National Turmeric Board | మల్లాపూర్, జూలై 20: గత ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి అన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని ముత్యంపేటలో మూతపడిన చక్కెర కర్మాగారం పునరుద్దరించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ కనక సోమేశ్వరకొండ వద్ద నుండి చక్కెర కర్మాగారం వరకు తలపెట్టిన పాదయాత్రను ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా ఎంపీ అర్వింద్ ఈ ప్రాంత రైతులకు ఇచ్చిన హామీ మేరకు పసుపు పంటకు ప్రత్యేక బొర్డును తీసుకువచ్చి, ఇక్కడే రైతుల సౌకర్యార్థం కార్యాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు. గత ఎంపీ ఎన్నికల్లో మరోసారి రైతులకు ఇచ్చిన హామీలను తప్పకుండా తీర్చుతామాని స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ దేవుళ్లపై ఓట్లు వేశారని గుర్తు చేశారు. అలాగే ఇప్పటికే ప్రభుత్వం రైతులకు రుణమాఫీ, రైతుబంధు, వరిపంటకు బోనస్ అంశాలపై పూర్తిగా విఫలమైందని, బీజేపీ అధికారంలోకి వస్తే వంద శాతం మూతపడిన నిజాం చక్కెర కర్మాగారంలను తెరిపిస్తామని స్పష్టం చేశారు.
పాదయాత్ర చేపట్టిన శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చక్కెర కర్మాగారం పునరుద్ధరణ కోసం కమిటీలు వేసి కాలయాపన చేస్తుందని విమర్శించారు. రైతుల సమస్యల పట్ల పాదయాత్ర చేస్తున్న ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, బీజేపీ నేతలు డాక్టర్ రఘు, మోరపల్లి సత్యనారాయణ రావు, వడ్డేపల్లి శ్రీనివాసన్, బద్దం గంగాధర్, పందిరి నాగరాజు, ఎర్ర లక్ష్మి, లవంగ శివ, రైతు సంఘం నాయకులు మామిడి నారాయణరెడ్డి, పన్నాల తిరుపతిరెడ్డి, న్యావనంది లింభారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.