ఓటువిడుపు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు.
- అసెంబ్లీ పోలింగ్ తర్వాత సేదతీరిన అభ్యర్థులు
- తొలిరోజు కుటుంబ సభ్యులతో కబుర్లు
- పోలింగ్ సరళిపై కార్యకర్తలతో చర్చలు
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలిన అభ్యర్థులు, గురువారం పోలింగ్ ముగియడంతో శుక్రవారం ఇలా కనిపించారు. ఇంట్లో కుటుంబసభ్యులతో కలిసి సరదాగా గడిపారు. తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. పోలింగ్ జరిగిన తీరుపై చర్చిస్తూ.. గెలుపోటములపై బేరీజు వేస్తూ గడిపారు.
– కరీంనగర్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ)
ఇంటి భోజనం..టీవీ చూస్తూ కాలక్షేపం
నిన్నటివరకు తీరికలేకుండా ఓట్ల వేటలో నిమగ్నమైన ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం కరీంనగర్‌లోని తన నివాసంలో కుటుంబసభ్యులతో సరదగా కాలక్షేపం చేశారు. మూడు నెలల తర్వాత సతీమణి స్నేహలత వండిన చికెన్ ఫ్రై, చపాతి, పప్పు, రైస్‌తో భోజనం చేశారు. టీవీ చూస్తూ, హైదరాబాద్‌లో ఉంటున్న తన మనుమడు భవాని నిశ్చల్‌తో కాసేపు ఫోన్లో మాట్లాడారు.
– ధర్మపురి,డిసెంబర్ 1
ఓటింగ్ సరళిపై ఆరాతీస్తూ
హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి శుక్రవారం ఉదయం సతీమణి శాలినితో కలిసి భోజనం చేశారు. తర్వాత నియోజకవర్గ నలుమూలల నుంచి తరలివచ్చిన మద్దతుదారులతో మాట్లాడారు. పోలింగ్ సరళిని తెలుసుకొని విజయం ఖాయమని విశ్వాసం ప్రకటించారు. తనకు ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
– హుజూరాబాద్‌టౌన్, డిసెంబర్ 1

అసెంబ్లీ ఎన్నికలకు తెరలేచిన మరుసటి రోజు నుంచే అన్ని పార్టీల అభ్యర్థులు కదనరంగంలోకి దిగారు. బీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం మూడు నెలలుగా ప్రజాక్షేత్రంలో గడిపారు. నియోజకవర్గాల్లో ఊరూరా తిరిగి, ఇంటింటికీ వెళ్లారు. ప్రతి రోజూ ఉదయం నుంచి రాత్రి దాకా ప్రచారంలో మునిగితేలారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు విశ్రాంతి లేకుండా చెమటోడ్చారు. సకలజనులను కలుస్తూ, మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. గురువారం పోలింగ్ ముగియడంతో తెల్లారి శుక్రవారం అభ్యర్థులు ఇలా కనిపించారు. కుటుంబసభ్యులతో కలిసి భోజనం చేస్తూ, కబుర్లు చెబుతూ, టీవీ చూస్తూ, వార్తా పత్రికలు చదువుతూ, చెట్లకు నీళ్లు పడుతూ కొందరు గడపగా, మరికొందరు తమను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలతో ముచ్చటించారు. పోలింగ్ జరిగిన తీరుపై చర్చిస్తూ.. గెలుపోటములను బేరీజు వేస్తూ గడిపారు. గెలుపు తమదేనన్న ధీమా వ్యక్తం చేశారు.
శ్రేణులతో ముచ్చటించి.. ధీమా కల్పిస్తూ
జగిత్యాల బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్‌కుమార్ శుక్రవారం పార్టీ శ్రేణులతో ముచ్చటిస్తూ.. గెలుపుపై ధీమా కల్పిస్తూ సరదాగా గడిపారు. ఉదయం గడిచిన పోలింగ్ సరళి, గ్రామ గ్రామాన ఎలా ఉందో తెలుసుకుంటూ కార్యకర్తలు, నాయకులకు గెలుపుపై నమ్మకం కల్పించారు. నియోజకవర్గంలోని జగిత్యాల అర్బన్, రూరల్, సారంగాపూర్, బీర్పూర్, రాయికల్ మండలాల నుంచి వచ్చిన నాయకులతో ఉల్లాసంగా ముచ్చటించి, నెల రోజుల నుంచి తన వెన్నంటి ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
– జగిత్యాల, డిసెంబర్ 1

