రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ పాలనలో జీవం పోసుకున్న వస్త్రపరిశ్రమ, కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో కుదేలైంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం నాడు కేసీఆర్ హయాంలో ఇచ్చిన బతుకమ్మ చీరెల ఆర్డర్లను నిలిపి వేసింది. దీంతో ఎంతో మంది నేతన్నలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డా రు. రాష్ట్ర వ్యాప్తంగా 30 మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఈ పరిస్థితుల్లో ఉపాధి చూపాలంటూ కార్మికులు వేడుకున్నారు. పోరుబాట పట్టారు. దాని ఫలితంగా దిగొచ్చిన కాంగ్రె స్ సర్కారు స్వయం సహాయక సంఘాల మహిళలకు రెండు జత ల చీరెల చొప్పున ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో సిరిసిల్ల నేతన్నలకు 8కోట్ల విలువైన 1.30కోట్ల చీరెల తయారీ ఆర్డ ర్లు ఇచ్చింది.
ఉత్పత్తి కూడా ప్రారంభమైంది. యజమానికి మీట రు తయారీకి 32.50 చొప్పున చెల్లించేందుకు అంగీకరించినా కార్మికులకు మాత్రం కూలీ రేట్లు నిర్ణయించలేదు. దీంతో పదిహేను రోజులుగా పనిచేస్తున్న కార్మికులకు యజమానులు, ఆసాములు అనామతుగా పైసలు ఇస్తూ వస్తున్నారు. పనికి తగ్గ కూలీ దక్కకపోవడం, దీనిపై టెస్కో అధికారులకు పలుసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో కార్మికులు పోరుబాట పట్టారు.
ఉపాధి ఎవరికి?
కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ చీరెల తయారీకి మీటరుకు 34.50 చొప్పున యజమానులకు చెల్లించింది. అందులో కార్మికుడికి 5.25, యారన్ సబ్సిడీ 1.42పైసలు అదనంగా చెల్లించింది. మీటరుకు అన్ని కలిపి 6.67పైసలు చెల్లించేలా చర్యలు తీసుకున్నది. కానీ, ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం యజమానులకు రెండు రూపాయలు తగ్గించి 32.50 మాత్రమే చెల్లిస్తున్నది.
యజమానులకు ఇచ్చే కూలీ మాత్రం నిర్ణయించినా.. కార్మికుల కూలీ నిర్ణయించకుండా చేతులు దులుపుకున్నది. అసలు చీరెల వల్ల ప్రయోజనం కార్మికులకా..? లేక యజమానులకా..? అని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. పైగా బతుకమ్మ చీరెల కన్నా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే చీరెల తయారీలో ఎక్కువ పని ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువ పని చేయించి తక్కువ కూలీ వచ్చేలా ప్రభుత్వ విధానాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు.
ఊసేలేని యారన్ సబ్సిడీ
కార్మికక్ష్రేతంలో వలసలు తగ్గించేందుకు నాడు కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది. కార్మికులకు చేతి నిండా పని కల్పించడంతో పాటు పనికి తగ్గ వేతనం వచ్చేలా చర్యలు తీసుకున్నది. నెలకు 20వేలు పొందేలా కూలీ రేట్లు నిర్ణయించింది. ప్రోత్సాహకంగా బతుకమ్మ చీరెలకు ఇచ్చే యారన్కు పది శాతం సబ్సిడీ ప్రకటించింది. సబ్సిడీ పైసలు కూడా కార్మికులకే చెల్లించేలా చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరెల ఆర్డర్లకు కూలీ నిర్ణయించకపోగా, యారన్ సబ్సిడీ కూడా ప్రకటించలేదు.
సమ్మెబాటలో కార్మికులు
ప్రభుత్వం ఇస్తున్న చీరెల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఉద్యమిస్తూనే ఉన్నారు. అరెస్టులతో భయపెట్టినా.. సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేసినా వెన్కక్కితగ్గకుండా పోరు మరింత ఉధృతం చేస్తున్నారు. ఆరు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. దీంతో వందలాది మర మగ్గాలు బంద్పడ్డాయి. చీరెల తయారీ నిలిచి పోయింది.
అయి నా అధికారులు గానీ, పాలకులు గానీ పట్టించుకోకపోవడంతో కార్మికులు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి 24 గంటల నిరాహార దీక్షలు చేపడుతున్నట్లు సీఐటీయూ నాయకులు ప్రకటించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం పది గంటలకు దీక్షా శిబిరాన్ని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ప్రారంభింస్తారని జిల్లా అధ్యక్షుడు కోడం రమణ ఒక ప్రకటనలో తెలిపారు.
కూలీ రేట్లు నిర్ణయించని సర్కారు
నేతన్నకు వేతన భరోసా కరువవుతున్నది. పనికి తగ్గ కూలీ దక్కకుండా పోతున్నది. మహిళా సంఘాల చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు, కూలీ రేట్లు నిర్ణయించకుండా మొండిచేయి చూపింది. దీంతో కార్మికులు ఆగ్రహిస్తున్నారు. ప్రభుత్వం ఇస్తున్న చీరెల తయారీకి కూలీ రేట్లు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పట్టారు. ఆరు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో నేటి నుంచి నిరాహార దీక్షలకు సిద్ధమవుతున్నారు.
పాత కూలీ రేట్లు ఇవ్వాలి
కేసీఆర్ ప్రభుత్వం కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసింది. సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం, కార్మికుల ఆకలిచావులు, ఆత్మహత్యలను నివారించేందుకు ఆయన అనేక చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా బతుకమ్మ చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చి మెరుగైన కూలీ కార్మికులకు చెల్లించింది. అదనపు కూలీ ఇచ్చేలా యారన్ సబ్సిడీ కూడా ఇచ్చింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నది. చీరెల తయారీ ఆర్డర్లు ఇచ్చి చేతులు దులుపుకొన్నది.
కూలీ రేట్లను నిర్ణయించ లేదు. ఇది సరైంది కాదు. నేతన్నల సంక్షేమం కోసం కేసీఆర్ తెచ్చిన పథకాలను యథాతథంగా అమలు చేయాలి. కూలీ రేట్లు బతుకమ్మ చీరెలకు ఇచ్చిన మాదిరిగానే స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇచ్చే చీరెలకు ఇవ్వాలి. వార్పిన్ కార్మికులు, నేతన్నలకు కూలీ మెరుగైన కూలీ రేట్లు నిర్ణయించాలి. వెంటనే చర్యలు తీసుకోక పోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తం.
– మూషం రమేశ్, తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు