ఆలయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 423 దేవాలయాల పరిధిలో 800కుపైగా ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి, ఆ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ ఎప్పటికప్పుడు చర్యలుచేపడుతున్నా పూర్తి స్థాయిలో కట్టడి చేయలేకపోతున్నది. రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు సరిగా సహకరించకపోవడం వల్లే ఆక్రమిత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సాధ్యపడడం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు దేవాదాయశాఖ ఉమ్మడి జిల్లాలో ఆలయాలను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్)తో అనుసంధానం చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నది. గుర్తించిన ప్రసిద్ధ దేవాలయాలు, చారిత్రక ప్రదేశాల పూర్తి వివరాలను గూగుల్ మ్యాప్స్‌లో నిక్షిప్తం చేస్తున్నది. అయితే రెవెన్యూ, సర్వే విభాగాల అధికారులు పూర్తి స్థాయిలో సహకరించినప్పుడే ఇది సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణకు గురైన భూములను చెర విడిపించి, పరిరక్షించేందుకు ఆధునిక సాంకేతికను పకడ్బందీగా వినియోగించినప్పుడే అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలుంటాయి.
కరీంనగర్, జనవరి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి కరీంనగర్ జిల్లా అనేక ప్రసిద్ధ దేవాలయాలకు పెట్టింది పేరు! ఎన్నో విశిష్ట దైవక్షేత్రాలకు నెలవైన నేల ఇది! దక్షిణ కాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ రాజరాజేశ్వర ఆలయం నుంచి కొండగట్టు ఆంజనేయ, ధర్మపురి లక్ష్మీనరసింహ, ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయాలతోపాటు మరెన్నో క్షేత్రాలకు కేరాఫ్‌గా ఉన్నది. అయితే ఈ దేవాలయాలకు ఆధునిక సాంకేతికతను జోడించేందుకు దేవాదాయశాఖ సిద్ధమైంది. ముందుగా ఎంపిక చేసిన గుడులకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఆ మేరకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) కింద నమోదు చేస్తున్నారు. జీపీఎస్ మ్యాప్ కెమెరా ద్వారా చిత్రాలు తీయించి అక్షాంశాలు, రేఖాంశాలు, ప్రాంతం ఆధారంగా సమాచారాన్ని దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయానికి పంపుతున్నారు. గూగుల్ మ్యాప్‌లో ఈ సమాచారమంతా నిక్షిప్తం అవుతుంది.
అప్పుడు ఏదేని ఆలయం గురించి సెర్చ్ చేస్తే.. అందుకు సంబంధించిన ఫొటోలతోపాటు గుడి ప్రాశస్థ్యం, విశిష్టత గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆస్కారముంటుంది. అలాగే ఆ ఆలయానికి చేరుకోవాలంటే.. జీపీఎస్ ద్వారా ఎక్కడి నుంచైనా వెళ్లడం సులువవుతుంది. ఆలయాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం కోసం గడిచిన మూడు నాలుగు నెలలుగా ఉమ్మడి జిల్లాలో జీపీఎస్ నమోదు ప్రక్రియ కొనసాగుతున్నది. ఆలయం ఎక్కడున్నది? దాని హద్దులేమిటి? ఆ ఆలయ పరిధిలోకి వచ్చే భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి? అవి ఏ సర్వే నంబర్లలో ఉన్నాయి? అన్న సమాచారాన్ని సైతం పొందు పరిచేందుకు ప్రయత్నాలు సాగుతున్నారు. ఇలా ప్రతి అంశం గురించి అందరికీ తెలిసేలా ఆధునిక సాంకేతికతతో సమాచారం పొందుపరిచేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఆక్రమణలో 800 ఎకరాలు?
