AP News : బంగాఖాతంలో వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ప్రధాన నదులైన వంశధార, నాగావళిలలో వరద ఉద్ధృతి అంతకంతకే పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రధాన బ్యారేజీల వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రవిపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వంశధార నదిపై ఉన్న గొట్టా బ్యారేజ్ వద్ద అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. ప్రస్తుతం గొట్టా బ్యారేజ్‌లోకి 41,014 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే మొత్తంలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు నాగావళి నదిలోనూ వరద ప్రవాహం కొనసాగుతున్నది. తోటపల్లి బ్యారేజ్ వద్ద ఇన్-ఫ్లో, అవుట్-ఫ్లో 45,661 క్యూసెక్కులుగా నమోదవుతున్నది. నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట వద్ద ప్రవాహం 59,700 క్యూసెక్కులకు చేరడంతో అధికారులు అక్కడ కూడా మొదటి ప్రమాద హెచ్చరికలు జారీచేశారు.
ఈ వరద పరిస్థితులపై రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ స్పందించారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. వరద తీవ్రత దృష్ట్యా నదుల్లోకి ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటి పనులు అత్యంత ప్రమాదకరమని, అటువంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన స్పష్టంచేశారు.