Electric Shock | ముత్తారం, జులై 7 : ట్రాన్స్ఫార్మర్ ఫీజు సరిచేస్తూ విద్యుత్ షాక్కు గురై కౌలు రైతు మృతి చెందాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలోని పారుపల్లి గ్రామపంచాయతీలోని శాలగుండ్ల పల్లి శివారులో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. ముత్తారం మండల కేంద్రానికి చెందిన వెంకట్ రెడ్డి పారుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని శాలగుండ్లపల్లిలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు.
ఈ క్రమంలో తను కౌలు తీసుకున్న పొలం వద్ద మోటారుకు విద్యుత్ రాకపోవడంతో పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఫీజు పోవడంతో ట్రాన్స్ఫార్మర్ బందు పెట్టి ఫీజు సరి చేసేందుకు ట్రాన్స్ఫార్మర్ పైకి ఎక్కడంతో విద్యుత్ సరఫరా అయింది. దీంతో వెంకట్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మంథనికి తరలించారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.