ఉమ్మడి జిల్లాలో 1400కుపైగా చిన్నా పెద్ద దేవాలయాలున్నాయి. 74పైచిలుకు ఆదాయం సమకూరే ఆలయాలున్నాయి. భూములున్న ఆలయాలు మాత్రం 423 వరకు ఉన్నాయి. వీటి పరిధిలో 3,635.25 ఎకరాల భూమి ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. అందులో ఇప్పటికే 818 ఎకరాలపైగా ఆక్రమణకు గురైనట్టు గుర్తించారు. నిజానికి దేవాదాయ భూములు ఆక్రమణకు గురికాకుండా దేవాదాయ ధర్మాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ దూస రాజేశ్వర్ పనిచేసిన సమయంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్యలు తీసుకున్నారు. 1954-55 పహాణీలను పరిగణలోకి తీసుకొని, ఆయా దేవాలయాల స్థిర, చరాస్తుల రిజిస్టర్లను ఆధారంగా చేసుకొని.. సర్వే నంబర్ల వారీగా ఏ దేవాలయానికి ఎంత భూములున్నాయో లెక్కలు తేల్చారు. దాని ప్రకారంగా ఆనాడు ఉమ్మడి జిల్లాలో చిన్నా పెద్దా అన్ని కలిపి 1,489 ఆలయాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత జిల్లాలు వేరు కావడం.. కాళేశ్వరంలాంటి దేవాలయాలు ఇతర జిల్లాలకు వెళ్లడం తెలిసిందే కాగా, అప్పుడే, ఆయా ఆలయ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలు తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ, రెవెన్యూ విభాగం సహకరించక పోవడంతో తీసుకోలేకపోయారు.
అధికారుల సహకారముంటేనే..!
ప్రస్తుతం దేవాలయాలకు చెందిన భూములు, ఆస్తుల వివరాలను చిత్రాల ద్వారా సేకరించి, వెబ్సైట్లలో జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) ద్వారా పరిశీలించి భూముల సరిహద్దులను మార్కింగ్ చేయడానికి కసరత్తు ప్రారంభించారు. అయితే రెవెన్యూ, సర్వే విభాగం అధికారుల సహకారం ఉంటే తప్ప ఈ ప్రక్రియ పూర్తి కాదు. పూర్తి స్థాయి భూముల లెక్కలు తేలవు. అంతేకాదు, ఆక్రమణ జరిగినట్టు గుర్తించిన భూముల లెక్కలతోపాటు హద్దులు తేల్చాలన్నా సహాయం తప్పనిసరి. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఒక స్పెషల్‌డ్రైవ్ వంటి కార్యక్రమం చేపడితేనే ఇది సాధ్యమవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆలయాల జీపీఎస్ నమోదు కార్యక్రమం నడుస్తున్నదని, ఇది దాదాపు పూర్తి కావొచ్చిందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్ సుప్రియ ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఇది పూర్తయిన తర్వాత భూముల పరిరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు.
పొరపాటుగా ప్రచురణ
‘నమస్తే తెలంగాణ’ జిల్లా ఎడిషన్‌లో ‘కాంగ్రెస్ నాయకుల కబంధ హస్తాల్లో అసైన్డ్ భూములు?’ శీర్షికన బుధవారం ప్రచురించిన కథనంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మున్సిపల్ ఫ్లోర్‌లీడర్ ఎల్లె లక్ష్మీనారాయణ పేరిట రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలోని సర్వేనంబర్ 338/24 ఐదెకరాల అసైన్డ్ స్థలం ఉన్నట్టు ప్రచురితమైంది. నిజానికి ఈ స్థలం ఆయనది కాదు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఎల్లె లక్ష్మీనారాయణ తండ్రి రామయ్య అనే వ్యక్తికి చెందినదిగా గుర్తించాం. కాంగ్రెస్ నాయకుడు
ఎల్లె లక్ష్మీనారాయణ తండ్రి పేరు రాజయ్య. తండ్రి పేరు గమనించకపోవడం వల్ల జరిగిన పొరపాటుతో కాంగ్రెస్ నాయకుడికి చెందిన భూమిగా ప్రచురితమైంది. ఈ స్థలంతో మాజీ ఫ్లోర్ లీడర్ ఎల్లె లక్ష్మీనారాయణకు ఎటువంటి సంబంధం లేదు. తప్పుగా ప్రచురణ జరిగిన విషయాన్ని తెలుసుకొని బుధవారం ఉదయమే నమస్తే తెలంగాణ నెట్ ఎడిషన్‌ను మార్చాం. జరిగిన పొరపాటుకు చింతించడంతోపాటు పూర్తి వివరణ ఇస్తున్నాం.