సింగరేణిలో కొత్త దందా మొదలైంది. కార్మికుల అనుమతి లేకుండానే జీతాల్లో కోత పడుతున్నది. కార్మికుల సమ్మతి మేరకు చందా తీసుకునే గుర్తింపు సంఘం, ఇప్పుడు ఏకంగా గుడిపేరిట ఉన్న టెంపుల్ రికవరీ కోడ్స్ ద్వారా నేరుగా వేతనాల్లోంచే వసూళ్లకు దిగింది. అక్టోబర్ నెల వేతనం నుంచి 500 చొప్పున రికవరీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. దీనిపై సింగరేణి ఏమాత్రం స్పష్టత, వివరణ ఇవ్వకపోగా, గుర్తింపు సంఘమైన ఏఐటీయూసీ మాత్రం తమకు దీపావళి బోనస్ నుంచి ఇవ్వాల్సిన చందాలే సాంకేతిక కారణాలతో టెంపుల్ రికవరీ కోడ్ నుంచి కట్ అయ్యాయని పేర్కొనడంతో కార్మికులు మండిపడుతున్నారు. యాజమాన్యం, గుర్తింపు సంఘం కుమ్మక్కై నేరుగా దోపిడీకి దిగాయని ఆరోపిస్తున్నారు.
గోదావరిఖని, నవంబర్ 5: సింగరేణి లో గుర్తింపు సంఘం దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు చెల్లించే బోనస్ నుంచి కార్మికుల అనుమతి మేరకు చం దా వసూలు చేసుకునే అవకాశం ఉంది. కానీ, అందుకు విరుద్ధంగా గుడి పేరిట ఉన్న టెంపుల్ రికవరీ కోడ్స్ 183 5,1840,1855 ద్వారా కార్మికుల అనుమతి లేకుండానే అక్టోబర్ వేతనంలో నుంచి 500 చొప్పున యాజమాన్యం రికవరీ చేయడం దుమారం రేపుతున్నది. దీనికి సంబంధించి సింగరేణి యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు.
గుర్తింపు సంఘం ఏఐటీయూసీ మాత్రం తమకు దీపావళి బోనస్‌లో నుంచి ఇచ్చే చందాలే సాంకేతిక కారాణాలతో గుడి కమిటీ నుంచి రికవరీ జరిగిందని, కార్మికులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని పేర్కొంటుంది. గుడి కమిటీ కోడ్ నుంచి రికవరీ చేసిన డబ్బులను గుర్తింపు కార్మిక సంఘానికి దక్కేందుకే యాజమాన్యం ఇలా చేసిందని కార్మికులు ఆరోపిస్తున్నారు. కాగా, సింగరేణిలో గతంలో ఎప్పుడూ లేని విధంగా గుడి కమిటీ పేరుతో గుర్తింపు సంఘం చందా వసూలు చేయడంపై కార్మికులు తీవ్రంగా మండిపడుతున్నారు. దీనిపై పలు సంఘాల నాయకులు సింగరేణి ఉన్నతాధికారులను వివరాలు అడిగితే తమకేమీ తెలియదని చెబుతుండడం విస్మయం గొలుపుతున్నది.
గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ కార్మికుల అనుమతి లేకుండా టెంపుల్ రికవరీ కోడ్స్ ద్వారా చందా ఎలా వసూలు చేస్తుంది. న్యాయంగా కార్మికుల అనుమతితో తీసుకోవాలి. కానీ, ఇలా చేయడం ఏమిటి? ఈ విషయమై సింగరేణి సీఎండీ, డైరెక్టర్ పాను వివరణ అడిగితే తమకేమీ తెలియదని అంటున్నరు. సింగరేణిలో అత్యుత్తమ స్థానంలో ఉన్న వారికి తెలియకుండా ఏ విధంగా ఎలా రికవరీ చేస్తరు? ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అక్రమంగా వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేయాలి.
– జనక్‌ప్రసాద్, ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్
ఏఐటీయూసీ గుడి పేరిట రాజకీయం చేస్తున్నది. కార్మికుల అనుమతి లే కుండా వేతనంలో నుంచి రూ.500 చొప్పున రికవరీ చేయడం అన్యా యం. రికవరీ చేసిన డబ్బులను ఆ కమిటీ ఖాతాలోకి వెళ్తాయి. ఆ డబ్బులను ఏఐటీయూసీకి చెల్లిస్తే క్రిమినల్కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తాం. యూనియన్లకు చెల్లించే చందా డబ్బులను కార్మికుల బ్యాంకుల్లో నిల్వ ఉన్న డబ్బుల్లోంచి చెల్లిస్తారు. కానీ, అందుకు భిన్నంగా వేతనాల్లోంచి గుడి కమిటీ పేరిట కట్ చేయడం సరికాదు. వాటిని తమ ఖాతాలో వేసుకోవడానికి ఎర్రజెండా యూనియన్ చేసిన పన్నాగాన్ని కార్మికులు తిప్పికొట్టాలి.
– మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు
అనుమతి లేకుండా రికవరీ చేసిన డబ్బులను వెంటనే కార్మికులకు తిరిగి చెల్లించాలి. లేకుంటే ఆందోళనలు తప్పవు. సింగరేణిలో ఎప్పుడూ లేనివిధంగా కార్మికుల జీతాల్లో నుంచి యాజమాన్యమే రికవరీ చేయడం, దానిపై వివరణ ఇవ్వకపోవడం సరికాదు. గుడి కమిటీల పేరిట ఏవిధంగా రికవరీ చేసిందో సమాధానం చెప్పాలి. ఏఐటీయూసీ చేస్తున్న మోసాన్ని కార్మికులు గ్రహించాలి. ఈ విషయంలో తక్షణమే సింగరేణి సంస్థ సీఎండీ స్పందించి వాస్తవాలు తెలుపాలి.
– రియాజ్ అహ్మద్, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి