Godavarikhani | కోల్ సిటీ. అక్టోబర్ 18 : అభివృద్ధి పనులతో నగరానికి కొత్త రూపు సంతరించుకుంటుందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. నగరంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణ శ్రీతో కలిసి శనివారం శంకుస్థాపనలు చేశారు. జనగామలో ట్రాన్స్ ఫర్ డ్యూటీ నిధులు రూ.197.5 లక్షలతో చేపట్టనున్న యూజీడీ పనులకు, ఇందిరానగర్ లో రూ.193.75 లక్షలతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు, భవాని నగర్, విజయ నగర్ లో మరో రూ.181.75 లక్షలతో చేపట్టనున్న యూజీడీ పనులకు శనివారం ఆయన శిలాఫలకాలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి నిర్లక్ష్యంతో అభివృద్ధి లో ఈ ప్రాంతం వెనుకపడిందన్నారు. చారిత్రక జనగామ త్రిలింగ రాజరాజేవ్వర స్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుందని, గతంలో ఉన్నవిధంగా పునర్నిర్మించి తీరతానన్నారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో రూ.10 కోట్లు ఆలయ అభివృద్ధికి మంజూరు చేసినా కూడా పురావస్తు శాఖ ద్వారా పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు.
గుళ్ల జనగామగా ఖ్యాతి ఉన్న జనగామకు పూర్వవైభవం తీసుకువస్తానని హామీ ఇచ్చారు. ఇందిరానగర్ లో సకల వసతులతో అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. మాతంగి కాలనీ, ఖాజిపల్లి ప్రాంతాలకు కొత్త వెలుగులు తీసుకవచ్చామన్నారు. మరో వారంలో నగరంలో పాదయాత్ర చేస్తానన్నారు. అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్లు రాజీ పడకుండా నాణ్యతతో పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్ఈ గురువీర, ఈఈలు రామన్, శివానంద్, మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.