రుద్రంగి, డిసెంబర్ 22 : రుద్రంగిలో అప్రోచ్ రోడ్లు అధ్వానంగా మారాయి. అసంపూర్తి పనులతో ప్రమాదకరంగా మారాయి. రుద్రంగి మండల కేంద్రంలో కొద్దిరోజుల క్రితం ఆర్అండ్బీ ప్రధాన రహదారి విస్తరణతో పాటు సైడ్ డ్రైనేజీ పనులు పూర్తయ్యాయి. అయితే గతంలో ఉన్న రోడ్డును కొత్తగా రెండు మీటర్ల ఎత్తున నిర్మించారు. దానికి అనుసంధానంగా ఉన్న దాదాపు 30 అప్రోచ్ రోడ్ల వెంట మట్టి పోసి రివిట్మెంట్ నిర్మించకుండా వదిలేయడంతో ప్రమాదకరంగా మారాయి. అయితే ప్రధాన రహదారిని రెండు మీటర్లు ఎత్తున నిర్మించడంతో కాలనీలన్నీ డౌన్ అయ్యాయి.
బస్టాండ్ ఏరియా, మండల పరిషత్ కార్యాలయం, లక్ష్మీ నరసింహస్వామి అలయం ఎదుట దాదాపు 3 మీటర్ల మేర రోడ్డు ఎత్తు పెంచడం ఇబ్బందిగా మారింది. కాలనీల నుంచి ప్రధాన రహదారికి బైక్పై వచ్చి, వెళ్లే క్రమంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇటీవల పలువురికి గాయాలైన సందర్భాలు ఉన్నాయి. ప్రధాన రోడ్డు పనులు పూర్తయి నెలలు గడుస్తున్నదని, అప్రోచ్ రోడ్డు వెంటనే నిర్మించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సీసీ రోడ్లు వేయాలని కోరుతున్నారు.