caste census | చిగురుమామిడి, మే 1: జనాభా లెక్కల్లో కుల గణన కూడా చేపట్టాలని కేంద్ర కెబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడాన్ని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గీకురు రవీందర్ స్వాగతిస్తున్నామన్నారు. మండల కేంద్రములో ఆయను గురువారం విలేకరులతో మాట్లాడారు. దేశంలో కుల జనాభా తెలుసుకునేందుకు కుల గణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీతో పాటు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో కుల గణన ప్రధానాంశంగా ప్రచారం చేస్తూ కామారెడ్డి డిక్లరేషన్ నిర్ణయం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయన్నారు.
బీసీ సంఘాలు కేంద్రం కుల గణన చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో గత మాసములో జంతర్ మంతర్ లో జరిగిన అఖిల పక్ష మహా ధర్నాతో పాటు అనేక పోరాటలతో కేంద్ర ప్రభుత్వముపై ఒత్తిడి మేరకు ఎట్టకేలకు కుల గణన చేపట్టడం హర్షనీయమని ఆయన అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీతో పాటు బీసీ సంఘాల పోరాట ఫలితమన్నారు. దేశములోని ఓబీసీలు, బీసీలు సామాజికంగా రాజకీయం, ఆర్థికంగా బలోపేతం కావడం విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారన్నారు. ఈడబ్ల్యూఎస్ కు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా అమలు చేసిందన్నారు.
అలాగే సుప్రీం కోర్టు 50శాతం రిజర్వేషన్ మించకూడదనే నిబంధనను పార్లమెంట్ తీర్మానముతో సడలించాలన్నారు. కుల గణనకి నిర్ధిష్ట కాల పరిమితి నిర్ణయించాలని, గణన నిర్వహణకు తగిన బడ్జెట్ కేటాయించాలని సత్వరమే కులగణన ప్రక్రియ పూర్తయ్యేందుకు చిత్తశుద్ధితో తగిన కార్యాచరణ తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం మండల ప్రెసిడెంట్ శ్రీరామోజు రాజకుమార్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్, బీసీ సంఘ నాయకులు పెసరు శ్రీనివాస్, పోతర్ల శివాంజనేయులు, చౌదరి రాజేశం తదితరులు పాల్గొన్నారు.