దె దిగి పోవాలని డిమాండ్ చేశారు. వచ్చేది కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే రాష్ట్రంలో పేద ప్రజల సంక్షేమంతో పాటు అభివృద్ధి జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యూత్ మండలాధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ రైతు జలపతి, మాజీ సర్పంచులు గోవిందుల ఎల్ల స్వామి, గుండేటి మధు యాదవ్, నాయకులు బోడగుంట నరేష్, పోలోజు రమేష్, చింతం మొగిలి, రాచర్ల కుమార్, మద్దెల శ్రీనివాస్, సదానందం, సర్వర్, కుమార్, రాజు, పరుశరాములు తదితరులు పాల్గొన్నారు.