కరీంనగర్ బల్దియాలో రూ.50 కోట్ల విలువైన టెండర్లను అధికారులు గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయడంపై రాజకీయ రగడ మొదలైంది. ఈ విషయంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. దీని వెనుక ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తం ఉన్నట్టు తెలుస్తుండగా, బీజేపీకి చెందిన ఓ కీలక నేత వెనకుండి చక్రం తిప్పినట్టు తెలిసింది. సదరు ‘కాషాయ పార్టీ’ నేత విసిరిన వలలో చిక్కుకున్న పలువురు కాంగ్రెస్ కార్పొరేటర్లు ఇచ్చిన తప్పుడు సమాచారం నమ్మి.. టెండర్ల రద్దుకు మంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. అయితే రద్దుపై దుమారం లేచిన విషయం తెలుసుకున్న ఆ మంత్రి.. ‘హస్తం’ కార్పొరేటర్లపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీంతో వీటన్నింటినీ కప్పిపుచ్చుకునేందుకు బీజీపీ, కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి ‘టెండర్ల రద్దు సమర్థనీయమే’ అంటూ సంతకాల సేకరణ ప్రారంభించగా, ఈ విషయంలో ‘కమలం’ కార్పొరేటర్లు రెండుగా చీలినట్టు తెలిసింది.
బీజేపీకి చెందిన ఓ కీలక నేతతోపాటు పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌తో కలిసి సంతకాలకు మద్దతు తెలుపుతుండగా, విలీన గ్రామాల బీజేపీ కార్పొరేటర్లు మాత్రం దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అక్కడితో ఆగకుండా టెండర్లను రద్దు చేయవద్దని కోరుతూ కలెక్టర్‌ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధం కాగా, బీజేపీకి చెందిన ఓ కీలక నేత కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్టు సమాచారం. సాక్షాత్తూ సీడీఎంఏ ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత టెండర్లు రద్దు చేయడం, ప్రస్తుతం దీనిపై పెద్ద వివాదం అవుతున్నా కేంద్రమంత్రి బండి సంజయ్ మౌనం వహించడంపై అనేక అనుమానాలకు తావిస్తున్నది.
కరీంనగర్, మార్చి 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కార్పొరేషన్ : కరీంనగర్ కార్పొరేషన్లో టెండర్ల రద్దు.. లోపాలను ఎత్తి చూపుతూ ‘కమీషన్ల కోసమా.. రాజకీయ ఆధిపత్యమా..?’ శీర్షికన శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం కలకలం రేపింది. పలువురు కార్పొరేటర్లు ఏకంగా ‘నమస్తే తెలంగాణ’కు ఫోన్ చేసి.. వాస్తవాలను ఎండగట్టారంటూ చెప్పడం గమనార్హం! ఇది ఇలా ఉంటే.. టెండర్ల రద్దు విషయంలో తీగలాగితే డొంకంతా కదులుతున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే పెద్ద రాజకీయ దుమారమే రేగుతున్నది. నిజానికి కరీంనగర్ కార్పొరేషన్లో విలీన గ్రామాలను కలిపే సమయంలో ఆయా ప్రాంతాల ప్రజలు పలు అంశాలను మంత్రి పొన్నం ప్రభాకర్ ముందు పెట్టారు.
ఉదాహరణకు కొత్తపల్లి పురపాలక సంఘాన్ని విలీనం చేసే సమయంలో మున్సిపల్లో నిధులున్నాయని, వాటితో పలు అభివృద్ధి పనులు చేసుకోవచ్చని, కార్పొరేషన్లో విలీనమైతే ఆ నిధులు వెనక్కి వెళ్లి తమకు అన్యాయం జరుగుతుందని చెప్పారు. ఈ విషయంలో ఎవరూ ఇబ్బంది పడొద్దని ప్రత్యేక నిధులు తెచ్చి విలీన ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ఆనాడు మంత్రి పొన్నం హామీ ఇచ్చారు. అలాగే ఎన్నికల సమయంలో కొత్తపల్లిలో జరిగిన ఒక బహిరంగ సభలోనూ కేంద్ర మంత్రి బండి సంజయ్ సభాముఖంగా వాగ్దానం చేశారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి బాధ్యతను తీసుకుంటామని, ఇప్పటికే నిధులు మంజూరై ఉన్నాయని, గెలిచిన వెంటనే పనులకు శంకుస్థాపన చేసి దగ్గురుండి పనులు చేస్తామని ప్రకటించారు. నిజానికి విలీన గ్రామాలు, ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా 50 కోట్ల నిధులు రాగా, టెండర్లు పిలిచారు. కానీ, తాజా పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా కొనసాగుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
50 కోట్ల పనులకు సీడీఎంఏ అనుమతి ఇచ్చిన తర్వాత రాష్ట్ర మంత్రి సహకారం లేకుండా రద్దు కాదని భావించిన బీజేపీలోని ఓ కీలక నేత.. పకడ్బందీ వ్యూహంతో వేసిన వలలో కాంగ్రెస్ కార్పొరేటర్లు చిక్కినట్టు తెలుస్తున్నది. 50 కోట్ల నిధులను అన్ని డివిజన్లకు సమానంగా వచ్చేలా చూసుకుందామని, తద్వారా లాభం జరుగుతుందని, అవసరమైతే కాంగ్రెస్ కార్పొరేటర్లు ఎక్కువ నిధులు తీసుకున్నా ఫరవాలేదని, అది జరగాలంటే ముందుగా టెండర్లు రద్దు కావాలని, అందుకోసం మీరే మంత్రి వద్దకు వెళ్లాలని చెప్పడంతో పలువురు ‘హస్తం’ కార్పొరేటర్లు మంత్రి వద్దకు వెళ్లినట్టు తెలుస్తున్నది.
