Chigurumamidi | చిగురుమామిడి, మే 7 : కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం పై దాడికి పాల్పడడం అమానుషమని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ పేర్కొన్నారు.
క్యాంప్ కార్యాలయంలోకి గురువారం చొరబడి వాహనాన్ని ధ్వంసం చేసి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని దుర్భాషలాడడం, దాడి చేసేందుకు ప్రయత్నించడం సరైనది కాదన్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన హోంమంత్రి అనుచరులు కార్యకర్తలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు.
వెంటనే హోం మంత్రి బండి సంజయ్ స్పందించి కార్యకర్తలను మందలించి మరోసారి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇరుపక్షాల నుండి ద్వేషాలు పెంచుకున్నట్లయితే ఉధృతికి దారితీస్తుందని అన్నారు. క్యాంపు కార్యాలయం పై దాడికి పాల్పడిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సతీష్ కుమార్ డిమాండ్ చేశారు.