Vemulawada | వేములవాడ రూరల్, జులై 12 : అవగాహన లోపంతోనే రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని, రైతులకు సాగునీరు అందించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీ నరసింహారావు మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం హనుమాజీపేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగానికి సాగునీరు అందించడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి తన హోదాను మర్చిపోయి అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతులకు సాగునీరు ఎప్పుడు అందిస్తారని ఓ విలేఖరి నిన్నటి ప్రెస్ మీట్లో ప్రశ్నిస్తే.. దానికి సమాధానం చెప్పలేక, కేటీఆర్, హరీష్ రావుల రక్తంతో పంటలను తడుపుతానని సీఎం మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీరివ్వాలని అడిగితే తమని కోసి, తమ రక్తాన్ని పంటలపై చల్లుతానని అనడం ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన భాషేనా అని చల్మెడ లక్ష్మీ నరసింహారావు నిలదీశారు. ఇకనైనా రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకొని, తక్షణమే సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.