అయితే అందులోని నిజానిజాలను అర్థం చేసుకోని సదరు మంత్రి, టెండర్లను రద్దు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. అయితే టెండర్ల రద్దు విషయం బయటకు రావడం.. అది రచ్చరచ్చ కావడం, విలీన ప్రాంతాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో సదరు కార్పొరేటర్లపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. తన వద్ద అసత్యాలు చెప్పి, పక్కదారి పట్టించారంటూ కొంత మంది కార్పొరేటర్లపై తీవ్రస్థాయిలో మండిపడినట్టు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు, బీజేపీ నేత విసిరిన వలలో చిక్కుకున్నారని సదరు మంత్రి గ్రహించినట్టు సమాచారం. అయితే, ఇప్పుడు ‘ముందుకెళ్తే నుయ్యి,, వెనకకు వెళ్తే గొయ్యి’ అన్నట్టు మంత్రి పరిస్థితి మారిందని తెలుస్తున్నది.
మంత్రి ఆగ్రహంతో మళ్లీ కథ మొదటికి వస్తుందని భావించిన సదరు బీజేపీ నేత.. మరో వ్యూహం పన్నినట్టు సమాచారం. రద్దుకు తమ బీజేపీ కార్పొరేటర్లు కూడా సంపూర్ణ మద్దతు ఇస్తారని, అందుకోసం సేకరించిన సంతకాలను తీసుకెళ్లి మంత్రికి ఇవ్వాలంటూ ఆయన మరో అస్త్రం వదిలినట్టు తెలుస్తున్నది. దీంతో శుక్రవారం ఉదయం నుంచి ఓ ఇద్దరు బీజేపీ, మరో ఇద్దరు కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి ఇరు పార్టీలకు చెందిన కార్పొరేటర్లను కలుస్తూ సంతకాలు సేకరిస్తున్నట్టు తెలిసింది. ‘టెండర్లు రద్దు సమర్థనీయమే’ అని చెప్పడంతోపాటు ఏకంగా సీడీఎంఏ గతంలో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని పేర్కొంటూ ఈ సంతకాల సేకరణ చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తున్నది.
అందులో రెండు పార్టీలకు చెందిన పలువురు కార్పొరేటర్లు ఇప్పటికే సంతకాలు చేసినట్టు సమాచారం. నిజానికి రాష్ట్ర మంత్రి సహకారం లేకుండా సీడీఎంఏ ఉత్తర్వులను రద్దు చేయించడం బీజేపీకి సాధ్యం కాదు. జిల్లాకు చెందిన మంత్రిని బీజేపీ నేరుగా ఆడిగితే ఆయన రద్దు చేయడని గ్రహించిన సదరు కాషాయ నేత.. కాంగ్రెస్ కార్పొరేటర్లను ఎగదోశాడన్న చర్చ ప్రస్తుతం సాగుతున్నది. తన పంతం నెగ్గించుకోవాలంటూ కాంగ్రెస్ కార్పొరేటర్లను తమ వలలో దింపాలని భావించి ఈ డ్రామా అంతా నడిపారన్న చర్చ ప్రస్తుతం బల్దియాలో నడుస్తున్నది. దీని వెనుక ఓ పెద్ద కుట్ర ఉందన్న విషయం బహుషా కాంగ్రెస్ కార్పొరేటర్లకు తెలియకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సంతకాల సేకరణ విషయంలోనూ పెద్ద డ్రామా ప్లే చేస్తున్నారు. ఇది కూడా సదరు కమలం పార్టీ కీలక నేత వ్యూహంలో ఒక భాగమేనని తెలుస్తున్నది. టెండర్ల రద్దుకు కాంగ్రెసోళ్లు సంతకాలు పెడుతున్నారని, దానికి మనం సపోర్టు ఇవ్వాలంటూ కొంత మంది బీజేపీ కార్పొరేటర్లే తోటి వారికి చెప్పి సంతకాలు పెట్టేలా ప్రేరేపిస్తున్నారు. అలాగే టెండర్ల రద్దు కోసం బీజేపీ వాళ్లు ప్రయత్నాలు చేస్తున్నారని, దానికి మనం మద్దతు ఇవ్వాలని చెపుతూ.. కొంతమంది ‘హస్తం’ కార్పొరేటర్లను రంగంలోకి దించి ఇతర కార్పొరేటర్లను ప్రేరేపిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
