వేములవాడ, జూన్ 18: వేములవాడలో జరుగుతున్నది ప్రధాన రహదారి విస్తరణా..? పరాయి దేశస్తులపై యుద్ధమా..? అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి లక్ష్మీనరసింహారావు మండిపడ్డారు. ఇక్కడ విస్తరణను చూస్తే పరాయి దేశంపై యుద్ధం చేసినట్టుగా మీ పాలన ఉన్నదని విమర్శించారు. వేకువజామునే వందలాది పోలీసులు, జేసీబీలతో నిర్వాసితులపై దాడి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఏళ్ల తరబడిగా ఉన్న దుకాణాలు, నివాసాలు కోల్పోతున్న తరుణంలో మానవీయ కోణంలోనైనా కనీసం గడువు ఇవ్వకుండా, సామగ్రి ఉండగానే ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అధికారులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వేములవాడలోని ఆయన నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రహదారి విస్తరణకు తాము వ్యతిరేకం కాదని నిర్వాసితులు పదేపదే చెబుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధికారులతో చొరవచూపాల్సింది పోయి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.
నిర్వాసితులకు పరిహారం ఇవ్వకముందే ఇండ్లు, దుకాణాలు ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడం ఏంటని? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా..? రాచరిక పాలనలో ఉన్నామా..? అని ప్రశ్నించారు. వేములవాడ ప్రధాన రహదారి విస్తరణలో పరిహారం ఒకరికి గజానికి 11 వేలు.. మరొకరికి లక్షా 56 వేలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఇన్ని తేడాలు ఉన్నాయని నిర్వాసితులు పదేపదే ఎమ్మెల్యేకు విన్నవించినా.. వారితో ఒక సమావేశం కూడా నిర్వహించకుండా, కనీసం చర్చించకుండా అధికారులతో కలిసి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు సరికాదని హితవుపలికారు.
రాజన్న, బద్దిపోచమ్మ ఆలయాల విస్తరణ కోసం గతంలో తమ ప్రభుత్వం ఏ ఒక్కరూ బాధ పడకుండా సమన్వయంతో భూములు సేకరించామన్న విషయం ప్రజలకు తెలుసునన్నారు. ఇప్పటికైనా ప్రధాన రహదారిలో సర్వం కోల్పోతున్న నిర్వాసితులకు సరైన ధరను నిర్ణయించి న్యాయంచేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం పదేళ్లలో అభివృద్ధి చేయలేదని పదేపదే మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్‌కు వేములవాడలో జరిగిన అభివృద్ధి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రాజన్న ఆలయాన్ని నాలుగు ఎకరాల్లో విస్తరిస్తున్నామని చెబుతున్న ఆయన, గత ప్రభుత్వం సేకరించిన 30 ఎకరాలలోనే ఈ నాలుగెకరాలు ఉందన్న విషయం తెలియకపోవడం హాస్యాస్పదమన్నారు. నిత్యాన్నదాన సత్రం కూడా గత ప్రభుత్వం సేకరించిన స్థలంలోనే నిర్మిస్తున్న విషయం కూడా తెలియకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. గోశాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము నిలదీయడం ద్వారానే స్పందించిందని, వంద ఎకరాల్లో వేములవాడలో రాజన్న గోశాల ఏర్పాటును స్వాగతిస్తున్నామన్నారు.
ఇప్పటికీ కోడెలు మృత్యువాత పడుతున్నట్లు తమకు సమాచారం ఉందని, కోడెల విషయంలో భక్తుల మనోభావాలను కాపాడాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని గుర్తు చేశారు. సమావేశంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతికుమార్, మాజీ కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, జోగిని శంకర్, నరాల శేఖర్, గోలి మహేశ్, ముద్రకోల వెంకటేశం, నాయకులు పొలాస నరేందర్, కొండ కనుకయ్య, కుమ్మరి శ్రీనివాస్, వెంగళ శ్రీకాంత్‌గౌడ్, వెంకట్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, గుడిసె సదానందం, అంజత్‌పాషా, సయ్యద్‌బాబా, సందీప్ తదితరులు పాల్గొన్నారు.