మొన్నటి వరకు నిండుగా నీళ్లతో జలకళను సంతరించుకొని ఊళ్లకు ప్రాణాలు ఊది, పంటలకు జీవం పోసిన చెరువులు.. మళ్లీ తన జలకళను కోల్పోయాయి. ఏడాదిన్నర కిందటి వరకు ఊరంతటికీ ఆదరువుగా.. బతుకుదెరువుగా నిలిచినా.. ప్రస్తుతం పాలకుల ప్రణాళికాలోపంతో వట్టిపోతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏడాదిలో రెండు మూడు సార్లు చెరువులను నింపినా.. ఇప్పుడా పరిస్థితి లేక ఎండకాలానికి ముందే నీటి చుక్క లేక వెలవెలబోతున్నాయి. జగిత్యాల జిల్లాలో దాదాపు 80 శాతం చెరువులు అడుగంటి పోయాయి. రెండేండ్ల క్రితం వరకు ఇదే మార్చిలో సైతం పొంగిపొర్లిన చెరువులు, నేడు జలకళ లేక కళావిహీనంగా మారాయి. పోయిన ఎండకాలం వరకు చెరువుల కింద యాభై వేలకు పైగా ఎకరాలు సాగయినా.. ఇప్పుడా పరిస్థితి లేక బీటలు వారి కరువు ఛాయలను తలపిస్తున్నాయి.
జగిత్యాల, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఎస్సారెస్పీ పునర్జీవ పథకాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తర్వాత జగిత్యాల జిల్లా చెరువులకు మహర్దశ పట్టింది. ఎస్సారెస్పీ ప్రధాన కాలువతోపాటు వరద కాలువకు సైతం తూములు పెట్టి మరీ చెరువులను నింపే ప్రక్రియను అప్పటి కేసీఆర్ ప్రభుత్వం చేపట్టింది. దీంతో మండుటెండల్లో సైతం చెరువులు జళకళను సంతరించుకున్నాయి. 2023లో ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద కాళేశ్వరం నీటితో మరీ చెరువులను నింపారు. అలాగే ఎల్లంపల్లి నుంచి నీటిని తెచ్చి కొడిమ్యాల, మల్యాల మండలాల్లో ఉన్న చెరువులను నింపుతూ వచ్చారు. చెరువులను నింపడంతో అన్ని గ్రామాల్లోనూ భూగర్భజలాలు సైతం పెరిగాయి. చెరువుల్లో పుష్కలంగా నీరుండడం, భూగర్భజలాలు పెరగడంతో పంటలు పుష్కలంగా పండుతూ వచ్చాయి. పది పదిహేనేండ్లు నీళ్లు లేక పడావు పెట్టిన భూములు సైతం వినియోగంలోకి వచ్చాయి. దాదాపు యాభై వేల ఎకరాలకు పై చిలుకు భూమి చెరువుల కిందనే సాగులోకి రాగా, ఎటు చూసినా పచ్చని పంటలు దర్శనమిచ్చాయి.
ఎస్సారెస్పీ ఆయకట్టు పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లాలో చెరువుల సంఖ్య సైతం అధికంగానే ఉంది. మొత్తం 1125 చెరువులతోపాటు 96 కుంటలు ఉండగా, మొత్తంగా 59,601 ఎకరాలు సాగవుతున్నది. వంద ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం కలిగి ఉన్న చెరువులు 166 ఉండగా, వీటి కింద 25,391.54 ఎకరాల భూమి సాగులో ఉన్నది. ఇక 100 ఎకరాలలోపు విస్తీర్ణం కలిగి ఉన్న చెరువులు 959 ఉండగా, వీటి కింద 33,451.91 ఎకరాల పారకం ఉన్నది. మరో 96 కుంటల కింద 754 ఎకరాల సాగుభూమి ఉన్నది. జిల్లాలో అధికంగా గొలుసుకట్టు చెరువులే ఉన్నాయి. వర్షం ఆధారంగా ఒక చెరువు నిండి ఒర్రెల ద్వారా మరో చెరువును నింపేవే అధికంగా ఉన్నాయి. అయితే ఎస్సారెస్పీ కాలువ, వరద కాలువ ద్వారా దాదాపు 800 చెరువులను, ఎల్లంపల్లి నీటి ద్వారా మరో 300 చెరువులు నింపడానికి అవకాశాలున్నాయి.
