తెలంగాణ సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ బర్త్‌డే వేడుక అంబరాన్నంటింది. ఊరూవాడా పండుగచేసుకున్నది. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడంతోపాటు కేకులు కోసి, మిఠాయిలు పంచారు. దవాఖానలు, ఆశ్రమాల్లో పండ్లు పంపిణీ చేయడంతోపాటు పలుచోట్ల అన్నదానాలు చేయగా, పలువురు వినూత్నంగా నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, శతమానం భవతి అంటూ కాంక్షించారు.
పెద్దపల్లి, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ)/ అంతర్గాం : జన హృదయ నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో 70 కిలోల భారీ కేక్‌ను కట్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మేయర్ యాదగిరి సునీల్‌రావు పాల్గొన్నారు. అనంతరం మొక్కలను పంపిణీ చేశారు. మేయర్ ఆధ్వర్యంలో కళాభారతి, జిల్లా గ్రంథాలయం, ప్రభుత్వ వైద్యశాల వద్ద 1300 మంది పేదలకు అన్నదానం చేశారు. అయితే ఒక్కో భోజనానికి 29 ఖర్చు అవుతుండగా, ఒక్కొక్కరికి 29 చొప్పున 1300 మందికి అన్నదానం కోసం సొంతంగా 35,300 అందజేశారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్ కలిసి కేక్ కట్ చేశారు. అలాగే ‘గిప్ట్ ఏ స్మైల్’లో భాగంగా కోరుకంటి చందర్ తన సేవా థృక్పథాన్ని చాటుకున్నారు. అంతర్గాం మండలం విలేజ్ అంతర్గాం గ్రామానికి చెందిన నిరుపేద వృద్ధురాలు కాంపెల్లి ఎల్లమ్మ కోసం ఇంటిని నిర్మించి, గృహప్రవేశం చేయించారు. మేడిపల్లిలో బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు, జడ్పీ ఉపాధ్యక్షుడు వొద్దినేని హరిచరణ్‌రావు కలిసి కేక్ కట్ చేశారు. అలాగే వేములవాడ రాజన్న ఆలయంలో నాయకులు కోడె మొక్కు చెల్లించుకున్నారు. ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో డీసీఎమ్మెస్ చైర్మన్ డా ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సత్తెమ్మ, బీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు మొగిలి శేఖర్, ఆకుల రాజేశ్ ప్రత్యేక పూజలు చేశారు.
బీఆర్ఎస్ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో నిర్వహించిన వేడుకల్లో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఆకునూరి శంకరయ్య పాల్గొని కేక్ కట్ చేశారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు సిఖిందర్ ఆధ్వర్యంలో రగుడు శివారులోని పంట పొలాల్లో కేసీఆర్ నిలువెత్తు కటౌట్‌తో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. మానకొండూర్ పల్లెమీద చౌరస్తా వద్ద బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీఆర్, జడ్పీటీసీ శేఖర్ కలిసి కేక్ కట్ చేశారు. గంగాధర మండలం బూరుగుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మొక్కలు నాటారు. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ ఎంపీటీసీ ఇల్లెందుల గీతాంజలి కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఆయన నిండునూరేండ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కాంక్షించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం దాకా పాదయాత్ర చేశారు. ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షులు రాధారపు సతీశ్ కుమార్, ప్రధాన కార్యదర్శి పుప్పాల బద్రి కలిసి బహ్రెయిన్‌లోని అండాలస్ గార్డెన్లో కేక్ కట్ చేశారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్‌డే సందర్భంగా ఓ మహిళా నాయకురాలు వినూత్నంగా తన అభిమానాన్ని చాటుకున్నారు. హుజూరాబాద్ మండలం తుమ్మనపల్లికి చెందిన గొడిశాల పావనిగౌడ్ కేసీఆర్ చిత్రాన్ని ట్యాటు రూపంలో పచ్చబొట్టుగా వేయించుకున్నారు. బాపు అంటే తనకు ప్రాణమని, బాపు కేసీఆర్ ఇక ఎప్పటికీ తనతోనే ఉంటారంటూ ఆమె మురిసిపోయారు.