BRSV | సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 11: టీపీసీసీకి కమిషన్ ఏజెంట్ గా టీజీపీఎస్సీ మారిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బని హరీశ్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అన్యాయం చేసిన టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ చౌరస్థాలో గురువారం టీజీపీఎస్సీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.
ప్రభుత్వం పట్టింపులకు వెళ్లకుండా హైకోర్టు డివిజన్ బెంచి, సుప్రీం కోర్టుకు వెళ్లొద్దని అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. బీసీ విద్యార్థులకు 42శాతం రిజర్వేషన్లు కల్పించిన తరువాతనే ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపట్టాలన్నారు. ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులపై నిర్బందకాండను కొనసాగిస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని చూస్తే భవిష్యత్ లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. టిజిపిఎస్సిని వెంటనే రద్దు చేసి కొత్త కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో ఉద్యోగానికి రూ.3కోట్లు వసూలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చీమల ప్రశాంత్, దీపక్, ప్రశాంత్, మోహన్, మణిదీప్, చిరంజీవి, అన్వర్, తదితర నాయకులున్నారు.