Jagityal | జగిత్యాల, ఆగస్టు 10 : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతీ ఒక్కరూ ఎండ గట్టాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఎం జిల్లా ఇంచార్జి లెల్లల బాలకృష్ణ పిలుపునిచ్చారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు అండగా ఉంటూ కార్మిక, రైతు, ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు. క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్ స్టాండ్ చౌరస్తాలో జైల్ భరో నిరసన కార్యక్రమాన్ని సీఐటీయూ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. నాయకుల ధర్నాను పోలీసులు అడ్డుకుని అరెస్టులు చేసి ఆందోళన విరమింపజేశారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా ఇంచార్జి బాలకృష్ణ, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి చింత భూమేశ్వర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు ఇందూరి సులోచన మాట్లాడారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం, ఐకేపీ వీవోఏ, ఫీల్డ్ అసిస్టెంట్, ఆరోగ్య శాఖలో వివిధ స్కీంలో కోటి మంది వర్కర్లు పని చేస్తున్నా నేటికి ఉద్యోగ భద్రత, కనీస వేతనానికి నోచుకోలేదన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ కేంద్రం తీసుకవచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అమలు చేయక పోవడంతో ఏటా రూ.4 లక్షల కోట్లు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆహార భద్రతా చట్టానికి కేంద్ర తూట్లు పొడిచి అంత్యోదయ పథకం ద్వారా నిరుపేదలకు 35 కిలోల బియ్యాన్ని రద్దు చేసి ఒక్కో మనిషికి 7 కేజీల బియ్యాన్ని మాత్రమే ఇస్తుందని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దీన్ని నిలువరించేందుకు ప్రజలు ఆందోళనలకు సిద్ధంగా ఉండలన్నారు.
ఇప్పటికైనా కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోమటి శేఖర్, సీపీఎం జిల్లా నాయకుడు భూతం సారంగ పాణి, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నాయిని శారద, నాయకులు జంగిలి ఎల్లయ్య, మాల్యాల సురేష్, వెల్మలపల్లి వేంకట చారి తదితరులు పాల్గొన్నారు.