CHIGURUMAMIDI | చిగురుమామిడి, ఏప్రిల్ 25: మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కౌలు రైతుకు చెందిన వరి పంట దగ్ధమైంది. బాధితుడి కథనం ప్రకారం.. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సుకోషి విజ్జగిరి రాయిని చెరువు వద్ద గల తన వరి పంటను హార్వెస్టర్ తో కోయించాడు. అందులో ఉన్న వారి కొయ్యకాళ్లను తొలగించేందుకు శుక్రవారం నిప్పంటించాడు.
నిప్పు వరి కోయ్యతో పాటు పక్కనే ఉన్న సుకోసి రాజయ్యకు చెందిన వ్యవసాయ భూమిని కౌలు చేస్తున్న పోతుల రమేష్ వరి పంట కుప్పలు దగ్ధమైంది. సుమారు రూ.50 వేలు విలువగల వరి పంట అగ్నికి బూడిదైనట్లు బాధితుడు రమేష్ కన్నీరు మున్నీరుగా విలిపించాడు. వెంటనే సమాచారం తెలుసుకున్న గ్రామానికి చెందిన కానుగంటి సత్యం సంబంధిత ఏఈఓ అఖిలకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకుని దగ్ధమైన వరి కుప్పలను పరిశీలించి ఆర్ఐ కి సమాచారమిచ్చారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు రమేష్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.