ఈ యేడు వర్షపాతం సాధారణం కంటే అధికంగానే నమోదు కావడంతో చాలా చెరువులు ఆగస్టు, సెప్టెంబర్లోనే వందశాతం సామర్థ్యం సంతరించుకున్నాయి. అలాగే ఎస్సారెస్పీ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు మహారాష్ట్రలోనూ పుష్కలంగా పడిన వానలతో ప్రాజెక్టు కళకళలాడింది. చెరువుల్లో పుష్కలంగా నీరు చేరడం, ఎస్సారెస్పీ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం సంతరించుకోవడంతో వానకాలం పంటకు ఇబ్బందులు లేకుండా పోయాయి. అయితే పరిస్థితులు మళ్లీ మొదటికి వచ్చాయి. ఈ యేడాది ముందుగానే ఎండలు మండిపోతుండడంతో చెరువులు ఎండిపోతున్నాయి. జనవరి చివరి వారం వరకే జిల్లాలో దాదాపు 50 శాతం అడుగంటాయి. జిల్లాలో 1100కుపైగా చెరువులు ఉండగా, ప్రస్తుతం అధికారుల లెక్కల ప్రకారం కేవలం 100 నుంచి 110 చెరువుల్లోనే 80నుంచి 90శాతం నీటి సామర్థ్యం ఉన్నది. మిగిలిన చెరువుల్లో పది నుంచి ఇరవై శాతానికి మించి నీరు లేదు. చెరువుల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టులో పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు భూగర్భజలాలు సైతం దిగిపోతున్నాయి. బోర్లు వేసినా నీళ్లు పడని పరిస్థితి ఉండగా, రైతులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేసి చెరువులను నింపే ప్రక్రియను చేపట్టింది. ఏడాదిలో రెండు మూడు సార్లు ఎస్సారెస్పీ నీటిని వదిలి డిస్ట్రిబ్యూటరీల ద్వారా నింపుతూ వచ్చింది. అయితే ఈ యేడాది ఏ ఒక్క చెరువును ప్రాజెక్టు నీటితో నింపలేదని రైతులు చెబుతున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు నీళ్లు వదిలిన సమయంలో చివరి వరకు వెళ్లిన తర్వాత మిగిలిన పరవాటి నీళ్లు కొన్ని చెరువులోకి చేరుకున్నాయే తప్పా, ప్రత్యేకంగా ఎక్కడ చెరువులను నింపలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టుల్లో నీళ్లున్నాయని, అయినా, చెరువులను ఎందుకు నింపలేదో అర్థం కావడం లేదని వాపోతున్నారు. చెరువులను నింపితే కొంత పంటనైనా కాపాడుకునే వాళ్లమని, భూగర్భజలాలు వృద్ధి చెంది బోర్లు, బావుల కింద కొంత పంట దక్కేదని, ప్రభుత్వం చెరువులను నింపకపోవడం వల్ల తీవ్ర నష్టం కలిగిందని ఆవేదన చెందుతున్నారు.
సారంగాపూర్ మండలం పోతారంలోని హన్మంతరావుకుంట కింద దాదాపు 70 ఎకరాలకు పైగా సాగు భూమి ఉన్నది. ముప్పై నలభై మంది రైతులు ఆ కుంట నుంచి వచ్చే నీటితో పంటలను పండించుకుంటూ వస్తున్నారు. సహజ సిద్ధంగా ఏర్పడిన హన్మంతరావుకుంటకు సారంగాపూర్ మండలంతోపాటు బీర్పూర్ మండలానికి సాగునీటిని ఇచ్చే ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీ 53 నుంచి 1ఆర్ కాలువ ద్వారా నీటిని తరలించేందుకు ఏర్పాటు చేశారు. 1ఆర్ కాలువ రేచపల్లి, సారంగాపూర్, బట్టపల్లి, పోతారం గ్రామాలకు సాగునీటిని తీసుకెళ్తుండగా, ఇదే కాలువ ద్వారా హన్మంతరావుకుంటను నింపుతూ వచ్చారు. వానకాలంలో వర్షాలు వచ్చినప్పుడు ఈ కుంట జలకళను సంతరించుకునేది. 70 ఎకరాల పొలాలకు సాగునీరు ఇచ్చేది. ఫిబ్రవరి, మార్చిలో కుంట ఎండిపోతే డిస్ట్రిబ్యూటరీ 53 ద్వారా హన్మంతరావుకుంటను నింపి పంటలకు సాగునీరిచ్చేది. ఈ కుంటలో నీరుంటే, బట్టపల్లి, పోతారంతోపాటు పక్కనే ఉన్న నాయకపుగూడెం రైతులకు డోకా ఉండకపోయేది. నాయకపుగూడెం గ్రామంలో భూగర్భజలాలు సైతం వృద్ధి చెందేవి. దీంతో బోర్లపైన సైతం రైతులు సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం హన్మంతరావుకుంట పూర్తిగా ఎండిపోయింది. ఈ పరిస్థితిని రైతులు నలభై ఎకరాలను బీడు పెట్టారు. కొద్ది మంది రైతులు మాత్రం బోర్లు, బావుల ద్వారానైనా పంట సాగు కాకపోతుందా అన్న నమ్మకంతో ఇరవై, ఇరవై ఐదు ఎకరాల్లో వరి పంట వేస్తే నిరాశే ఎదురైంది. కుంటలో చుక్క నీళ్లు లేకపోవడం, భూగర్భజలాలు పడిపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఒక్క హన్మంతరావుకుంటే కాదు, చాలా చెరువుల కింద పంటలు వేసిన రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నది.