కార్యకర్తలతో కాసేపు..
వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు శుక్రవారం పట్టణంలోని తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో కాసేపు ముచ్చటించారు. ఓటింగ్ సరళిపై ఆరా తీస్తూ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు.
– వేములవాడ, డిసెంబర్ 1

కుటుంబంతో ‘సుంకె’ కాలక్షేపం
చొప్పదండి బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శక్రవారం తన కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తూ గడిపారు. తన నివాసానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులతో ఎన్నికలపై విశ్లేషణ చేశారు. కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడుకోడానికి అవకాశం దొరికిందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో గులాబీ జెండా మరోసారి ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
– గంగాధర, డిసెంబర్ 1
ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ..
పోలింగ్ అయిన మరు క్షణం నుంచి చాలా మంది అభ్యర్థులు కాలక్షేపం కోసం కుటుంబసభ్యులతో గడపడమో లేదా విశ్రాంతి తీసుకోవడమో చేస్తుంటారు. కానీ, కోరుట్ల బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల మాత్రం వైద్యసహాయం కోసం వస్తున్న ఎందరో రోగులకు వైద్యసేవలు, సలహాలు అందిస్తూ తన దినచర్యను కొనసాగిస్తున్నారు. పోలింగ్ జరిగిన మరుసటి రోజు నుంచే అలుపూ సొలుపు లేకుండా ఎంతో ఓపికగా యధావిధిగా వైద్యసహాయం చేయడంలో నిమగ్నమడం చూసి కార్యకర్తలు ఒకింత ముగ్ధులైపోతున్నారు. అంతే కాకుండా తన దగ్గరకు వచ్చే నాయకులు, కార్యకర్తలతో పోలింగ్ శాతంపై సమీక్షలు చేస్తూ.. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పనిచేసిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.
– మెట్పల్లి, డిసెంబర్1
పోలింగ్ సరళిపై ఆరా తీస్తూ..
మంథని బీఆర్ఎస్ అభ్యర్థి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ మంథనిలోని రాజగృహలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజతో కలిసి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన కార్యకర్తలతో ప్రత్యేకంగా ముచ్చటించారు. పోలింగ్ సరళిపై ఆరా తీశారు. బీఆర్ఎస్ గెలుపు ఖాయమైనట్టేనని ధీమా వ్యక్తం చేశారు.
– మంథని, డిసెంబర్ 1
సమీక్షిస్తూ.. సరదాగా గడుపుతూ..
మానకొండూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ బెజ్జంకి మండలం గుండారం గ్రామంలోని తన ఫాంహౌస్‌లో నియోజకవర్గ నాయకులతో కలిసి ఎన్నికలపై సమీక్షిస్తూ.. పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గడిపారు. పలు మండలాల నాయకులతో కలిసి గ్రామాల వారీగా ఓటింగ్ శాతాన్ని తెలుసుకున్నారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ విజయం కోసం శక్తి వంచన లేకుండా అహర్నిశలు కృషి చేసిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.
– తిమ్మాపూర్, డిసెంబర్1
వివాహ వేడుకకు ‘వొడితల’
హుస్నాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ శుక్రవారం వివాహ వేడుకల్లో గడిపారు. రంగారెడ్డి జిల్లా షామీర్పేట మండలం కీసర రోడ్డులోని ఓ కన్వెన్షన్‌లో జరిగిన సిద్దిపేట జడ్పీ వైస్‌చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి కూతురు డాక్టర్ ప్రణీతరెడ్డి వివాహానికి ఎమ్మెల్యే తన సతీమణి డాక్టర్ షమితతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
– హుస్నాబాద్, డిసెంబర్ 1
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