విషయం అర్థం చేసుకున్న కొంత మంది బీజేపీ కార్పొరేటర్లు మాత్రం సంతకాలు పెట్టేందుకు నో చెప్పినట్టు తెలిసింది. ప్రధానంగా విలీన ప్రాంతాలు, గ్రామాలకు చెందిన బీజేపీ కార్పొరేటర్లు మాత్రం దీనిని తీవ్రంగా తిరస్కరిస్తున్నట్టు తెలుస్తున్నది. అంతేకాదు, టెండర్ల రద్దు విషయంలో బీజేపీ-కాంగ్రెస్ కార్పొరేటర్లు కలిసి సంతకాలు చేపట్టడం ఏంటని ప్రశ్నించినట్టు తెలిసింది. దీంతో బీజేపీ కార్పొరేటర్లు రెండు వర్గాలుగా చీలినట్టు అత్యంత విశ్వసనీయ సమాచారం. చిన్న చిన్న విషయాల్లో స్పందించే కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఈ విషయంలో మౌనం వహించడంపై అనేక అనుమానాలు తల్లెతుతున్నాయి.
రూ.50 కోట్లతో విలీన ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని భావించాం. ప్రజలకు ఆ పనులు చూపించి విజయం సాధించాం. అకస్మాత్తుగా టెండర్లు రద్దు చేస్తే మా విలీన మున్సిపాలిటీలు, గ్రామాలు అభివృద్ధికి నోచుకోకుండా పోతాయి. నిజానికి గతంలో స్మార్ట్‌సిటీ ఫండ్ ద్వారా నగరంలోని అన్నీ వార్డులకు న్యాయం జరిగింది. విలీన ప్రాంతాల్లోనే అభివృద్ధి జరగలేదు. ఇప్పుడు వచ్చే నిధులైనా తమ ప్రాంతాలకు ఉపయోగ పడుతాయని అనుకున్నాం. కానీ, ఇప్పుడు రద్దు చేసినట్టు తెలుస్తున్నది. రూ.50 కోట్ల నిధులతో పిలిచిన టెండర్లను ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయవద్దని, యధావిధిగా టెండర్లను పూర్తిస్థాయిలో ఓపెన్ చేసి అర్హత ఉన్న కాంట్రాక్టర్లకు వర్క్ ఆర్డర్ ఇచ్చి వెంటనే పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కలిసి కోరుతాం. దీనిపై ఉన్నతాధికారులు సరిగా స్పందించకపోతే.. విలీన ప్రాంతాల కార్పొరేటర్లం కలిసి న్యాయ పోరాటం చేస్తాం. అందులో ఎటువంటి అనుమానాలకు తావు లేదు. టెండర్ల రద్దయినట్టు వచ్చిన వార్తల నేపథ్యంలో మా ప్రాంతాల ప్రజలు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. వారికి మేం ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాని పరిస్థితి ఉన్నది. అందుకే ముందుగా కలెక్టర్ కలుస్తాం. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం.
– వాసాల రమేశ్, బీజేపీ సీనియర్ కార్పొరేటర్
పైకి మాత్రం వేర్వేరుగా పార్టీలుగా కనిపిస్తున్నా అంతర్గతంగా కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక్కటే అని చెప్పడానికి టెండర్ల రద్దు ఒక నిదర్శనం. ఈ విషయంలో ఇద్దరు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత మాత్రమే రద్దయ్యాయి. అందులో ఎటువంటి అనుమానం లేదు. నిజంగా మంత్రులు వేర్వేరు అయితే.. టెండర్ల రద్దుపై ఇంత వివాదం జరుగుతుంటే.. ఒక్కరు కూడా ఎందుకు మాట్లాడడం లేదు. రెండు పార్టీల కార్పొరేటర్లు కలిసి సంతకాల సేకరణ చేస్తున్నారంటే ఇది మంత్రులకు తెలియకుండా జరిగే ప్రసక్తే లేదు. ఈ విషయంలో నిజానిజాలను ప్రజలకు వివరించి చెప్పాల్సిన బాధ్యత కూడా ప్రస్తుతం ఆ ఇద్దరి మంత్రులపైనే ఉంది.
– రవీందర్ సింగ్, బీఆర్ఎస్ కార్పొరేటర్